బహుజన విద్యకు బాటలు వేసిన శ్రీనివాసపిళ్లై

ABN , First Publish Date - 2021-06-28T06:36:03+05:30 IST

భారతదేశ చరిత్రలో చాలా విషయాలు విస్మరణకు గురయ్యాయి. ఇందుకు కారణాలు అనేకం. కొందరు చరిత్రకారులు ఉద్దేశపూర్వకంగానే కొన్ని ఘటనలను, కొందరు వీరులను, త్యాగశీలురను, స్ఫూర్తి ప్రదాతలను...

బహుజన విద్యకు బాటలు వేసిన శ్రీనివాసపిళ్లై

భారతదేశ చరిత్రలో చాలా విషయాలు విస్మరణకు గురయ్యాయి. ఇందుకు కారణాలు అనేకం. కొందరు చరిత్రకారులు ఉద్దేశపూర్వకంగానే కొన్ని ఘటనలను, కొందరు వీరులను, త్యాగశీలురను, స్ఫూర్తి ప్రదాతలను విస్మరించారు. అట్లాగే కొంతమంది గురించి సరైన సమాచారం అందుబాటులో లేకపోవడంతో వారికి తగినంత చోటు కల్పించలేదు. ఇట్లా విస్మరణకు గురయిన వారిలో బహుజనులే ఎక్కువ. కొంచెం శ్రద్ధతో పరిశీలన, పరిశోధన చేసినట్లయితే ఎందరో మహానుభావులు వెలుగులోకి వస్తారు. అందులో భాగంగానే ఈ లాక్‌డౌన్‌ కాలంలో నేను దక్షిణ భారత తొలి రాజకీయ స్ఫూర్తి, పత్రికాధిపతి గాజుల లక్ష్మీనరసు శెట్టి గురించి పుస్తకం రాస్తూ ఉన్న క్రమంలో తారసపడ్డ వ్యక్తి కోమలేశ్వరపురం శ్రీనివాస పిళ్లై. ఏనుగుల వీరస్వామయ్య కాశీయాత్ర చరిత్ర పుస్తకానికి సంపాదకత్వం వహించి, ముద్రిపించిన వాడిగానే ఆయన ఇంతవరకూ తెలుసు. అయితే ఆయన మద్రాసు కేంద్రంగా 1830-1853 మధ్య కాలంలో విద్యా, సాంస్కృతిక, రాజకీయ రంగాల్లో తనదైన ముద్ర వేసిండు. పాశ్చాత్య చైతన్యాన్ని దేశీయ సమస్యలకు వినియోగించిండు.


మదరాసులో దళితులు, బాలికల కోసం మొదటిసారిగా పాఠశాలలను స్థాపించిన మహోన్నత వ్యక్తి శ్రీనివాస పిళ్లై. పచ్చియప్ప కళాశాల స్థాపనకు ప్రధాన కారకుడు. ఆ తర్వాత పచ్చియప్ప కళాశాల చారిటీస్‌ ట్రస్ట్‌ అధ్యక్షుడిగా ఉన్నాడు. మిత్రులతో కలిసి ‘మదరాసు లిటరరీ సొసైటీ’ని ఏర్పాటు చేసిండు. 1852లో తెలుగువాడు ‘రైజింగ్‌ సన్‌’ పత్రిక స్థాపకుడు ఎం. వెంకట్రాజులు నాయుడుతో కలిసి మదరాసు డిబేటింగ్‌ సొసైటిని కూడా స్థాపించిండు. గాజుల లక్ష్మీనరసు శెట్టితో కలిసి మదరాసు నేటివ్‌ అసోసియేషన్‌ కార్యకలాపాల్లో పాల్గొన్నాడు. 1852 ఆ ప్రాంతంలో మదరాసులో విద్యాభివృద్ధికి 70 వేల రూపాయలను విరాళంగా ప్రకటించిన వితరణశీలి. యూరోపియన్‌ అధికారులు జార్జ్‌ నార్టన్‌, జాన్‌ బ్రూస్‌ నార్టన్‌ లాంటి అడ్వకేట్‌ జనరల్స్‌తో కలిసి సాహిత్య, సామాజిక కార్యకలాపాల్లో విరివిగా పాల్గొన్నాడు. దేశీయుల్లో విదేశీ భావజాలం, చైతన్య స్ఫూర్తిని నింపడానికి కృషి చేసిండు. 


కోమలేశ్వరపురం శ్రీనివాస పిళ్లై పేరు సాహిత్యాభిమానులకు ముఖ్యంగా పాతతరం వారికి కొంత తెలుసు. ఏనుగుల వీర స్వామయ్య కాశీయాత్ర చరిత్ర రచనకు, ముద్రణకు ఈయనే కారకుడు. 18 మే 1830 - సెప్టెంబర్‌ 3, 1831 మధ్యకాలంలో అంటే దాదాపు 15 నెలల పాటు వీరస్వామయ్య కాశీ యాత్ర చేస్తూ ఆ సందర్భంగా తాను చూసిన విశేషాలను కోమలేశ్వర పురం శ్రీనివాస పిళ్లై కోరిక మేరకు ఆయనకు లేఖలుగా రాసిండు. ఇందులో కాశీకి పోవడానికి ఒక మార్గం, మళ్ళీ మదరాసుకు రావడానికి వేరొక మార్గాన్ని ఎంచుకున్నాడు. ఆనాడు మదరాసు సుప్రీం కోర్టులో (ఆ కాలంలో బొంబాయి, మదరాసు, కలకత్తాల్లో సుప్రీంకోర్టు ఉండింది) హెడ్‌ ఇంటర్‌ ప్రిటర్‌గా పనిచేసిన ఏనుగుల వీరస్వామయ్య (1780-1836 అక్టోబర్‌ 3) తన పరివారంతో పాటు యాత్ర చేసి వాటి విశేషాలను ఎప్పటికప్పుడు లేఖల ద్వారా పిళ్ళైకి రాసిండు. ఇట్లా అందిన లేఖల నన్నింటిని క్రోడీకరించి అందులో సమాజానికి ఉపయోగపడే అంశాలను పరిగ్రహించి, వ్యక్తిగత విషయాలను పరిహరించి 1838లో అంటే వీరస్వామయ్య చనిపోయిన  రెండేండ్లకు తెలుగులో ‘కాశీయాత్రా చరిత్ర’ పేరిట తన సంపాదకత్వంలో పిళ్లై వెలువరించాడు. దీనికి చక్కటి ముందుమాట కూడా రాసిండు. అంతే గాదు ఏనుగుల వీరస్వామయ్య జీవిత చరిత్రను జోడించిండు. ఈ పుస్తకం మొత్తం తెలుగు సాహిత్యంలో మొదటి యాత్రా చరిత్ర గ్రంథం. అయితే ఈ పుస్తకం తెలుగులో కన్నా ముందుగా తమిళంలో 1837లో ప్రచురితమయింది. తమిళంలోకి ఈ పుస్తకాన్ని కరకంబాడిలో పోస్టల్‌ రైటర్‌గా ఉన్నటువంటి పనయూరి వెంకు మొదలారి అనే అతను తర్జుమా చేసిండు. మరార్బీలోకి నాగపురి వీరస్వామి మొదలారి తర్జుమా చేసిండు. తర్వాతి కాలంలో ఇంగ్లీషులోకి కూడా అనువాదమయింది. 


మొదటిసారిగా 1838లో పుదూరి నారాయణశాస్త్రి చేత లేఖక దోషాలు దిద్దించి కోమలేశ్వరపురం శ్రీనివాస పిళ్లై ఈ కాశీయాత్ర చరిత్రను ముద్రిపించిండు. ఆ తర్వాత బ్రిటీష్‌ ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు ‘వర్తమాన తరంగిణి’ ముద్రణా లయంలో దాని నిర్వాహకులు పువ్వాడ వెంకట రావు 1869 డిసెంబర్‌లో ముద్రిపించిండు. ఆ తర్వాత విపులమైన పీఠిక వివరాలతో 1941లో అత్యంత శ్రమకోర్చి చరిత్రకారుడు దిగవల్లి వేంకట శివరావు మూడో ముద్రణ ప్రకటించిండు. దీనిలోనే ఒక పేరాలో శ్రీనివాస పిళ్లై గురించి రాసిండు. అందులో ఇలా ఉంది. ‘‘శ్రీనివాస పిళ్లగారు చాలా ధర్మాత్ము లున్నూ దురదృష్టి కలవారున్నూ అయి విద్యాభివృద్ధికి తమ యావచ్ఛక్తినీ వినియోగించారు. ఈయనకు సంఘసంస్కార మంటే ప్రీతి. వీరు ఉదారమైన భావాలు కలవారు. ఆడపిల్లలకు విద్య నేర్పవలెననే పట్టుదల కలవారు. స్వయంగా ఒక ఆడపిల్లల పాఠశాల నడిపారు. ఈయన ప్రజలలో అక్షరజ్ఞానము వ్యాపింప జేయవలెనని చాలా కృషి చేశారు. వీరు చనిపోయేటప్పుడు విద్యాదానం కోసం 70వేల రూపాయలు ధర్మం చేయడం వల్లనే వీరి దేశాభిమానము, విద్యాభివృద్ధియందు వీరికి గల ఆసక్తీ వెల్లడి అవుతాయి’’ (దిగవల్లి వేంకట శివరావు, కాశీయాత్రా చరిత్ర ముందుమాట, 1941:5). దాదాపుగా ఇవే మాటలు బ్రౌన్‌పై విశేషమైన పరిశోధన చేసిన కొత్తపల్లి వీరభద్రరావు తాను రాసిన ‘తెలుగు సాహిత్యంపై ఇంగ్లీషు ప్రభావం’ పుస్తకంలో రాసిండు.


తొలి ముద్రణకు రాసిన ముందుమాటలో పిళ్లై ఇలా పేర్కొన్నారు. ‘‘ఇందువల్ల అతి వినయముతో తెలియపరచుట యేమంటే యేనుగల వీరాస్వామి అయ్యవార్లగారు కాశీయాత్ర బోవునప్పుడు- యాత్ర సంగతులున్ను ఆయా ప్రదేశముల వినోద సంగతులున్ను వ్రాయించి పంపించవలెనని యడిగినందున వారు అలాగే అప్పుడప్పుడు వ్రాయించి పంపగా ఆ సంగతులను పుస్తకముగా చేర్చినాను. అది కరకరంబాటి తపాలా రైటరు -పనయూరు వెంకు మొదలారి అరవ భాషలో తర్జమా చేయించగా అచ్చు వేయించి ప్రచురము చేయబడి యున్నది అనేక గొప్ప ప్రభువులు తెనుగుభాషతో నావద్దనున్న యా పుస్తకము ప్రచురము చేయబడితే బహుజనోపయుక్తముగా నుండునని కోరినందున పైన చెప్పిన పుస్తకము కాశీయాత్ర చరిత్ర యనే పేరుతో అచ్చు మూలకముగా ప్రచుర పరచడమైనది’’ (శివరావు 1941: 1). అంటే శ్రీనివాస పిళ్లైకు తెలుగు కూడా బాగానే తెలుసు అనేది అర్థమవుతుంది. ఆయన తెలుగువాడే అని శివరావు అభిప్రాయపడ్డాడు.


నందన కరువు (1833)లో పిళ్ళై పేదలకు గంజి కేంద్రాలను నిర్వహించిండు. అట్లాగే వారికి అవసరమైన బట్టలను కూడా సమకూర్చిండు. మదరాసు సాహిత్య రంగంలో సంచలనం ‘మదరాసు లిటరరీ సొసైటీ’ స్థాపన. ఈ సంస్థ 1833లో ఏర్పాటయింది. ఈ సంస్థ తరపున సాహిత్య, సామాజిక అంశాలపై చర్చలు, గోష్టులు నిర్వహించే వారు. తర్వాతి కాలంలో ‘మదరాసు జర్నల్‌ ఆఫ్‌ లిటరేచర్‌ అండ్‌ సైన్స్‌’ అనే పత్రికను వెలువరించేవారు. ఈ పత్రికకు చాలా కాలం సి.పి.బ్రౌన్‌ సంపాదకుడిగా ఉన్నాడు. ఈ సంస్థ నిర్వహణలో మదరాసు పోలీసు మెజిస్ట్రేట్‌ వెంబాక్కం రాఘవాచారి (?-1842), ఏనుగు వీరస్వామయ్య, కోమలేశ్వరపురం శ్రీనివాస పిళ్లైలు ప్రధానమైన వ్యక్తులు. ఈ సంస్థ అధ్యక్షుడిగా మెకంజీ సహాయకుడు, సుప్రసిద్ధ పరిశోధకుడు కావలి వెంకట లక్ష్మయ్య కొంతకాలం పనిచేసిండు. సంస్థ తరపున ఆనాడు మదరాసు అడ్వకేట్‌ జనరల్‌గా పనిచేసిన దేశీయుల దోస్తు జార్జ్‌ నార్టన్‌ (1792- 1877) ఎన్నో ఉపయుక్తమైన ఉపన్యాసా లిచ్చిండు. అంతేగాదు శ్రీనివాస పిళ్లై పోరినందున (అవును అది నిజమే) కోర్టు కేసుల్లో నానుతున్న పచ్చియప్ప ధార్మిక సంస్థ ఏర్పాటును ఒక కొలిక్కిదీసుకు రావడంలో జార్జ్‌ నార్టన్‌ కీలకంగా పనిచేసిండు. బ్రాహ్మణేతరుడైన పచ్చియప్ప (1754-1794) దుబాసీగా పనిచేసిండు. వ్యాపారాల వల్ల చాలా ధనాన్ని సంపాదించిండు. ఈ ధనాన్ని ధార్మిక కార్యకలాపాలకు, విద్యా సంస్థలకు చెందేలా వీలునామాను రాసిండు. కోర్టులో వాదోపవాదాలు జరిగిన తర్వాత 1832 అక్టోబర్‌ 29న తీర్పు వెలువడింది. ఈ మేరకు ఎస్టేట్‌ ట్రస్టీలుగా ఒక కమిటీని ఏర్పాటు చేసింది. అందులో శ్రీనివాస పిళ్లైతో పాటు అయ్య శాస్త్రి (అధ్యక్షుడు), మీనాక్షయ్య బ్రాహ్మణి, అర్ముగం మొదలి, రాఘవ చెట్టి, రామానుజులు నాయుడు, ఏకాంబరం మొదలి, చొక్కప్ప చెట్టి, డబ్ల్యు. ఆదినారాయణయ్య లున్నారు. అంటే పచ్చియప్ప కళాశాల ఏర్పాటుకు ముందు నుంచే ట్రస్ట్‌ నిర్వహణలో శ్రీనివాస పిళ్లై ఉన్నాడు. ఈ ట్రస్టులో దేశీయులు కీలకంగా పనిచేసిండ్రు. యూరోపియన్లు కేవలం పాట్రన్స్‌గా మాత్రమే ఉన్నారు. దేశీయుల్లోనూ ఎక్కువ మంది బ్రాహ్మణేతరులున్నారు.


ఈ వీలునామాను అమలు చేయడంలోగా భాగంగా 1842 అక్టోబర్‌ రెండున పచ్చియప్ప పాఠశాల (తర్వాత కళాశాల)కు శంకుస్థాపన చేసిండ్రు. ఈ కళాశాల ధార్మిక బోర్డు అధ్యక్షుడిగా ఉంటూ సంస్థ నిర్మాణంలోనూ, పచ్చి యప్ప చిత్రపటాన్ని గీయించడంలోనూ పిళ్లై కీలక భూమిక పోషించిండు. ఈ సందర్భంలో మిత్రుడు, సాహితీవేత్త చిన్నయసూరి తండ్రి తిరువేంగడ జియ్యరు సహాయం తీసుకున్నడు. అప్పటికే ఆయన శతాధిక వృద్థుడు. పచ్చియప్పతో కలిసి పనిచేసిన వాడు కావడంతో ఆయన సూచనలు, వివరణల సహాయంతో లండన్‌కు చెందిన వ్యక్తితో చిత్రాన్ని గీయించారు. 1842 ఆ ప్రాంతంలో దేశీయులకు ముఖ్యంగా దళితులకు సైతం ప్రవేశం ఉండేలా ఒక పాఠశాలను ఏర్పాటు చేసిండు. అట్లాగే బాలికల కోసం కూడా ఒక ప్రత్యేక పాఠశాలను స్థాపించిండు. ఈ రెండింటిలోనూ ఇంగ్లీషు మాధ్యమంలో బోధన జరిగేది.


శ్రీనివాస పిళ్లై తండ్రి మునియపిళ్లై. ఆనాడు మదరాసులోని అత్యంత ధనవంతుల్లో ఒకడు. 1807లో కరువు వచ్చినపుడు వారిని ఆదుకునేందుకు ఈస్టిండియా కంపెనీ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీలో తొమ్మిది మంది దేశీయు లున్నారు. అందులో మునియపిళ్లై ఒకరు. తండ్రి సంపాదించిన ఆస్తిలో చాలా వరకు శ్రీనివాస పిళ్లై విద్యావసరాలకు వెచ్చించిండు. 


శ్రీనివాస పిళ్లై జూలై 5, 1849లో వీలునామా రాస్తూ చెంగల్పట్‌ జిల్లా మణిమంగంళం తాలూకాలో తమ ‘మేట తొడుకాడు’ ఎస్టేట్‌లో ఉన్న 1500ల కానీలు (ఒక కానీ 1.322 ఎకరాలకు సమానం) భూమిని పచ్చియప్ప చారిటీస్‌ ట్రస్ట్‌కు రాసిచ్చిండు. అంతేగాకుండా ఇందులో ఎనిమిదోవంతు ఫండ్స్‌ని పేద బ్రాహ్మణేతర విద్యార్థులకు స్కాలర్‌షిప్‌గా ఇవ్వాలని అందులో పేర్కొన్నాడు. ఆ మేరకు ఆయన కుటుంబంలోని వారు అర్హులైన వారిని ఎంపిక చేసేవారు. దేశంలో బ్రాహ్మణేతరుల విద్య కోసం పాటుపడిన మొదటి వ్యక్తి శ్రీనివాసపిళ్లై. వారి కోసం ఏకంగా ఒక ట్రస్టుని ఏర్పాటు చేసి దానితరపున కింది కులాల వారి విద్యకు కృషి చేసిండు. ఇది అప్పటికి విప్లవాత్మక చర్యగా గుర్తించాలి. 


అవును పేద బ్రాహ్మణేతర విద్యార్థులకు అవార్డులివ్వాలని 1849లోనే శ్రీనివాస ప్ళి వీలునామా రాసిండు. పిళ్లై కూడాబ్రాహ్మణేతరుడే. బహుజనుడు. శ్రీనివాస ప్ళి 21 జనవరి 1804 నాడు మదరాసులో జన్మించిండు. దిగవల్లి శివరావు ఈయన 1852లో చనిపోయిండని కాశీయాత్ర చరిత్రలో పేర్కొన్నాడు. నిజానికి పిళ్లై 27 మార్చి 1853 నాడు చనిపోయిండు. ఈయన యాదవ కులంలో జన్మించిండు. 


ఇట్లా ఒక సంపన్న యాదవ కులంలో పుట్టి చదువుకొని, 1830వ దశకంలోనే పేదవారి విద్యాభ్యాసం కోసం అహరహం కృషి చేసిండు. వితంతు వివాహాలను ప్రోత్సహించిండు. గాజుల లక్ష్మీనరసు శెట్టి, ఎం.వెంకట్రాజులు నాయుడు, తదితరులతో కలిసి మదరాసు కేంద్రంగా రాజకీయ కార్యకలాపాలకు ఊత మిచ్చిండు. ఇంకా చెప్పాలంటే 1830-1853 మధ్య కాలంలో శ్రీనివాస పిళ్లై లేకుండా మదరాసులో ఎలాంటి ప్రజాహిత సామాజిక, రాజకీయ కార్యక్రమం జరగలేదంటే అతిశయోక్తి కాదు. బహుశా మొత్తం భారతదేశంలో కింది కులాల వారి విద్య కోసం పరితపించిన వారిలో శ్రీనివాస పిళ్లై మొదటి వాడు. ఆయనకు నివాళి. 

సంగిశెట్టి శ్రీనివాస్‌



Updated Date - 2021-06-28T06:36:03+05:30 IST