స్వరూపానందస్వామిపై శ్రీనివాసానంద సంచలన ఆరోపణలు

ABN , First Publish Date - 2020-06-06T03:34:35+05:30 IST

‘స్వామివారి భూములు.. స్వాములు స్వాహా

స్వరూపానందస్వామిపై శ్రీనివాసానంద సంచలన ఆరోపణలు

హైదరాబాద్ : ప్రభుత్వాలను బ్లాక్‌మెయిల్‌ చేయడం స్వరూపానందస్వామికి అలవాటేనని ఏపీ సాధుపరిషత్‌ అధ్యక్షులు శ్రీనివాసానందస్వామి సంచలన ఆరోపణలు చేశారు. ‘స్వామివారి భూములు.. స్వాములు స్వాహా. పీఠాల పేరుతో వేల అడుగుల భూకబ్జా. శారదాపీఠానికి పెద్దపీట వెనుక మతలబేంటి?’ అనే విషయంపై చర్చ ‘ఏబీఎన్ ఆంధ్రజ్యోతి’ THE DEBATE నిర్వహించింది. ఈ డిబెట్‌లో శ్రీనివాసానందస్వామి మాట్లాడుతూ.. తిరుమల కొండపై అన్యమత ప్రచారాలు జరిగినా పట్టించుకోలేదని వ్యాఖ్యానించారు. స్వరూపానందస్వామి అడుగులకు మడుగులు వత్తుతున్నారన్నారు. తిరుమలలో స్వరూపానంద పీఠం పెట్టుకుని ఏం దైవకార్యాలు చేస్తారో చెప్పాలని ఈ డిబెట్ ద్వారా ఆయన ప్రశ్నించారు. తిరుమలలో వ్యాపార కేంద్రాలుగా పీఠాలు మారుతున్నాయని తీవ్ర ఆరోపణలు చేశారు.


దాడులు పెరిగాయ్..!

అంతటితో ఆగని ఆయన.. జగన్‌ ప్రభుత్వం వచ్చాక దేవాలయాలపై దాడులు పెరిగాయని శ్రీనివాసానంద ఆరోపించారు. ఇళ్ల స్థలాలకు దేవాలయ భూములు వాడుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ఇతర ప్రార్థనామందిరాలకు మాత్రం స్థలాలు ఇస్తున్నారని శ్రీనివాసానందస్వామి చెప్పుకొచ్చారు. ఇదే డిబెట్‌లో పాల్గొన్న సీపీఎం నేత కందారపు మురళి మాట్లాడుతూ.. తిరుమలలో ఒక్క అడుగు కూడా ప్రైవేట్‌ వ్యక్తులకు ఇవ్వొద్దని గతంలో టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుందని గుర్తు చేశారు. తిరుమల కొండపై 31 మఠాలు ఉన్నాయని.. వాటికి ఎలాంటి విధివిధానాలు లేవన్నారు. చాలా మంది ప్రముఖులకు తిరుమలలో గెస్ట్‌హౌస్‌లు ఉన్నాయని ఆరోపించారు. విజిలెన్స్‌ వాళ్లకు మఠాల దగ్గరికి వెళ్లే ధైర్యం లేదని కందారపు మురళి వ్యాఖ్యానించారు.


అధికారులు ఏం చేస్తున్నారు..!

తిరుమలలో అంగుళం భూమి ఉన్నా చాలని చాలా మంది భావిస్తుంటారని బీజేపీ నేత భానుప్రకాష్‌ చెప్పుకొచ్చారు. తిరుమల కొండలో అన్నీ స్వామివారి ఆస్తేనన్నారు. గత ప్రభుత్వాల హయాంలో వారికి కావాల్సిన స్వాములకు స్థలాలను కేటాయించుకున్నారన్నారు. కొండపై స్థలాన్ని ఆక్రమించుకుంటుంటే అధికారులు ఏం చేస్తున్నారు? ఈ డిబెట్ ద్వారా భానుప్రకాష్‌ ప్రశ్నించారు.

Updated Date - 2020-06-06T03:34:35+05:30 IST