శ్రీవారి ఆలయంలో నేడు శ్రీరామనవమి ఆస్థానం

ABN , First Publish Date - 2021-04-21T10:10:38+05:30 IST

శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం తిరుమల శ్రీవారి ఆలయంలో ఘనంగా ఆస్థానం నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు సీతారామ లక్ష్మణ సమేత హనుమంతులవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహిస్తారు.

శ్రీవారి ఆలయంలో నేడు శ్రీరామనవమి ఆస్థానం

  • -హనుమంతుడి జన్మస్థలంపై ఆధారాలు చూపనున్న టీటీడీ

తిరుమల, ఏప్రిల్‌ 20 (ఆంధ్రజ్యోతి):  శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం తిరుమల శ్రీవారి ఆలయంలో ఘనంగా ఆస్థానం నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు సీతారామ లక్ష్మణ సమేత హనుమంతులవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహిస్తారు. రాత్రి 7 గంటలకు హనుమంత వాహనాన్ని ఊరేగించి, 10 నుంచి 11 గంటల మధ్య బంగారువాకిలి వద్ద శ్రీరామనవమి ఆస్థానాన్ని శాస్ర్తోక్తంగా నిర్వహిస్తారు. 22వతేదీ రాత్రి 8 నుంచి 9 గంటల మధ్యలో బంగారువాకిలి వద్ద శ్రీరామ పట్టాభిషేక మహోత్సవాన్ని నిర్వహిస్తారు. మరోవైపు ‘ఆంజనేయుడి జన్మస్థలం సప్తగిరుల్లోని అంజనాద్రే’ అనే ఆధారాలను బుధవారం ఉదయం 11 గంటలకు పండితులు శ్రీవారి ఆలయం ముందున్న నాదనీరాజనం వేదికపై మీడియా ద్వారా  నిరూపించనున్నారు. 


-శ్రీవారి సేవకుల సేవలకు తాత్కాలిక బ్రేక్‌

కొవిడ్‌ నేపథ్యంలో భక్తులు స్వచ్ఛందంగా పాల్గొనే ‘శ్రీవారిసేవ’ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు టీటీడీ మంగళవారం ప్రకటించింది. తిరిగి ఎప్పటి నుంచి శ్రీవారిసేవ మొదలవుతుందనే విషయాన్ని ముందుగానే తెలియజేస్తామని, ఏప్రిల్‌, మే, జూన్‌ నెలల్లో శ్రీవారి సేవకు రాదలిచిన వలంటీర్లు  గమనించాలని టీటీడీ కోరింది. 


-24 నుంచి శ్రీవారి వసంతోత్సవాలు

తిరుమల శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలను ఈనెల 24 నుంచి 26వ తేదీవరకు నిర్వహించనున్నారు. కొవిడ్‌ కారణంగా గతేడాది తరహాలోనే శ్రీవారి ఆలయంలో ఏకాంతంగా వీటిని నిర్వహించనున్నారు. వసంతోత్సవాల్లో భాగంగా రెండో రోజు నిర్వహించే స్వర్ణరథోత్సవాన్ని రద్దు చేశారు. ఈ ఉత్సవాల కారణంగా  మూడురోజుల పాటు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసింది. 


-మే నెల రూ.300 దర్శన టికెట్ల కోటా విడుదల

తిరుమల శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల మే నెల కోటాను మంగళవారం టీటీడీ ఆన్‌లైన్‌ ద్వారా విడుదల చేసింది. ప్రస్తుతం రోజుకు ఉన్న 25 వేల టికెట్ల కోటాను 15వేలకు కుదించారు. సాధారణంగా ఆన్‌లైన్‌లో టికెట్ల కోటా విడుదల చేసిన కొద్ది గంటల్లోనే భక్తులు తమకు కావాల్సిన తేదీల్లో భారీగా బుక్‌ చేసుకునేవారు. ప్రస్తుతం కరోనా కేసులు అధికంగా నమోదవుతున్న క్రమంలో మంగళవారం సాయంత్రం 6 గంటల సమయానికి ఒక్కరోజుకు సంబంధించిన కోటా కూడా పూర్తికాలేదు. అలాగే మధ్యాహ్నం 3 గంటలకు తిరుపతి, తిరుమలల్లోని గదుల కోటాను కూడా విడుదల చేశారు. ఈ కోటా కూడా ఖాళీగానే ఉంది. 

Updated Date - 2021-04-21T10:10:38+05:30 IST