కాళరాత్రి అలంకారం

ABN , First Publish Date - 2020-10-24T11:07:32+05:30 IST

శ్రీశైలంలో దసరా మహోత్సవాల ఏడో రోజు శుక్రవారం సాయంత్రం అమ్మవారి ఉత్సవమూర్తికి కాళరాత్రి అలంకారం చేశారు.

కాళరాత్రి అలంకారం

ఉత్సవమూర్తులకు గజవాహన సేవ

నేడు రాష్ట్ర ప్రభుత్వంచే పట్టు వస్త్రాల సమర్పణ


కర్నూలు(కల్చరల్‌), అక్టోబరు 22: శ్రీశైలంలో దసరా మహోత్సవాల ఏడో రోజు శుక్రవారం సాయంత్రం అమ్మవారి ఉత్సవమూర్తికి కాళరాత్రి అలంకారం చేశారు. అనంతరం గజవాహన సేవను నిర్వహించారు. అంతకుముందు కుమారి పూజలు చేశారు. సాయంత్రం అమ్మవారి ఉత్సవ మూర్తికి కాళరాత్రిగా అలంకరించారు. నవదుర్గలలో ఏడో రూపమే కాళరాత్రి. ఈ దేవి నల్లటి దేహఛాయతో, జుట్టు విరియబోసుకుని పెడబొబ్బ నవ్వులతో రౌద్రరూపంలో ఉంటుంది. ఈ దేవి చతుర్భుజాలను కలిగి ఉండి కుడివైపున అభయ హ స్తం, వరద ముద్రను, ఎడమవైపు ఖడ్గం, లోహకంటకాన్ని ధరించి ఉంటుంది.


కాళరాత్రి స్వరూపం రౌద్రంగా ఉన్నప్పటికీ ఈమె శుభ ఫలితాతలనే ఇస్తుందని, అందుకే శుభంకరిగా పిలుస్తారని పండితులు చెబుతున్నారు. కాళరాత్రి దేవి దుష్ట శక్తులను నాశనం చేస్తుందని, ఈ దేవిని ఆరాధించడం వల్ల భయాలనేవేవి ఉండవని భక్తుల విశ్వాసం. అలంకారం తర్వాత ఉత్సవమూర్తులకు గజవాహన సేవ నిర్వహించారు. పూజా కార్యక్రమాల్లో దేవస్థానం ఈవో కేఎస్‌ రామరావు, వేద పండితులు, అర్చకస్వాములు పాల్గొన్నారు. కార్మిక, ఉపాధికల్పన, శిక్షణ, కర్మాగారాల శాఖమంత్రి గుమ్మనూరు జయరాం శనివారం సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలను సమర్పిస్తారని ఈవో కేఎస్‌ రామరావు తెలిపారు. 


కాళరాత్రి దుర్గ.. కామేశ్వరీదేవి

మహానంది, అక్టోబరు 23: దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఏడో రోజు శుక్రవారం మహానంది క్షేత్రంలో కామేశ్వరీదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం 6 గంటల నుంచి ఆలయ ప్రాంగణంలోని ఆలంకార మండపంలో కామేశ్వరీదేవి అమ్మవారిని కాళరాత్రి దుర్గగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. అనంతరం సహస్ర దీపాలంకరణ సేవ నిర్వహించారు. కాళరాత్రి అలంకారంలో ఉన్న కామేశ్వరీ దేవికి అశ్వవాహన సేవను నిర్వహించారు. రాత్రి 9 గంటలకు ఆలయ వీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. మేళతాళాలు, చిన్నారుల కూచిపూడి నృత్య ప్రదర్శన, కోలాటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

Updated Date - 2020-10-24T11:07:32+05:30 IST