నేటినుంచి మల్లన్న దర్శనాలు పునఃప్రారంభం.. వీరికి మాత్రమే అవకాశం

ABN , First Publish Date - 2020-08-14T19:28:12+05:30 IST

శ్రీశైలంలో దర్శనాలను శుక్రవారం నుంచి పునరుద్ధరిస్తున్నట్లు దేవస్థానం..

నేటినుంచి మల్లన్న దర్శనాలు పునఃప్రారంభం.. వీరికి మాత్రమే అవకాశం

కర్నూలు(ఆంధ్రజ్యోతి): శ్రీశైలంలో దర్శనాలను శుక్రవారం నుంచి పునరుద్ధరిస్తున్నట్లు దేవస్థానం అధికారులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా జూలై 15 నుంచి శ్రీశైలంలో దర్శనాలు నిలిచిపోయాయి. స్థానిక తహసీల్దార్‌ శ్రీశైలం క్షేత్ర పరిధిని కంటైన్మెంట్‌ జోన్‌ను నుంచి మినహాయించడంతో దేవాదాయశాఖ కమిషనర్‌ అనుమతితో దర్శనాలను పునఃప్రారంభిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆగస్టు 14వ తేదీన స్థానికులకు దర్శన అనుమతి ఉంటుందని, మిగతా వారు ఆన్‌లైన్‌లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలన్నారు.


దర్శనం ఉదయం 6.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు, తిరిగి సాయంత్రం 5.30 నుంచి 7.30 గంటల వరకు ఉంటుందని తెలిపారు. ఉచిత దర్శనం, శ్రీఘ్ర దర్శనం(150 రూపాయల దర్శనం), అతి శీఘ్ర దర్శనం(500 రూపాయల దర్శనం)కు అనుమతిస్తామన్నారు. 10 నుంచి 65 ఏళ్లలోపు వారినే అనుమతిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం అలంకార దర్శనం మాత్రమే ఉంటుందన్నారు. దర్శనానికి వచ్చేవారు ఆధార్‌ కార్డ్‌, గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకురావాలని కోరారు. ఆన్‌లైన రిజిస్ట్రేషన్‌ టోకెన్‌, గుర్తింపు కార్డుతో సరిపోలిన తర్వాతే అనుమతిస్తామన్నారు. భక్తులు మాస్కులు ధరించాలని, భౌతిక దూరాన్ని పాటించాలని సూచించారు. క్యూలైన్‌ ప్రవేశ మార్గం వద్ద చేతులు శుభ్రపరుచుకునేందుకు శానిటైజర్లను ఏర్పాటు చేశామన్నారు. ఉచిత ప్రసాదాలు తాత్కాలికంగా నిలుపుదల చేశామన్నారు.


Updated Date - 2020-08-14T19:28:12+05:30 IST