కుషన్‌ ఉంటే కూల్‌!

ABN , First Publish Date - 2020-10-19T08:55:34+05:30 IST

తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఎగువ రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణల్లో భారీవర్షాలు కురిసి..ఏపీలోని ప్రధాన జలాశయాల్లోకి అదంతా వరదలెత్తింది.

కుషన్‌ ఉంటే కూల్‌!

ఎంత వరదనైనా నిర్వహించొచ్చు

శ్రీశైలం, సాగర్‌లో అది లేకే ముంపు

2009లో 25 లక్షల క్యూసెక్కులపైగా

వరదనీ తట్టుకొన్న శ్రీశైలం డ్యామ్‌

ఇప్పుడు 5 లక్షల క్యూసెక్కులకే విలవిల

అప్పట్లో రాష్ట్రాన్ని కాపాడింది కుషన్లే

ఆ పాఠం మరిచిన రాష్ట్ర ప్రభుత్వం

జలవనరుల నిపుణుల విశ్లేషణ

ఎంత వరదనైనా నిర్వహించొచ్చు

శ్రీశైలం, సాగర్‌లో అది లేకే ముంపు


(అమరావతి-ఆంధ్రజ్యోతి):తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఎగువ రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణల్లో భారీవర్షాలు కురిసి..ఏపీలోని ప్రధాన జలాశయాల్లోకి అదంతా వరదలెత్తింది. వందలాది గ్రామాలను, రైతుల పంటలను ముంచేసింది. దీంతో వరద నిర్వహణ యాజమాన్యం తీరు, అందులోనూ శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుల్లో అసలు ‘కుషన్‌’ ఉంచుతున్నారా అనేది చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా ఎగువ వరదను దృష్టిలో ఉంచుకుని ప్రాజెక్టు పూర్తి సామర్థ్యానికి కొంత తక్కువగా నీటిని నిల్వ చేసుకుంటారు. ఈ ఏర్పాటునే కుషన్‌ అంటారు. అనూహ్యరీతిలో వచ్చిపడే ప్రవాహాలను తట్టుకొని నిలవడానికి డ్యామ్‌కు ఈ కుషన్‌ బాగా కలిసివస్తుంది. ఉదాహరణకు రెండు అడుగుల కుషన్‌ ఉంచితే, ఐదు లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా డ్యామ్‌ తట్టుకోగలదు. శ్రీశైలం ఎగువన ఆలమట్టి సహా ఎన్నో డ్యామ్‌లకు ఈ ఏర్పాటు ఉంది. ‘మరి శ్రీశైలం, సాగర్‌లలో ఎందుకు కుషన్‌ ఉంచడంలేదు?’ అని జలవనరుల నిపుణులు విస్తుపోతున్నారు. 


2009 పాఠమిదే!

శ్రీశైలం డ్యామ్‌కు భారీగా వరద ఎగువ నుంచి వస్తుందని 2009 అక్టోబరు 2న కేంద్ర జల సంఘం అంచనా వేసింది. మహారాష్ట్ర, కర్ణాటకలలో భారీ వర్షాలకు రాష్ట్రంలో కుండపోత వర్షపాతం జత కలవడంతో ప్రభుత్వం కలవరపడింది. దాదాపు 11 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం రావచ్చునని కేంద్ర జలసంఘం అంచనా వేసింది. అయితే, అనూహ్యంగా 25 లక్షల క్యూసెక్కుల వరద శ్రీశైలానికి వచ్చేసింది.  శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి ఎత్తు 885 అడుగులైతే, 896.5 అడుగుల ఎత్తులో జలాలు ప్రవహించాయి. కృష్ణా నదికి తోడు తుంగభద్ర, హంద్రీ నదులూ పరవళ్లు తొక్కాయి. అయితే, అప్పట్లో శ్రీశైలం, నాగార్జునసాగర్‌ల్లో రెండు అడుగుల మేర కుషన్‌ ఉంచారు.


అంటే ఒక్కో డ్యామ్‌లో ఐదు లక్షల క్యూసెక్కుల ప్రవాహాలను అదనంగా నిల్వ చేయొచ్చునన్నమాట! దీంతో అంచనాలకు మించి ఎగువ నుంచి ప్రవాహాలు చేరినా, పెను ముంపేమీ చోటుచేసుకోలేదు. శ్రీశైలం బ్యాక్‌వాటర్‌ ఎగదన్ని కర్నూలు నగరం మాత్రం మునిగింది. శ్రీశైలం గేట్లు పూర్తిగా ఎత్తివేసి, ఎగువ నుంచి వచ్చిన భారీ వరద ప్రవాహాన్ని వచ్చింది వచ్చినట్టు కిందకు వదిలారు. సాగర్‌ నుంచి పులిచింతల, ప్రకాశం బ్యారేజీల మీదుగా విడతల వారీగా నీటిని కిందకు పంపించారు. కానీ, ఇప్పుడు శ్రీశైలం సహా ప్రధాన జలాశయాల్లో నీటి నిల్వలు గరిష్ఠ స్థాయిలో ఉన్నాయి. ఈ స్థితిలో ఆలమట్టి నుంచి వచ్చిన 5 లక్షల క్యూసెక్కుల వరదను నిర్వహించడమే అధికారులకు దుర్భరమైపోయింది.  అదే కుషన్‌ ఉంచుకుంటే ఇదేమంత ‘ఉధృతి’ కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే 2009 తరహా వరదను ప్రాజెక్టులు తట్టుకోలేవని తేల్చిచెబుతున్నారు. ఈ తరహా వరద నిర్వహణ యాజమాన్యం తీరుపై సాగునీటి వినియోగదారుల సంఘం తుమ్మల లక్ష్మణరావు ‘ఆంధ్రజ్యోతి’ వద్ద తన ఆవేదన పంచుకొన్నారు. ‘‘రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్వహణ.. వరద యాజమాన్య విధానాలను పరిశీలిస్తుంటే.. దేవుడిపై భారం వేసి వదిలేసినట్లుగా కనిపిస్తోంది. గతంలోనూ వరదల సమయంలో యాజమాన్య విధానంలో లోపాలు తలెత్తాయి. అయినా జల వనరుల శాఖ వైఖరిలో  మార్పు రావడం లేదు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.


సంయుక్త కమిటీ ఏది?

తుఫానులు, వాయుగుండాలు సంభవించినప్పుడు, సాగు నీటి ప్రాజెక్టుల పర్యవేక్షణ, వరద నిర్వహణ జల వనరుల శాఖ ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ బాధ్యత. ఎప్పటికప్పుడు ప్రాజెక్టుల వద్ద పర్యవేక్షణ చేస్తున్న సూపరింటెండింగ్‌ ఇంజనీరుతో సమన్వయం చేసుకుంటూ ఎగువ నుంచి వస్తున్న నీటి ప్రవాహాన్ని, వేగాన్ని అంచనా వేసుకుంటూ ప్రధాన ప్రాజెక్టులలో నీటి నిల్వలను ఎంతవరకు ఉంచుకోవాలో ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ గమనిస్తారు.


ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలపై ఎప్పటికప్పుడు సూపరింటెండింగ్‌ ఇంజనీర్లకు ఆదేశాలు ఇస్తారు. రాష్ట్ర విభజన తరువాత, శ్రీశైలం, నాగార్జున సాగర్‌ రెండూ ఇరు రాష్ట్రాలకు చెందిన సంయుక్త ప్రాజెక్టులుగా మారాయి. వాటి పర్యవేక్షణ కోసం రెండు రాష్ట్రాల బాధ్యత. దీనికోసం ఇరు రాష్ట్రాల జల వనరుల శాఖలోని సాగునీటి విభాగం ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌లతో సంయుక్త కమిటీ ఏర్పాటు కావాలి. నిర్వహణ సంబంధ విషయాల్లో ఇరుపక్షాల మధ్య ఈ కమిటీ సమన్వయకర్తగా ఉంటుంది. కానీ, రాష్ట్ర విభజన జరిగి ఆరేళ్లు పూర్తయినా ఇప్పటి వరకూ కమిటీ ఏర్పాటు కాలేదు.

Updated Date - 2020-10-19T08:55:34+05:30 IST