నెల తర్వాతే ‘కల్వకుర్తి’ పునరుద్ధరణ!

ABN , First Publish Date - 2020-10-20T09:59:20+05:30 IST

మూడో మోటారులో సాఫ్ట్‌వాల్‌ దెబ్బతిన్నందునే కల్వకుర్తి లిఫ్టు మునక చోటుచేసుకుందని చెబుతున్నప్పటికీ.. నీటిని బయటకు పంపించిన

నెల తర్వాతే ‘కల్వకుర్తి’ పునరుద్ధరణ!

  • డీవాటరింగ్‌ ప్రక్రియ పది రోజుల్లో పూర్తయితేనే
  • పంప్‌హౌ్‌సలో మందకొడిగా సాగుతున్న నీటి తోడివేత
  • మోటార్లను ఆరబెట్టేందుకే  పది రోజులు
  • ఆపై 15 రోజులకొకటి వినియోగంలోకి 
  • సీతారామ  నుంచి ప్యానెల్‌ బోర్డులు 

నాగర్‌కర్నూల్‌, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): కల్వకుర్తి ఎత్తిపోతల పథకం (కేఎల్‌ఐ) పునరుద్ధరణకు కనీసం నెల రోజుల సమయం పడుతుందని ఇరిగేషన్‌ అధికారులు అంటున్నారు. పంప్‌హౌ్‌సలో చేరిన నీటిని బయటకు తోడేసే ప్రక్రియ మందకొడిగా సాగుతుండడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. కల్వకుర్తి లిఫ్టు ఇటీవల ముంపునకు గురై.. 11 అంతస్తుల్లో దాదాపు 42 మీటర్ల వరకు నీళ్లు చేరడం తెలిసిందే. పంప్‌హౌ్‌సలో చేరిన ఈ నీటిని బయటకు తోడివేసేందుకు దాదాపు 600 హెచ్‌పీల సామర్థ్యం గల మోటార్లు అమర్చాల్సి ఉంది. కానీ, సోమవారం మధ్యాహ్నం వరకు 300 హెచ్‌పీల సామర్థ్యం గల మోటార్లను మాత్రమే పంపుహౌస్‌ వద్దకు చేర్చగలిగారు. మరోవైపు మోటార్లన్నీ నీట మునగడంతో కరెంటు సరఫరాను నిలిపివేసినందున.. జనరేటర్ల ద్వారా డీవాటరింగ్‌ పంపులు సజావుగా పనిచేయడంలేదు. దీంతో రెండు రోజుల్లో కేవలం మూడు అడుగుల నీటిని మాత్రమే బయటకు తోడగలిగారు. కాళేశ్వరం నుంచి 150 హెచ్‌పీల సామర్థ్యం గల మరో రెండు మోటార్లను తెప్పిస్తున్నట్లు తెలంగాణ ప్రాజెక్టుల సలహాదారు పెంటారెడ్డి ుఆంధ్రజ్యోతి్‌కి తెలిపారు. 


నీటిని తోడేస్తేనే వాస్తవాలు వెలుగులోకి..

మూడో మోటారులో సాఫ్ట్‌వాల్‌ దెబ్బతిన్నందునే కల్వకుర్తి లిఫ్టు మునక చోటుచేసుకుందని చెబుతున్నప్పటికీ.. నీటిని బయటకు పంపించిన తర్వాతే వాస్తవాలు తెలిసే అవకాశాలున్నాయి. ప్రస్తుతానికి ఇరిగేషన్‌ నిపుణుల అంచనాల మేరకు కేఎల్‌ఐలో ఒక్క పంపును ప్రారంభించాలంటే కనీసం 35-45 రోజుల వరకు ఎదురు చూడాలి. 30 మెగావాట్ల సామర్థ్యం గల మూడో మోటారులో బ్లాస్టింగ్‌ల ద్వారా ఫౌండేషన్‌ బెడ్‌కు నష్టం వాటిల్లి ఉంటే.. ప్రత్యామ్నాయంగా ఉన్న నాలుగు పంపుల్లో ఏదో ఒక పంపును నెలరోజుల లోపల ప్రారంభించగలుగుతామనే విశ్వాసంతో అధికారులు ఉన్నారు. అయితే ఈ ప్రక్రియ అంతా సజావుగా సాగాలంటే డీవాటరింగ్‌ పది రోజుల్లోగా పూర్తి కావాల్సి ఉంటుందని నిపుణులు అంటున్నారు. డీవాటరింగ్‌ తర్వాత నీట మునిగిన మోటార్లను ఆరబెట్టడానికి కనీసం పది రోజులు పడుతుంది. ఈ నేపథ్యంలో తాగునీటి అవసరాల కోసం మొదట ఒక మోటారును ప్రారంభించి.. ఆ తర్వాత ప్రతి 15 రోజులకు ఒక మోటారును వినియోగంలోకి తీసుకొచ్చేలా అధికారులు చర్యలు ప్రారంభించారు. ఇందుకోసం సీతారామ ప్రాజెక్టు నుంచి ఒక్కొక్కటి 40 లక్షల విలువ చేసే రెండు ప్యానెల్‌ బోర్డులను తెప్పించారు. 


మిషన్‌ భగీరథకు గుడిపల్లి గట్టు రిజర్వాయర్‌ నీళ్లు..

కల్వకుర్తి లిఫ్టు నుంచి ఆరు జిల్లాల్లోని 19 మునిసిపాలిటీలకు మిషన్‌ భగీరథ నీటిని సరఫరా చేయాల్సి ఉండటంతో అధికారులు ప్రత్యామ్నాయం వైపు దృష్టి సారించారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో భాగమైన ఎల్లూరు, జొన్నల బొగుడ, గుడిపల్లి గట్టు రిజర్వాయర్లలో దాదాపు రెండు టీఎంసీల నీరు ప్రస్తుతానికి నిల్వ ఉంది. ఎంజీఎల్‌ఐ ఆయకట్టుకు ఒక టీఎంసీ నీటిని వినియోగించుకొని మిగతా ఒక టీఎంసీ నీటిని గుడిపల్లిగట్టు రిజర్వాయర్‌ ద్వారా గౌరీదేవిపల్లి మిషన్‌ భగీరథ మెయిన్‌లైన్‌కు అనుసంధానం చేయాలని అధికారులు భావిస్తున్నారు. దీంతో నెల రోజులపాటు ఎలాంటి ఇబ్బంది ఉండదనే అభిప్రాయానికి వచ్చారు. ఈ దిశగా ప్రభుత్వానికి నివేదిక కూడా సమర్పించారు. 


పాలమూరు దారిద్ర్యానికి కాంగ్రెస్సే కారణం: శ్రీనివాస్‌గౌడ్‌

పాలమూరు దారిద్ర్యానికి కాంగ్రెస్సే కారణమని, 50 ఏళ్లు పాలించిన ఆ పార్టీ.. ప్రజలకు తాగునీరు ఇవ్వలేదని మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌ మండిపడ్డారు. ఆరేళ్ల తెలంగాణ పాలనలో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకం చేపడుతుంటే కాంగ్రెస్‌ జీర్ణించుకోలేకపోతున్నదని విమర్శించారు. మహబూబ్‌నగర్‌లో విలేకరులతో ఆయన మాట్లాడారు. ఎల్లూరు పంపుల మునకకు సాంకేతిక లోపం కారణమై ఉండవచ్చని, ప్రతిపక్షాలు మాత్రం ప్రభుత్వం తప్పు చేసినట్లు చిత్రీకరించే ప్రయత్నం చేయడం మంచిదికాదన్నారు. టీఆర్‌ఎ్‌సను విమర్శించే నైతిక హక్కు కాంగ్రె్‌సకు లేదన్నారు.


Updated Date - 2020-10-20T09:59:20+05:30 IST