Abn logo
Feb 2 2021 @ 02:58AM

స్థిమితపరచే బడ్జెట్

కొత్తవ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల నిరసనలతో దేశం అట్టుడుకుతోంది. కనీస మద్దతు ధర కార్యక్రమం కింద 2013–14 ఆర్థిక సంవత్సరం నుంచి 2019–20 ఆర్థిక సంవత్సరం మధ్య కొనుగోళ్లు ఒకటిన్నర రెట్లు పెరిగాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. అయితే ఇదే కాలంలో మూలధన లాభాల పన్ను (కేపిటల్ గెయిన్స్ ట్యాక్స్) 220 నుంచి 289కి అంటే 31 శాతం పెరిగినట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రచురించిన గణాంకాలు వెల్లడించాయి. దీన్ని బట్టి కొనుగోలు ధరలో ‘నిజమైన’ పెరుగుదల గత ఆరు సంవత్సరాలలో కేవలం 19 శాతం మాత్రమే. ఈ స్వల్ప పెరుగుదల సైతం రైతు ఆదాయంలో పూర్తిగా ప్రతిబింబించలేదు! డీజిల్, విత్తనాలు, ఎరువుల ధరలు, కూలీరేట్లు మొదలైనవి గణనీయంగా పెరిగిపోయిన కారణంగానే రైతుల ఆదాయాల్లో పెరుగుదల కొరవడింది. రైతు ఆదాయాలు 10 శాతం పెరిగాయని అనుకుందాం. 2020 నాటికి రైతు ఆదాయాన్ని రెట్టింపుచేయాలని మోదీ ప్రభుత్వ సంకల్పం. మరి కేవలం పది శాతం పెరుగుదలతో ఆ లక్ష్యం ఎలా నెరవేరుతుంది? అన్నదాతల ఆదాయాన్ని రెట్టింపు చేయాలంటే మరింత పటిష్ఠ చర్యలు చేపట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. 


అధిక ఆదాయాన్ని సమకూర్చే పంటలసాగును ఇతోధికంగా ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అటువంటి పంటలసాగు అధికమయినప్పుడు మాత్రమే మన వ్యవసాయరంగం బహుముఖంగా అభివృద్ధి చెందడం సాధ్యమవుతుంది. మామిడి పండ్లు, పువ్వులు, అరటిపండ్లు, వాల్‌నట్స్ సాగు పెంపొందించాలి. ఈ పండ్ల, పువ్వుల ఎగుమతితో మనకు విదేశీ మారక ద్రవ్యం ఇతోధికంగా లభ్యమవుతుంది. అయితే అంతర్జాతీయ మార్కెట్లో గిరాకీ ఉన్న పండ్ల, పువ్వుల రకాలను అభివృద్ధిపరచడంలో మన వ్యవసాయ పరిశోధనా రంగం బాగా వెనుకబడి పోయి ఉంది. ఎగుమతులకు అవసరమైన శీతల గిడ్డంగులు మొదలైన మౌలిక సదుపాయాల అభివృద్ధి విషయంలో కూడా మన ప్రభుత్వాలు తగు శ్రద్ధ చూపడం లేదు. ఇటువంటి పరిశోధనలు, విస్తరణసేవలు, శీతల గిడ్డంగుల నిర్మాణం మొదలైన వాటి అభివృద్ధికి అవసరమైన పనులు చేపట్టడానికి గాను ఎన్‌జిఓలు, కార్పొరేట్ కంపెనీలకు విరివిగా కాంట్రాక్టులను ఇవ్వాలి. పట్టును అత్యధిక స్థాయిలో ఉత్పత్తి చేసేందుకు వీలైన పట్టుపురుగుల అభివృద్ధి చేసే బాధ్యతను కాంట్రాక్టర్లకు అప్పగించాలి. తద్వారా పట్టు, పట్టు ఉత్పత్తులను ఎగుమతి చేయడం ద్వారా ఆర్థిక వ్యవస్థ లబ్ధి పొందుతుంది. 


కొవిడ్‌ వ్యాక్సిన్లకు ఆర్థిక మంత్రి రూ.35,000 కోట్లను కేటాయించారు. ఇది సరైన చర్య, సందేహం లేదు. అయితే కేవలం వ్యాక్సిన్ల ఆధారంగా మనం కొవిడ్ మహమ్మారిని అధిగమించలేమన్న వాస్తవాన్ని విస్మరించకూడదు. ఆ మహమ్మారిని ఎదుర్కోవడంలో మన జీవనశైలి ఇతోధికంగా తోడ్పడిందన్న వాస్తవాన్ని మనం ఉపేక్షించకూడదు. పసుపు, అల్లం మొదలైన రోగనిరోధక శక్తి గల సుగంధద్రవ్యాల వినియోగం, యోగ మొదలైన సంప్రదాయ వ్యాయామ అభ్యసనాల వల్ల మనం కొవిడ్‌ను సమర్థంగా తట్టుకోగలుగుతున్నాం. ఈ దృష్ట్యా మన దేశీయ సుగంధద్రవ్యాల రోగనిరోధక శక్తిపై మరింత విస్తృతంగా పరిశోధనలు చేపట్టాలి. మన సంప్రదాయ జీవనశైలులను సమున్నతపరచుకోవడం ద్వారా వాటి అనుసరణీయతను అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకువెళ్ళాలి. అటువంటి ఘనతల ద్వారా ఆర్థిక లబ్ధిని పొందేందుకు మనం తప్పక ప్రయత్నించాలి. మరో ముఖ్యమైన విషయమేమిటంటే మన దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి తక్కువ స్థాయిలో ఉండడానికి కారణం మన ప్రజల్లో అత్యధికులకు సరైన పారిశుద్ధ్యం, ఆరోగ్య భద్రతా పరిస్థితులు లోపించడమేనని పలువురు నిపుణుల అభిప్రాయం. మన శరీరాలు బాక్టీరియాకు, వైరస్‌లకు అలవాటై ఉన్నాయి కదా. మన ప్రజలకు మరింతగా రక్షిత తాగునీరు, మెరుగైన పారిశుద్ధ్య సదుపాయాలను కల్పించవలసిన దృష్ట్యా రాబోయే ఐదు సంవత్సరాలలో పరిశుభ్రమైన తాగునీటి వసతులకు, పారిశుద్ధ్య సదుపాయాల మెరుగుదలకు రూ. 2,87,000 కోట్లు వ్యయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం ముదావహం. నిస్సందేహంగా స్వాగతించాల్సిన నిర్ణయం. అయితే దీనివల్ల మనలో రోగనిరోధక శక్తి తగ్గిపోయే అవకాశం ఉంది గనుక రోగనిరోధక శక్తిని పెంపొందించే సమాంతర చర్యలు విధిగా చేపట్టాలి.


కొత్తబడ్జెట్‌లో విద్యా రంగానికి గణనీయమైన ప్రాధాన్యం లభించింది. రాబోయే దశాబ్ద కాలంలో లక్షలాది యువజనులు ఉద్యోగాల మార్కెట్లోకి ప్రవేశించనున్నారు. ఇప్పటికే పెద్ద సంఖ్యలో ఉన్న వారికి అదనంగా కొత్త వారు ప్రవేశించనున్నారనేది వాస్తవం. వ్యవసాయం, తయారీరంగాలలో యంత్రాల ఉపయోగం అంతకంతకూ పెరిగిపోతున్నందున ఉద్యోగాల సంఖ్య వేగంగా తగ్గిపోతున్నది. వ్యవసాయంలో హార్వెస్టర్లు, తయారీ రంగంలో రోబోలు ఉద్యోగాల సంఖ్యను తగ్గించి వేస్తున్నాయి. వ్యవస్థీకృత తయారీ రంగంలో ఉద్యోగాల సంఖ్య గణనీయంగా తగ్గిపోయినట్లు పలు అధ్యయనాలు స్పష్టం చేశాయి. నోట్ల రద్దు, వస్తుసేవల పన్ను, లాక్‌డౌన్ వల్ల అనియత రంగంలోకూడా ఉద్యోగాలు భారీ సంఖ్యలో హరించుకుపోయాయి. ఉద్యోగాలు, ఉపాధులు కోల్పోయిన లక్షలాది మందికి పూర్వపు ఉద్యోగాలు, ఉపాధులు లభించే అవకాశం ఇంకెంత మాత్రం లేదు. ఇలా వీధుల పాలయిన వారికి ఉపాధి కల్పించగల స్తోమత వ్యవసాయరంగానికి లేనే లేదు. ఎందుకంటే మన ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతున్న కొద్దీ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో వ్యవసాయరంగం వాటా తగ్గిపోతోంది. అభివృద్ధిచెందిన దేశాల జీడీపీలో వ్యవసాయం వాటా ఒకశాతం కంటే తక్కువే. మరి మన కోట్లాది నిరుద్యోగులకు ప్రయోజనకర ఉద్యోగావకాశాలను కల్పించేందుకు ఏకైక మార్గం సేవల రంగాన్ని ఇతోధికంగా అభివృద్ధిపరచడమే. అనువాదాలు, సంగీతం, సినిమాలు, ఆన్‌లైన్ విద్య, ఆన్‌లైన్ వైద్య సేవలు మొదలైన సేవలను పూర్తిస్థాయిలో అభివృద్ధిపరచాలి. ప్రభుత్వ డాక్యుమెంట్లను ప్రాంతీయ భాషలలో అందరికీ అందుబాటులో ఉంచేందుకై ట్రాన్స్‌లేషన్ ఇనిస్టిట్యూట్లను ఏర్పాటు చేయనున్నట్టు ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఇది సరైన చర్య. ఇందుకు నిర్మలా సీతారామన్‌ను అభినందించాలి. ఈ సేవలను మరింతగా అభివృద్ధిపరచేందుకు మరిన్ని చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. విదేశీ భాషల నుంచి అనువాదాలు చేసేందుకై అవసరమైన శిక్షణను యువజనులకు సమకూర్చేందుకు, సంగీతం సృజన, సినిమాలు, కంప్యూటర్ యాప్‌ల నిర్మాణం, ఆన్‌లైన్ ట్యుటోరియల్స్, వైద్యసేవలు సమకూర్చే పోర్టల్స్ నిర్వహణకు అవసరమైన శిక్షణ నిచ్చేందుకు ప్రతి జిల్లాలోను ఒక ఇన్‌స్టిట్యూట్ ఏర్పాటుచేయాలి. 2021–22 ఆర్థిక సంవత్సరానికి నిర్మలా సీతారామన్ సమర్పించిన బడ్జెట్ ఒక మామూలు బడ్జెట్.

భరత్ ఝున్‌ఝున్‌వాలా

(వ్యాసకర్త ఆర్థికవేత్త, బెంగుళూరు ఐఐఎం రిటైర్‌్డ ప్రొఫెసర్‌)

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే మరిన్ని...