కరోనాతో హోట(డ)ల్‌

ABN , First Publish Date - 2020-05-31T11:31:54+05:30 IST

కరోనా కాటుకు హోటల్స్‌ (లాడ్జింగ్‌ రెస్టారెంట్‌, హోటల్స్‌) రంగం బలైంది. భోజనప్రియులతో కళకళలాడే

కరోనాతో హోట(డ)ల్‌

తడిసి మోపడవుతున్న హోటళ్ల నిర్వహణ

ఆన్‌లైన్‌ ఆర్డర్స్‌కు మాత్రమే అనుమతి

తుప్పు పట్టనున్న ఏసీ, క్లీనింగ్‌.. వాటర్‌ ప్లాంటు యంత్రాలు

ఉపాధి కోల్పోతున్న సిబ్బంది

ఆదుకోవాలంటూ ప్రభుత్వాలకు యాజమాన్యం విజ్ఞప్తి


కడప, మే 30 (ఆంధ్రజ్యోతి): కరోనా కాటుకు హోటల్స్‌ (లాడ్జింగ్‌ రెస్టారెంట్‌, హోటల్స్‌) రంగం బలైంది. భోజనప్రియులతో కళకళలాడే హోటల్స్‌ కరోనా మహమ్మారి పుణ్యమా అని మూతబడ్డాయి. సిబ్బందికి వేతనాలు, విద్యుత్‌ బిల్లులు, అద్దె భారం తడిసి మోపెడవుతోందంటూ యజమానులు గొల్లుమంటున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పారిశ్రామికంతో పాటు మిగతా కొన్ని సెక్టార్లకు చేయూతనిస్తోంది.ఎన్నో కుటుంబాలకు ఉపాధి కల్పించే హోటల్‌ రంగంపై కూడా ప్రభుత్వాలు దృష్టి సారించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.


జిల్లా వ్యాప్తంగా వీధుల్లో ఉండే చిన్న చితక హోటళ్లు మొదలుకుని మండల కేంద్రాలు, ప్రధాన పట్టణాల్లో ఉన్న హోటళ్లు, లాడ్జింగ్‌, రెస్టారెంట్లు సుమారు 15 వేల వరకు ఉంటాయని అంచనా. కడప, ప్రొద్దుటూరు, రాయచోటి, రాజంపేట, పులివెందుల, బద్వేలు లాంటి పట్టణాల్లో అత్యాధునిక వసతులతో కూడిన హోటళ్లు (లాడ్జింగ్‌ సౌకర్యం) ఉన్న రెస్టారెంట్లు ఉన్నాయి. కడపలోనే చిన్నచితక హోటళ్లు మొదలుకుని ప్రధాన హోటళ్లు, రెస్టారెంట్లు 3వేల వరకు ఉంటాయని చెబుతున్నారు.


కరోనా కాటు

పని ఒత్తిడితో జనం హోటళ్లకు అలవాటు పడుతున్నారు. దీంతో హోటళ్లలో సైతం ప్రజల అభిరుచులకు తగ్గట్లు కొత్త కొత్త రకరకాల వంటకాలను పరిచయం చేస్తున్నారు. కడప నగరంలోని రైల్వేస్టేషన్‌ రోడ్డు, నెహ్రూ పార్కు, ఆర్టీసీ బస్టాండు ప్రాంతాల్లో ఉన్న హోటళ్లు కష్టమర్లతో కళకళలాడేవి. కుటుంబ సభ్యులతో వచ్చి కాలక్షేపం చేస్తూ భోజనాలు చేస్తుండడంతో హోటళ్లన్నీ కరోనా ముందు కళకళలాడేవి. ఒక్కో హోటల్‌కు రోజుకు సరాసరిన 250 నుంచి 300 మంది వచ్చేవారు. కస్టమర్లను ఆకట్టుకునేందుకు హోటళ్ల యాజమాన్యం కూడా ఒడిశా, నార్త్‌ ఇండియా నుంచి వంట మాస్టర్లు, సర్వీస్‌ బాయ్స్‌ను తీసుకువచ్చేవారు. ఇలా కళకళలాడే హోటళ్లు కరోనా కారణంగా మూతబడ్డాయి.


తడిసి మోపెడవుతున్న భారం

కరోనా కారణంగా హోటళ్లు మూతపడటంతో నిర్వాహకులకు నిర్వహణ భారంగా మారింది. ప్రధాన హోటళ్లు, రెస్టారెంట్లు, లాడ్జింగ్‌ సౌకర్యం ఉన్న వాటిల్లో పెద్ద సంఖ్యలో సిబ్బంది పనిచేస్తుంటారు. వంట మాస్టరు, సర్వీస్‌ బాయ్‌, ఫుడ్‌ ఆర్డరు, క్లీనింగ్‌, రిసెప్షనిస్ట్‌, రూం బాయ్స్‌ హోటల్‌, రెస్టారెంట్లలో పనిచేస్తుంటారు. వాటి సామర్య్దాన్ని బట్టి ఒక్కో దాంట్లో 40 నుంచి 50మంది సిబ్బంది ఉంటారు. జీతం రూ.10వేలు మొదలుకుని రూ.25వేల వరకు చెల్లిస్తుంటారు. అయితే హోటల్స్‌ మూతబడడంతో వ్యాపారం దెబ్బతింది. పనిచేసే సిబ్బందికి వేతనాలు ఇవ్వకపోతే ఆ కుటుంబమంతా ఇబ్బంది పడుతుంది. వారంతా సొంతూర్లకు వెళితే హోటళ్లు దెబ్బతింటాయి. దీంతో యాజమాన్యం 50 శాతం వేతనాలు చెల్లిస్తున్నట్లు చెబుతున్నారు. ఇక కరెంటు బిల్లు, అద్దెలు భారంగా మారుతున్నాయి. హోటల్స్‌, రెస్టారెంటు (లాడ్జిలు) స్థాయిని బట్టి కరెంటు బిల్లు నెలకు రూ.30వేల నుంచి రూ.3లక్షల వరకు వస్తోంది. ఇక అద్దెలు ప్రాంతాలు, రెస్టారెంటు, హోటల్‌ సామర్థ్యాన్ని బట్టి రూ.30 వేల నుంచి రూ.3 లక్షల వరకు ఉంటుంది. కడపలో అయితే రూ.70వేల నుంచి రూ.5 లక్షల వరకు చెల్లింపులు జరుగుతున్నట్లు చెబుతున్నారు.


ఇవీన్నీ రెండున్నర నెలలుగా మూతబడడంతో అద్దె, కరెంటు, సిబ్బంది వేతనాలు యాజమాన్యానికి భారంగా మారుతున్నాయని వాపోతున్నారు. ఇక హోటల్స్‌, లాడ్జిలు, రెస్టారెంట్లలో ఉండే జనరేటర్‌, ఏసీలు, హాట్‌వాటర్‌ ప్లాంటు, క్లీనింగ్‌ప్లాంటు రన్నింగ్‌లో లేకపోవడంతో అవి దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇటీవల హోటళ్ల నుంచి పార్శిళ్లకు అవకాశం ఇచ్చినప్పటికీ పూర్తి స్థాయిలో ఆన్‌లైన్‌ ఆర్డర్స్‌ ఊపందుకోలేదు. ఆన్‌లైన్‌ వ్యాపారంతోనే హోటళ్లను నెట్టుకురాలేమని హోటళ్ల యాజమాన్యాలు అంటున్నాయి.


హోటల్‌ రంగానికి ప్రభుత్వం చేయూతనివ్వాలి : చిన్నపరెడ్డి, ఏపీ స్టేట్‌ హోటల్స్‌ అసోసియేషన్‌ జనరల్‌ సెకట్రరీ

ప్రభుత్వాలు హోటల్‌ రంగాన్ని కూడా ఆదుకోవాలి. సడలింపులతో పారిశ్రామిక, ఇతర రంగాలకు ప్రభుత్వం చేయూతనిస్తోంది. ఎంతో మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్నాం. ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తున్నాం. లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించి హోటళ్లకు ఊపిరి పోయాలి. పూర్వపు స్థితికి రావాలంటే కనీసం ఏడాదిన్నర సమయం పట్టే అవకాశం ఉంది. కనుక ప్రభుత్వాలే హోటళ్ల ర ంగాన్ని ఆదుకోవాలి.

Updated Date - 2020-05-31T11:31:54+05:30 IST