స్టాఫ్‌ నర్సులూ వెనక్కి రండి!

ABN , First Publish Date - 2022-02-23T09:09:30+05:30 IST

స్టాఫ్‌నర్సులతో వైద్యశాఖ ఆటాడుకుంటోంది. జోన్ల కేటాయింపులో భాగంగా ఇతర ప్రాంతాలకు బదిలీపై..

స్టాఫ్‌ నర్సులూ వెనక్కి రండి!

జోన్ల కేటాయింపులో భాగంగా బదిలీ అయిన

వారు తిరిగి రావాలని వైద్యశాఖ ఆదేశం

తదుపరి ఉత్తర్వులిచ్చేదాకా పనిచేయాలి

జీతాలు అక్కడి నుంచే తీసుకోవాలని మెమో

మళ్లీ వెనక్కి రావాలనడంపై నర్సుల ఆగ్రహం


హైదరాబాద్‌, ఫిబ్రవరి 22 (ఆంఽధ్రజ్యోతి): స్టాఫ్‌నర్సులతో వైద్యశాఖ ఆటాడుకుంటోంది. జోన్ల కేటాయింపులో భాగంగా ఇతర ప్రాంతాలకు బదిలీపై వెళ్లిన వారిని తిరిగి వెనక్కు రావాలని ఆదేశించింది. ప్రభుత్వం హడావుడిగా తీసుకొచ్చిన 317 జీవో ప్రభావంతో గాంధీ, ఉస్మానియా, నిలోఫర్‌, పేట్ల బురుజు, సుల్తాన్‌ బజార్‌ మెటర్నిటీ తదితర ఆస్పత్రుల నుంచి వందల సంఖ్యలో నర్సులు వెళ్లిపోయారు. కానీ, తిరిగి చేరింది పదుల సంఖ్యలోనే. దాంతో వైద్య సేవలపై తీవ్ర ప్రభావం పడింది. ఇదే విషయంపై ఈ నెల 4న ‘ఆంధ్రజ్యోతి’లో ‘రోగులకు నరకం’ పేరిట కథనం ప్రచురితమైంది. కాగా, 12 ప్రధాన ఆస్పత్రుల నుంచి జోన్ల కేటాయింపులో భాగంగా జిల్లాలకు వెళ్లిన స్టాఫ్‌నర్సులు, ల్యాబ్‌ టెక్నిషీయన్లు తిరిగి రావాలని వైద్య శాఖ ఆదేశించింది. ఈ మేరకు ఆ శాఖ కార్యదర్శి రిజ్వీ మంగళవారం అంతర్గత మెమో జారీ చేశారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు ఎక్కడి నుంచి అయితే వెళ్లారో తిరిగి అక్కడికే వచ్చి పనిచేయాలని సూచించారు. శాశ్వత నియామకాలు చేపట్టడం, లేదా తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఉండాలని అందులో పేర్కొన్నారు. జీతాలు మాత్రం ప్రస్తుతం బదిలీ అయిన చోటు నుంచే తీసుకోవాల్సి ఉంటుందని మెమోలో తెలిపారు.


కుదురుకోనివ్వరా? 

కొందరు నర్సులు కొత్త ప్రాంతాలకు కుటుంబాలతో సహా వెళ్లారు. ఇలా వెళ్లారో లేదో మళ్లీ వెనక్కు వచ్చేయమని వైద్యశాఖ ఆదేశించింది. ఇలా తమను అటూఇటూ తిప్పే బదులు తాత్కాలిక పద్ధతిలోనైనా స్టాఫ్‌నర్సులను తీసుకోవాలని కోరుతున్నారు. వాస్తవానికి 2017లో స్టాఫ్‌నర్సుల భర్తీకి నోటిఫికేషన్‌ ఇచ్చారు. దానిపై కోర్టులో కేసులు పడ్డాయి. వైద్యశాఖ ఉన్నతాధికారుల నిర్లక్ష్యం కారణంగా ఆ రిక్రూట్‌మెంట్‌ సకాలంలో జరగలేదు. 2021లో కోర్టు కేసులు క్లియర్‌ అవడంతో నవంబరులో 2200 మంది స్టాఫ్‌నర్సులకు పోస్టింగ్‌ ఇచ్చారు. వారు విధుల్లో చేరి 2 నెలలు కాగానే జీవో నంబరు 317 వచ్చింది. దీంతో బదిలీలు చేశారు. ఇలా 4 నెలల్లో రెండు చోట్లకు మారాల్సి వచ్చిందని నర్సులు వాపోతున్నారు.

Updated Date - 2022-02-23T09:09:30+05:30 IST