అరకొర సిబ్బందితో పనిభారం

ABN , First Publish Date - 2021-06-19T05:28:25+05:30 IST

రాజమహేంద్రవరం అర్బన్‌: రాజమహేంద్రవరం జిల్లా కొవిడ్‌ ప్రభుత్వాసుపత్రిలో సేవలందించేందుకు ఇటీవల తాత్కాలిక పద్ధతిలో నియమితులైన కొవిడ్‌ ప్రత్యేక నర్సుల్లో సగం మంది మానేయడంతో ప్రస్తుతం ఉన్నవారిపైనే అధికభారం పడుతోంది.

అరకొర సిబ్బందితో పనిభారం
రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రి

  • సగం మందికిపైగా విధులు మానేసిన కొవిడ్‌ ప్రత్యేక నర్సులు
  • కొత్త స్టాఫ్‌ నియామకానికి ఆసక్తి చూపని అధికారులు
  • బాధితులకు వైద్యసేవలపై తీవ్ర ప్రభావం 

రాజమహేంద్రవరం అర్బన్‌: రాజమహేంద్రవరం జిల్లా కొవిడ్‌ ప్రభుత్వాసుపత్రిలో సేవలందించేందుకు ఇటీవల తాత్కాలిక పద్ధతిలో నియమితులైన కొవిడ్‌ ప్రత్యేక నర్సుల్లో సగం మంది మానేయడంతో ప్రస్తుతం ఉన్నవారిపైనే అధికభారం పడుతోంది. విధులకు గైర్హాజరైన వారి స్థానంలో కొత్తవారిని నియమించేందుకు అధికారులు ఆసక్తి చూపకపోవడంతో నర్సింగ్‌ ఉద్యోగినులు విధి నిర్వహణలో తీవ్ర మానసిక ఒత్తిడి  ఎదుర్కొంటున్నారు. రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిని కొవిడ్‌ ఆసుపత్రిగా మార్చిన తర్వాత కాకినాడ వికాస అవుట్‌సోర్సింగ్‌ సంస్థ ద్వారా 92 మంది నర్సులను నియమించారు. వీరిలో కొంతమంది విధుల్లో చేరి ఆ తర్వాత రావడం మానేశారు. మరికొంత మంది అసలు చేరలేదని సమాచారం. ఇలా సుమారు 55 మందికి పైగా కొవిడ్‌ ప్రత్యేక సిబ్బంది గైర్హాజరయ్యారు. దీంతో ఉన్న నర్సింగ్‌ ఉద్యోగినులే భారం అంతా మోయాల్సి వస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వ కొవిడ్‌ ఆసుపత్రిలో 300 మంది వరకూ కొవిడ్‌ బాధితులు చికిత్స పొందుతున్నారు. వీరికి పూర్తిస్థాయిలో వైద్యసేవలు అందించాలంటే మరింత మంది నర్సులు అవసరం ఉంది. నర్సుల కొరత కారణంగా 60 మందికి ఒకరు చొప్పున విధులు నిర్వహించాల్సి వస్తోందని సమాచారం. ప్రభుత్వాసుపత్రిలో రెగ్యులర్‌ స్టాఫ్‌ నర్సులు, హెడ్‌ నర్సులు 45 మంది వరకూ ఉన్నారు. ఇలా రెగ్యులర్‌, కొవిడ్‌ ప్రత్యేక సిబ్బంది కలిపి ప్రస్తుతం 80 నుంచి 90 మంది మాత్రమే రోజువారీ విధులకు అందుబాటులో ఉంటున్నారని తెలుస్తోంది. వీరిని డ్యూటీలకు సర్దుబాటు చేయడం నర్సింగ్‌ సూపరింటెండెంట్‌కు తలకుమించిన భారంగా మారుతోంది. వికాస ద్వారా వచ్చి మానేసిన వారి స్థానంలో కొత్త వారిని నియమించే విషయంలో అధికారులు నిర్లిప్తంగా వ్యవహరించడంతో తమపై పని ఒత్తిడి పెరుగుతోందని నర్సింగ్‌ ఉద్యోగినులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రస్తుతం కొవిడ్‌ కేసులు తగ్గుముఖం పడుతున్నట్టు భావిస్తున్నా రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో కేసుల సంఖ్య ఎక్కువగానే ఉంది. డిశ్చార్జి అవుతున్నవారి సంఖ్య కంటే చేరుతున్న వారి సంఖ్య ప్రస్తుతం ఎక్కువగా ఉంది. అదేవిధంగా కరోనా మూడో వేవ్‌ 18 ఏళ్ల లోపు చిన్నారులపై ప్రభావం చూపే అవకాశాలున్నాయని హెచ్చరికలు వస్తున్న నేపథ్యంలో జిల్లా ఉన్నతాధికారులు ఇప్పటి నుంచే కొవిడ్‌ ప్రత్యేక వైద్యసిబ్బంది నియామకంపై దృష్టిసారించాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Updated Date - 2021-06-19T05:28:25+05:30 IST