వరుణుడి కోసం పడిగాపులు

ABN , First Publish Date - 2021-06-24T06:31:23+05:30 IST

అన్నదాత ఆకాశంవైపు ఆశగా చూస్తున్నాడు. ఇకనైనా వరణుడు కరుణించకపోడా, పంట చేలపై చిరుజల్లుల హరివిల్లు కురిపించకపోడా అని. సీజన్‌ తొలిరోజుల్లో చుట్టంచూపుగా పలకరించిన వానలు జాడలేకపోవడం రైతన్నకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

వరుణుడి కోసం పడిగాపులు

చినుకు లేక, కునుకు రాక రైతన్న ఆందోళన

ఇటు వాడిపోతున్న పత్తిచేలు.. అటు రైతన్న దిగాలు

ఇంకా ఆలస్యమైతే రైతన్నకు మిగిలేది నష్టమే

కొన్నిచోట్ల మళ్లీ విత్తనాలు నాటుతున్న రైతులు


(ఆంధ్రజ్యోతి ప్రతినిధి-నల్లగొండ) : అన్నదాత ఆకాశంవైపు ఆశగా చూస్తున్నాడు. ఇకనైనా వరణుడు కరుణించకపోడా, పంట చేలపై చిరుజల్లుల హరివిల్లు కురిపించకపోడా అని. సీజన్‌ తొలిరోజుల్లో చుట్టంచూపుగా పలకరించిన వానలు జాడలేకపోవడం రైతన్నకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఉరిమే ఉత్సాహం.. మెరుపు వేగంతో, ఈసారైనా సమృద్ధిగా పంటలు పండుతాయన్న ఆనందంలో నాటిన విత్తనాలు మొలకెత్తక కొన్నిచోట్ల, మొలకెత్తినా వాడిపోతూ మరికొన్ని చోట్ల రైతుకంట కన్నీరు తెప్పిస్తున్నాయి. మృగశిర కార్తె మొదలైన మురిపెం మూన్నాళ్లు కూడా లేకుండా, ఏరువాక సాగిన రైతుకు ఏడుపే దిక్కయింది. 


జిల్లాలో వర్షాలు ముఖం చాటేయడంతో వేసిన పంటలు వాడిపోతున్నాయి. ప్రధానంగా పత్తి విత్తనాలు వేసిన రైతులు ఆందోళనకు గురవుతున్నారు. మే ఆఖరు వారంలో కురిసిన వర్షాలకు చాలాచోట్ల రైతులు విత్తనాలు వేశారు. వాస్తవానికైతే ప్రతి ఏటా మృగశిర కార్తె మొదలైన తర్వాత వర్షాలు పడిన వెంటనే విత్తనాలు వేయడం తెలిసిందే. అయితే ఈసారి ముందుగా పడిన వానలకు రైతులు పత్తి విత్తనాలను పెద్దఎత్తున విత్తారు. తీరా మొలకెత్తిన తర్వాత వానలు జాడలేకుండా పోవడంతో మాడిపోతున్నాయి. దీంతో రైతులు నష్టపోయే ప్రమాదం ఏర్పడింది. జూన్‌ 1వ తేదీ నుంచి ఇప్పటివరకు జిల్లాలో కేవలం 58.2 మి.మీ.ల వర్షపాతం నమోదైంది. సాధారణ వర్షాపాతం 81.1 మి.మీ.లకు గాను 58.2 మి.మీ.లు కురవడంతో ఇంకా 39 మి.మీ.ల వర్షపాతం లోటుగా ఉంది. దీనికితోడు పగటి ఉష్ణోగ్రతలు కూడా తగ్గకపోవడంతో ఆ ప్రభావం పంటలపై పడుతోంది. రుతుపవనాల్లో కదలికలు లేకపోవడంతో వేసవి తీవ్రత తగ్గుముఖం పట్టలేదని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. జిల్లాలో మంగళవారం గరిష్ఠ ఉష్ణోగ్రత 40 డిగ్రీలు నమోదుకాగా, బుధవారం వాతావరణంలో కొంత తేడా రావడంతో గరిష్ఠ ఉష్ణోగ్రత 38.5 డిగ్రీలుగా నమోదైంది. మంగళవారం గరిష్ఠ ఉష్ణోగ్రత సాధారణం కన్నా 4.2డిగ్రీలు అదనంగా నమోదైందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలో ఇంకా కొద్ది రోజులపాటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు తగ్గకుండా ఉండి వర్షాలు కురవకపోతే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. 


 కానరాని రుతుపవనాలు 

ఆశించినస్థాయిలో రుతుపవనాలు రాకపోవ డం, వేసవిలో మాదిరి ఎండలు కొడుతుండడంతో వేసిన పంటలు చేతికొచ్చేలా కనిపించడంలేదు. వేల రూపాయలు పెట్టుబడి పెట్టిన అన్నదాతలు వానలు పడకపోవడంతో తీవ్రనిరాశ, నిస్పృలకు గురవుతున్నారు. రైతుబంధు సొమ్మును అం దుకున్న రైతులు దుక్కి దున్నకాలకు, విత్తనాల కొనుగోలుకు పెట్టుబడులు పెట్టారు. అయితే వానలు రాకపోవడంతో పెట్టుబడులు కోల్పో గా, మళ్లీ కొత్తగా పెట్టుబడులకు తిరిగి అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సారి పెద్దఎత్తున వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ పేర్కొన్నప్పటికీ పరిస్థితి మాత్రం ఆశాజనకంగా కానరావడంలేదు. ఆకాశంలో మబ్బులు తప్ప చినుకులు మాత్రం పడటంలేదు. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూ డా ప్రకృతి సహకరించకపోతే రైతులు నష్టా ల బారినపడే అవకాశాలు కన్పిస్తున్నాయి. 


ఇప్పటికే 30శాతం మేరకు పత్తి విస్తీర్ణం

ఇప్పటివరకు జిల్లాలో 2లక్షల 30వేల ఎకరాల్లో పత్తి విస్తీర్ణం సాగయింది. ఈ మూడువారాల్లో కురిసిన కొద్దిపాటి వానలకు 30శాతం మేర పత్తి విస్తీ ర్ణం సాగు చేశారు. ఈ వానాకాలం 7లక్షల 30వేల ఎకరాల్లో పత్తి సాగవుతుందని వ్యవసాయ శాఖ అధికారులు అం చనా వేస్తున్నారు. బలమైన కార్తెలో విత్తనాలు వేస్తే అధిక దిగుబడి వస్తుందని ఎంతో ఆశతో రైతులు అరకొరగా వర్షాలు పడినప్పటికీ విత్తనాలు వేసిన రైతులకు నిరాశ తప్పడంలేదు. ఒక్కో ప్యాకెట్‌ అంటే 450 గ్రాముల విత్తనాలకోసం రైతులు రూ.800 వరకు వెచ్చిస్తున్నారు. దీనివల్ల పెట్టుబడులు అధికంగా పెట్టిన రైతులకు వానలులేక ఇబ్బందులు తప్పడంలేదు. దుక్కులు మొదలుకొని విత్తనాలు, కూలి చెల్లింపులు రైతులకు భారంగా మారుతున్నాయి. ఇదిలా ఉంటే నాంపల్లి మండలంలో బుధవారం వర్షం కురవడంతో రైతుల్లో కొంత ఆశ చిగురించింది. మండలంలో ఇప్పటికే చాలామంది రైతులు పత్తి విత్తనాలను విత్తగా, కురిసిన వాన పంటకు ప్రాణం పోసినట్లయింది. 


పత్తి మొలకలు మాడిపోతున్నాయి : రామచంద్రు, తేలకంటిగూడెం, కనగల్‌

మొదట కురిసిన వానలకు పత్తి విత్తనాలు విత్తాం. అయితే వానలు పడకపోవడంతో మొలిచిన మొలకలు మాడిపోతున్నాయి. దీంతో పెట్టిన పెట్టుబడులు పోయే పరిస్థితి ఏర్పడింది. మళ్లీ విత్తనాలు వేయాల్సి వస్తోంది. రాబోయే రోజుల్లో చాలాచోట్ల మెక్కలకు నీరుపోసి కాపాడుకోవాల్సి ఉంటుంది. వానలు కురవకుండా, పోసే నీటితో పంటలను కాపాడుకోవడం కష్టమే. 


రెండ్రోజుల్లో వానలు పడితే పత్తిచేలకు లాభం : శ్రీధర్‌రెడ్డి, జేడీఏ, నల్లగొండ 

ప్రస్తుతం వేసిన పంటలు దున్నడం కోసం రెండు రోజుల్లో వానలు పడ్డా నష్టం ఉండదు. ఇప్పటి వరకు జిల్లాలో 2లక్షల 30 వేల ఎకరాల్లో పత్తి సాగయింది. వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతున్నందున రైతులు ఆందోళన చెందవద్దు. జిల్లాలో రైతాంగానికి ఈ సీజన్‌కు సరిపడా ఎరువులు, విత్తనాలు సిద్ధంగా ఉంచాం. ప్రభుత్వం అన్నిరకాలుగా రైతుల సంక్షేమం కోసం పఽథకాలను అమలుచేస్తోంది. అర్హులందరికీ రైతుబంధు పథకం కింద నగదు జమవుతోంది. 


Updated Date - 2021-06-24T06:31:23+05:30 IST