తమిళనాడు ప్రజలకు స్టాలిన్ కృతజ్ఞతలు

ABN , First Publish Date - 2021-05-03T01:09:57+05:30 IST

తొలిసారి తమిళనాడు సీఎం పీఠాన్ని అధిష్టించనున్న డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్... తన పార్టీకి అధికారం కట్టబెట్టిన రాష్ట్ర ప్రజలకు...

తమిళనాడు ప్రజలకు స్టాలిన్ కృతజ్ఞతలు

చెన్నై: తొలిసారి తమిళనాడు సీఎం పీఠాన్ని అధిష్టించనున్న డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్... తన పార్టీకి అధికారం కట్టబెట్టిన రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సంక్షేమం కోసం నిజాయితీగా పనిచేస్తామని ఆయన హామీ ఇచ్చారు. తమిళనాడులో ఆరోసారి తమ పార్టీపై నమ్మకం ఉంచినందుకు ‘‘హృదయపూర్వక ధన్యవాదాలు’’ అంటూ ఆయన పేర్కొన్నారు. ‘‘డీఎంకే అధికారంలో ఉంటే తమ సంక్షేమానికి ఢోకా లేదని ప్రజలు గుర్తించారు కాబట్టే ఇంతటి ఘనవిజయాన్ని కట్టబెట్టారు. రాష్ట్ర ప్రజలు, రాష్ట్రం కోసం డీఎంకే గత 50 ఏళ్లుగా చిత్తశుద్ధితో పనిచేసిన దానికి బహుమానంగా ప్రజలు ఈ తీర్పు ఇచ్చారు. అంతేకాదు.. పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్న కలను నిజం చేసుకోవడానికి ప్రతి రోజూ కార్యకర్తలు శ్రమించి పనిచేసిన దానికి కూడా ఈ విజయం నిదర్శనం...’’ అని స్టాలిన్ పేర్కొన్నారు.


పార్టీ వ్యవస్థాపకుడు, క‌ళైంగ‌ర్‌ క‌రుణానిధి జీవించి ఉన్నప్పుడే పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు పార్టీ కార్యకర్తలు కష్టపడి పనిచేశారనీ.. అయితే అది జరక్కపోయినప్పటికీ తమ కలను నిజం చేసుకునేలా పట్టుదలతో సాగారని స్టాలిన్ గుర్తుచేసుకున్నారు. ‘‘నేను మీకోసం నమ్మకంగా పనిచేస్తాను. నా ధ్యాస, నా శ్వాస రాష్ట్ర ప్రజల కోసమే..’’ అని ఆయన పేర్కొన్నారు. పార్టీ గెలుపు కోసం పనిచేసిన కార్యకర్తలు, పార్టీ నేతలు, శ్రేణులకు... శుభాకాంక్షలు తెలిపిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.


కాగా ఇవాళ సాయంత్రం 7:38 సమయానికి వెలువడిన ఫలితాల ప్రకారం... మొత్తం 234 స్థానాలకు గానూ డీఎంకే 77 స్థానాలను కైవసం చేసుకుంది. మరో 79 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. అన్నాడీఎంకే 26 స్థానాలు గెలుచుకుని మరో 52 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాగా గతంలో డీఎంకే పార్టీ తమిళనాట ఐదు సార్లు అధికారం చేపట్టింది. 2006-11, 1996-2001, 1989-91, 1971-76, 1967- 71 సంవత్సరాల మధ్య డీఎంకే అధికారంలో కొనసాగింది.

Updated Date - 2021-05-03T01:09:57+05:30 IST