రెండు చేతులకు స్టాంప్ వేసేద్దాం.. కరోనా కట్టడికి కొత్త ఆలోచన..!

ABN , First Publish Date - 2020-09-19T18:07:05+05:30 IST

జిల్లాలో కొవిడ్‌ కేసులు అడ్డూఅదుపూ లేకుండా పెరిగిపోతున్నాయి. ఇతర జిల్లాలకు అందనంత ఎత్తులో పాజిటివ్‌లు తూర్పును ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. జిల్లాలో మహమ్మారి సోకని ప్రాంతం అంటూ లేని పరిస్థితి. అటు వేలల్లో కేసులతో అధికారులు సైతం చేతులెత్తేశారు. పాజిటివ్‌ నిర్ధారణ అయిన వ్యక్తుల ఇళ్లల్లో

రెండు చేతులకు స్టాంప్ వేసేద్దాం.. కరోనా కట్టడికి కొత్త ఆలోచన..!

హోం ఐసోలేషన్‌లోని కొవిడ్‌ బాధితుల రెండు చేతులపై ఇకపై స్టాంపులు

విచ్చలవిడిగా బయట తిరిగేస్తున్న నేపథ్యంలో అధికారుల నిర్ణయం

బయట ఎక్కడ తిరిగినా తక్షణం జనం గుర్తించేలా జాగ్రత్తలు

అటు బాధితుల ఇంటి వద్ద కొవిడ్‌ సోకిన ఇళ్లు అని తెలిసేలా పోస్టర్లు కూడా..

జిల్లాలో విచ్చలవిడిగా బయట తిరిగేస్తున్న హోంఐసోలేషన్‌ కొవిడ్‌ బాధితులు

పాజిటివ్‌ల విజృంభణకు ఇదీ కారణమే.. ఇప్పటికే ‘ఆంధ్రజ్యోతి’లో పలు కథనాలు


(కాకినాడ-ఆంధ్రజ్యోతి): జిల్లాలో కొవిడ్‌ కేసులు అడ్డూఅదుపూ లేకుండా పెరిగిపోతున్నాయి. ఇతర జిల్లాలకు అందనంత ఎత్తులో పాజిటివ్‌లు తూర్పును ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. జిల్లాలో మహమ్మారి సోకని ప్రాంతం అంటూ లేని పరిస్థితి. అటు వేలల్లో కేసులతో అధికారులు సైతం చేతులెత్తేశారు. పాజిటివ్‌ నిర్ధారణ అయిన వ్యక్తుల ఇళ్లల్లో  ఏమాత్రం ప్రత్యేక వసతులు లేకున్నా సరే హోంఐసోలేషన్‌కు అనుమతిచ్చేస్తున్నారు. దీంతో అధిక శాతం మంది నిత్యావసరాలు, ఇతర కారణాల సాకుతో యథేచ్ఛగా జనంలోకి వచ్చేస్తున్నారు. ఫలితంగా కాంటాక్ట్‌ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇకపై హోం ఐసోలేషన్‌లోని కొవిడ్‌ బాధితుల రెండు చేతులపై ‘హోం ఐసోలేషన్‌ కొవిడ్‌ పేషెంట్‌’ అనే స్టాంపు వేయబోతున్నారు. వారింటి ముందు ‘కొవిడ్‌ సోకిన ఇల్లు’ అనే పోస్టర్‌ వేసేందుకు యోచిస్తున్నారు.


జిల్లాలో కొవిడ్‌ కేసులు శుక్రవారం నాటికి 83 వేలు దాటేశాయి. ఒక్క జూన్‌, జూలై, ఆగస్టు.. ఈ మూడు నెలల్లో దాదాపు 70 వేల పాజిటివ్‌లు నిర్ధారణ అయ్యాయి. ఇతర జిల్లాలతో పోల్చితే ఇక్కడే కేసుల నమోదు వేగం అధికంగా ఉంది. మొదట్లో కొవిడ్‌ కేసు వచ్చినప్పుడు వహించిన శ్రద్ధ ఆ తర్వాత అధికారుల్లో కనిపించలేదు. రెడ్‌జోన్‌ల పర్యవేక్షణ గాలికి కొట్టుకుపోయింది. ఈ జోన్‌లోని జనం యథావిధిగా బయట తిరిగేస్తున్నారు. పాజిటివ్‌ సోకి పెద్దగా లక్షణాలు లేని వ్యక్తికి ఇంట్లో ప్రత్యేక సదుపాయాలు ఉంటే హోంఐసోలేషన్‌కు మొదట్లో అనుమతి ఇచ్చేవారు. ఆ తర్వాత రోజుకు వేలల్లో కొత్త కేసులు వస్తుండడం, ఆసుపత్రులు, క్వారంటైన్‌ కేంద్రాలు నిండిపోవడంతో ముందువెనుకా చూడకుండా ఇప్పుడు ప్రతి ఒక్కరికి హోంఐసోలేషన్‌ అనుమతి ఇచ్చేస్తున్నారు. ఒకే గది ఉన్న ఇళ్లల్లో బాధితులకు కూడా హోంఐసోలేషన్‌ అనుమతిస్తున్నారు. జిల్లాలో 83 వేల పాజిటివ్‌ కేసులకుగాను 50,929 మంది ఇంట్లోనే హోంఐసోలేషన్‌లో ఉంటున్నారు. వీరిలో చాలామంది నిత్యావసరాలతోపాటు మార్కెట్‌, మాల్స్‌,దుకాణాలు, హోటళ్లు.. ఇలా ఎక్కడికక్కడ తిరిగేస్తున్నారు. దీంతో రోడ్లపై తిరుగుతోన్న జనంలో కొవిడ్‌ సోకిన వారెవరు? సోకని వారెవరు? అనే తేడా లేకుండా పోయింది. 


ఒకరకంగా చెప్పాలంటే హోంఐసోలేషన్‌లో ఉన్న కొవిడ్‌ బాధితుడు బయటకు వెళ్లకుండా పర్యవేక్షణ పూర్తిగా పోయింది. దీంతో జిల్లాలో పెద్దఎత్తున కాంటాక్ట్‌ కేసులు పెరిగిపోయాయి. ఇదే విషయమై అనేకసార్లు ‘ఆంధ్రజ్యోతి’ పలు కథనాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో హోం ఐసోలేషన్‌లోని కొవిడ్‌ సోకిన వ్యక్తి రెండు చేతులపై స్టాంపులు వేయాలని అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇతడు కొవిడ్‌ బాధితుడు అని అందరికి తెలిసేలా ఇంకు తో కూడిన స్టాంపులు వైద్య సిబ్బంది వేయనున్నారు. కనీసం పది రోజులు చెరగకుండా వీటిని వేస్తారు. తద్వారా వీరు జనసంచారంలోకి  వస్తే తక్షణం గుర్తించి అప్రమత్తం కావడం, వైద్య అధికారులకు సమాచారం ఇచ్చేలా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. అటు స్టాంపులు వేసిన తర్వాత తమ గురించి తెలిసిపోతుందనే ఆందోళనతో బాధితులు ఆరు బయట తిరగడం మానేస్తారనే కోణంలో కూడా ఈ నిర్ణ యం తీసుకున్నారు. ఈ తరహా స్టాంపులు మార్చి ఆరంభంలో విదేశాల నుంచి వచ్చి పాజిటివ్‌గా తేలిన బాధితులకు వేసేవారు.


ఆ తర్వాత దీని ఊసు మరిచారు. ఇప్పుడు వేల కేసుల నేపథ్యంలో కొత్తగా నిర్ణ యం తీసుకున్నారు. ఇప్పటికే పాజిటివ్‌ నిర్ధారణ అయి కొన్ని రోజులుగా హోంఐసోలేషన్‌లో ఉన్నవారికి కూడా స్టాంపులు వేయాలని ఆలోచిస్తున్నారు. శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి జిల్లా కలెక్టర్‌, వైద్యఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో కూడా ఈ అంశం చర్చకు వచ్చింది. చేతులపై స్టాంపులు వేయడం, అధిక కేసులు వస్తున్న ప్రాంతంలో పాజిటివ్‌ వచ్చినవారు, కొవిడ్‌తో మృతి చెందిన వారి వివరాలు మ్యాపింగ్‌ చేస్తామని అధికారులు వివరించారు. పాజిటివ్‌ నిర్ధారణ అయిన వ్యక్తుల ఇళ్ల ముందు ‘ఇది కొవిడ్‌ సోకిన ఇల్లు’ అని ప్రత్యేకంగా పోస్టర్లు కూడా వేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఇది కార్యరూపం దాల్చనుంది. తొలుత కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో దీన్ని అమలు చేస్తారు. 

Updated Date - 2020-09-19T18:07:05+05:30 IST