Abn logo
Nov 28 2020 @ 02:41AM

స్టాప్‌ అదానీ సిడ్నీ వన్డే మ్యాచ్‌కు తాకిన నిరసన సెగలు

గ్రౌండ్‌లోకి ఆందోళనకారులు

బొగ్గు గనుల ప్రాజెక్టుకు

ఎస్‌బీఐ రుణం ఇవ్వొద్దు

ప్లకార్డులతో నిరసన ప్రదర్శన


సిడ్నీ: చాలా నెలల తర్వాత జరుగుతున్న వన్డే మ్యాచ్‌ అది! అందులోనూ... ఇండియా-ఆస్ట్రేలియా మధ్య పోరు! శుక్రవారం సిడ్నీ మైదానంలో... భారత జట్టు ఫీల్డింగ్‌ చేస్తుండగా అనూహ్య ఘటన జరిగింది. ఇద్దరు నిరసనకారులు మైదానంలోకి దూసుకొచ్చారు. అందులో ఒకరు... బౌలర్‌ నవదీప్‌ సైనీ దాకా వచ్చారు. వారిద్దరి చేతిలో... ‘నో బిలియన్‌ డాలర్‌ లోన్‌ టు ఆదానీ’ అంటూ ప్లకార్డులు. వారి చొక్కాలపై ‘స్టాప్‌ అదానీ’ నినాదం! ఈ ఘటనతో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. అటు మైదానం బయటా పెద్దసంఖ్యలో నిరసనకారులు ఇవే ప్లకార్డులతో ప్రదర్శన చేశారు. ఆస్ట్రేలియాలో అదానీ చేపట్టిన బొగ్గు గనుల ప్రాజెక్టుకు భారతీయ స్టేట్‌బ్యాంక్‌ దాదాపు రూ.6వేల కోట్లు రుణం ఇచ్చేందుకు అంగీకరించింది. అందుకే... ఈ నిరసనలు! క్వీన్స్‌లాండ్‌ రాష్ట్రంలో అదానీ గ్రూప్‌ 1,600 కోట్ల డాలర్లతో కార్మిచాల్‌ కోల్‌మైన్‌ ప్రాజెక్టును చేపట్టాలని నిర్ణయించుకుంది. ఏటా 80 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసి భారత్‌లోని థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలకు సరఫరా చేయాలన్నది లక్ష్యం.


దీంతో తన విద్యుత్‌ ప్రాజెక్టులకు చౌకగా బొగ్గు లభించడంతో పాటు మిగిలిన బొగ్గును ఇతర కంపెనీలకు అమ్ముకోవచ్చని అదానీ గ్రూప్‌ భావించింది. ఇది పదేళ్ల కిందటి ప్రాజెక్టు. దీనికి క్వీన్స్‌లాండ్‌ ప్రభుత్వం కొన్ని షరతులతో అనుమతులు మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టు నుంచి తవ్వితీసే బొగ్గును ఆస్ట్రేలియాలోని గ్రేట్‌ బారియర్‌ రీఫ్‌ సమీపంలోని రేవు ద్వారా భారత్‌కు తరలించాల్సి వస్తుంది. దీనివల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందంటూ ఆస్ట్రేలియాలో నిరసనలు జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టుకు ఇటీవల ఎస్‌బీఐ రూ.6వేల కోట్ల రుణం మంజూరు చేయాలని నిర్ణయించుకోవడంతో ఆందోళనలు మరింత పెరిగాయి. ఇప్పుడు ఏకంగా... వన్డే మ్యాచ్‌కూ సెగ తగిలింది. దీంతో ఈ అంశం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది.

Advertisement
Advertisement
Advertisement