హైదరాబాద్‌ : స్టార్‌ హోటళ్లలో కరోనాకు కార్పొరేట్‌ వైద్యం!

ABN , First Publish Date - 2021-05-13T18:06:10+05:30 IST

కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో ప్రభుత్వాసుపత్రులతో పాటు కార్పొరేట్‌ ఆస్పత్రుల్లోనూ పడకలు కరువయ్యాయి.

హైదరాబాద్‌ : స్టార్‌ హోటళ్లలో కరోనాకు కార్పొరేట్‌ వైద్యం!

  • హోటళ్లతో ఆస్పత్రుల ఒప్పందం
  • వీడియో కన్సల్టేషన్‌ ద్వారా పర్యవేక్షణ
  • ఫంక్షన్‌ హాళ్లు, హాస్టళ్లలో ప్రభుత్వ ఐసొలేషన్‌ కేంద్రాలు

హైదరాబాద్‌ సిటీ : కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో ప్రభుత్వాసుపత్రులతో పాటు కార్పొరేట్‌ ఆస్పత్రుల్లోనూ పడకలు కరువయ్యాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ కరోనా ఆస్పత్రిలోనైనా పడక కావాలంటే కనీసం రెండు రోజుల పాటు వేచి చూడాల్సిందే. వెంటిలేటర్‌ పడకలు అలా ఉంచి.. కనీసం ఐసొలేషన్‌కూ పడకలు లభ్యం కావడం లేదు. దీంతో అటు కార్పొరేట్‌ ఆస్పత్రులు, ఇటు ప్రభుత్వం కొత్త మార్గాల్ని ఎంచుకుంటున్నాయి. కార్పొరేట్లు హోటళ్లను అద్దెకు తీసుకుని పడకల్ని ఏర్పాటు చేస్తుండగా.. ప్రభుత్వం ఫంక్షన్‌ హాళ్లను, హాస్టళ్లను, పాఠశాలలను ఐసొలేషన్‌ కేంద్రాలుగా మారుస్తోంది.

స్టార్‌ హోటళ్లలో కార్పొరేట్‌ వైద్యం

దాదాపు 15కు పైగా కార్పొరేట్‌ ఆస్పత్రులు, జీహెచ్‌ఎంసీ పరిధిలోని పలు స్టార్‌ హోటళ్లను అద్దెకు తీసుకున్నాయి. సుమారు 1148 గదులలో ఐసోలేషన్‌ పడకలు ఏర్పాటు చేసి అన్ని సదుపాయాలూ కల్పించాయి. వైద్య సేవలు బాగుండటంతో చాలా మంది వీటిలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. యశోద ఆస్పత్రి బేగంపేటలోని గ్రీన్‌ పార్క్‌, లక్డీకాపూల్‌లోని బెస్ట్‌ వెస్ట్రన్‌ అశోక్‌లో 130 గదులలో ఐసోలేషన్‌ పడకలు సిద్ధం చేసింది. ఎఐజీ ఆస్పత్రి, కాంటినెంటల్‌ ఆస్పత్రి ఆధ్వర్యంలో కొండాపూర్‌లోని రాడిసన్‌ హోటల్‌లో 50 గదులలో ఐసోలేషన్‌ పడకలు ఏర్పాటు చేశారు. కొండాపూర్‌ కిమ్స్‌ ఆధ్వర్యంలో సిస్టా హోటల్‌లో 67, సికింద్రాబాద్‌ కిమ్స్‌కు సంబంధించి హోటల్‌ మనోహర్‌లో 50 గదులు, జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రి ఆధ్వర్యంలో ఆదిత్య హోటల్‌లో, తాజ్‌బంజారా, గ్రీన్‌ పార్క్‌లలో 250 గదులలో ఐసోలేషన్‌ పడకలు ఉన్నాయి.

అలాగే బంజారాహిల్స్‌లో కేర్‌ ఆధ్వర్యంలో కంఫర్ట్‌ హోటల్‌లో 52, కాంటినెంటల్‌ ఆస్పత్రికి సంబంధించి మారియట్‌ హోటల్‌లో వంద ఐసోలేషన్‌ గదులు, మెడికవర్‌ ఆస్పత్రికి సంబంధించి ఓ హోటల్‌లో 98 గదులను అద్దెకు తీసుకున్నారు. మహవీర్‌ ఆస్పత్రి ఆధ్వర్యంలో లెమన్‌ ట్రీలో 67, ఓమ్నీ ఆస్పత్రికి- క్యాపిటల్‌ ఓ అండ్‌ ఇస్టాలో 122, కాచిగూడలోని టిఎక్స్‌ ఆధ్వర్యంలో టూరిజం ప్లాజాలో 30 పడకలు, సిటీ న్యూరో ఆస్పత్రి ఆధ్వర్యంలో గోల్కోండ హోటల్‌లో 50, విన్‌ ఆస్పత్రికి సంబంధించిన ఆదిత్య పార్క్‌లో 82 గదులను అద్దెకు తీసుకొని చికిత్సలు అందిస్తున్నాయి. 

ఆస్పత్రుల పర్యవేక్షణలోనే..

ఆస్పత్రులే నేరుగా హోటళ్ల నిర్వాహకులతో ఒప్పందాలు చేసుకుని, గదులను బుక్‌ చేసుకుని, అవసరమైన వైద్య వసతులను ఏర్పాటు చేస్తుండటం గమనార్హం. ఆయా ఆస్పత్రులకు వచ్చిన కరోనా పాజిటివ్‌ రోగుల్లో ఆరోగ్యం కాస్త మెరుగైన వారిని హోటళ్లలో ఉంచి వైద్య సేవలు అందిస్తున్నాయి. ఆక్సిజన్‌ సాచ్యురేషన్‌ స్థాయి సాధారణంగా ఉంటేనే ఇక్కడ ఉంచి చికిత్స అందిస్తారు. ఆక్సిజన్‌, వెంటిలేటర్‌ అవసరం లేని వారికి మాత్రమే హోటళ్లలో పడకల్ని ఏర్పాటు చేస్తున్నారు. గదులు అవసరమైన వారి వైద్య సేవలకు అనుగుణంగా రోజుకు రూ. 3 వేల నుం చి రూ. 10వేల వరకు వసూలు చేస్తున్నాయి. ఈ బిల్లులోనే హోటల్‌ వసతి, ఆహారం, ఔషధాలు, నర్సింగ్‌ స్టాఫ్‌ బిల్లు ఉంటుంది. వీరికి సహాయంగా వైద్య సిబ్బంది ఉంటారు. రోగులకు ఆరోగ్య పరీక్షలు చేయడం, వారికి మందులు అందజేయడం వంటి కార్యక్రమాలను వీరు పర్యవేక్షిస్తారు. ఏమైనా తేడాలు ఉంటే వెంటనే వైద్యులకు సమాచారం అందించి, వారి సూచన ప్రకారం జాగ్రత్తలు తీసుకుంటారు. ఎవరి ఆరోగ్య పరిస్థితైనా దిగజారితే.. వెంటనే ఆస్పత్రికి తరలిస్తారు. ప్రతి రోజు వీడియో కన్సల్టేషన్‌ ద్వారా రోగుల ఆరోగ్యవివరాలను వైద్యులు తెలుకుంటారు.

ఫంక్షన్‌ హాళ్లు, హాస్టళ్లలో ఐసోలేషన్‌..

మరోవైపు ప్రభుత్వం కూడా.. పలు ఫంక్షన్‌ హాళ్లు, హాస్టళ్లు, స్కూల్స్‌, కాలేజీలలో ఐసోలేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతోంది. కరోనా కారణంగా పలు వివాహాలు రద్దైన నేపథ్యంలో.. ఫంక్షన్‌ హాళ్ల నిర్వాహకులు ప్రభుత్వానికి ఇచ్చేందుకు ముందుకొస్తున్నారు. అలాగే ప్రభుత్వ వసతి గృహాలు, స్కూల్స్‌, కాలేజీలలో తరగతులు నడవకపోవడంతో అక్కడ కూడా ఐసోలేషన్‌ కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ప్రైవేట్‌ హాస్టళ్ల నిర్వాహకులు ముందుకు వస్తే వాటిలోనూ ఐసోలేషన్‌ ఏర్పాటు చేయనున్నారు. ప్రభుత్వం ఇప్పటికే ప్రభుత్వ హొమియోపతి, ఆయుర్వేద, నేచర్‌క్యూర్‌, నిజామియాటిబ్బి తదితర ఆస్పత్రులలో ఐసోలేషన్‌ పడకలు ఏర్పాటుచేసి చికిత్సలు అందిస్తున్న సంగతి తెలిసిందే.

Updated Date - 2021-05-13T18:06:10+05:30 IST