Abn logo
Nov 8 2020 @ 00:00AM

ట్రోల్‌ మార్‌... ట్రోల్‌ మార్‌...

చేతికి అందనంత దూరంలో ఉంటాయి స్టార్స్‌... చాలా గొప్పగా అనిపిస్తాయి. పుట్టుకతో స్టార్‌ స్టేటస్‌ పొందిన స్టార్‌ కిడ్స్‌ కూడా దూరాన ఉన్నప్పుడు చాలా గొప్పగా అనిపించేవారు.  కానీ సోషల్‌ మీడియాలో అడుగుపెట్టాక ప్రపంచంలో ఎక్కడున్నా సామాన్యులకు మాత్రం ఓ బటన్‌ దూరంలో అందుబాటులో ఉండడం స్టార్‌ కిడ్స్‌కు శాపంగా మారింది. ఏదో ఒక విషయంలో, ఎప్పుడు కావాలంటే అప్పుడు  సోషల్‌ మీడియాలో వారిపై ట్రోలింగ్‌కు దిగుతున్నారు. స్టార్‌ కిడ్స్‌ అయితే చాలు ట్రోలింగ్‌ స్టార్ట్‌ అంటున్నారు నెటిజన్లు.
అభిషేక్‌... ఆరాధ్యకూ తప్పలేదు

అమితాబ్‌ బచ్చన్‌ కొడుకు కావడంతో అభిషేక్‌ బచ్చన్‌కూ, ఐశ్వర్యారాయ్‌ కూతురు ఆరాధ్యకూ ట్రోలింగ్‌ బెడద తప్పలేదు. అభిషేక్‌ బచ్చన్‌ మీద ఎన్ని రకాలుగా ట్రోల్‌ చేశారో లెక్కేలేదు. ‘మీ నాన్నను చూసి ఇండస్ట్రీ నీకు అవకాశం ఇస్తోంది’, ‘నీకు నటన రాదు’ ‘ఇక నీకు సినిమాలు లేవు ఇంట్లో కూర్చోవడమే’ అన్నారు. వాటన్నింటికీ అభిషేక్‌ చాలా హుందాగా బదులిచ్చారు. ‘‘ఒక వేళ ప్రేక్షకుల తీర్పు అదే అయుతే శిరసావహిస్తాను’’ అని చెప్పారు. అభిషేక్‌, ఐశ్వర్య దంపతుల ముద్దుల కూతురు ఎనిమిదేళ్ల ఆరాధ్యకు కూడా ట్రోలర్స్‌ బెడద తప్పలేదు. కొందరయితే ఆరాధ్య కాళ్లను చూసి ‘పోలియో వచ్చినట్టుంది’ అని కామెంట్‌ చేశారు. కొన్ని సినిమా ఫంక్షన్లకు, షోలకు తల్లి ఐశ ్వర్యతో కలసి ఆరాధ్య హాజరయ్యేది. తల్లితో కలిసి ఫొటోలు దిగేది. అవి చూసి ట్రోలర్స్‌ ఒక్కసారిగా రెచ్చిపోయారు. ‘చదువు వదిలేసి తల్లివెంబడి షికార్లు చేస్తోంది’ అంటూ ట్రోలింగ్‌కు దిగారు. విమర్శలు ఆపకపోవడంతో చివరకు అభిషేక్‌ ట్రోలర్స్‌కు సమాధానం ఇచ్చారు. ‘‘వారాంతంలో, సెలవురోజుల్లో మాత్రమే ఆరాధ్య తల్లివెంట ఫంక్షన్లకు హాజరవుతోంది. మిగిలిన రోజులు స్కూలుకు వెళుతోంది’’ అని చెప్పాక మాత్రమే ఆరాధ్యపై ట్రోలింగ్‌ సద్దుమణిగింది.అసలేం బాలేవంటూ...

బాలీవుడ్‌ బాద్‌షా షారూఖ్‌ఖాన్‌ కూతురు సుహానా ఖాన్‌ సోషల్‌ మీడియాలో చాలా చురుగ్గా ఉంటారు. షారూఖ్‌ కుమార్తెగా ఆమెకు చాలామంది అభిమానుల ఫాలోయింగ్‌ ఉంది. తన రోజువారీ జీవితానికి సంబంధించిన చిత్రాలను సోషల్‌ మీడియాలో పంచుకుంటారు. అలాంటి సందర్భాల్లో సుహానా అందంగా లేదంటూ నెటిజన్లు భారీఎత్తున ట్రోలింగ్‌కు దిగారు. కొంతమంది ఆమెపై మీమ్స్‌ కూడా రూపొందించారు. ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకోమన్నారు. ‘నల్లగా ఉన్నావు, ముఖం బాలేదు, ఎత్తు తక్కువ’ అని వంకలు పెట్టారు. ‘అగ్లీ గర్ల్‌’ అని పిలిచారు. ‘మంచి దుస్తులు వేసుకో’ అంటూ సలహాలిచ్చారు. ‘‘ప్రస్తుతం సమాజంలో ఉన్న ఎన్నో సమస్యల్లో ఇదొకటి’’ అంటూ ఆమె కూడా ధీటుగానే బదులిచ్చారు. ‘‘నేను అందంగా ఉండనంటూ నా పన్నెండేళ్ల వయసు నుంచి ట్రోలింగ్‌ చేస్తున్నారు. మనం భారతీయులం, మన రంగు ఇలానే ఉంటుంది. ఇలా ఉన్నందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. నేనొక్కదాన్నే కాదు ఎంతోమంది ఎదుర్కొంటున్న సమస్య ఇది. దీన్ని రూపుమాపాల్సిన అవసరం ఉంది’’ అని బాధ్యతాయుతంగా ఇన్‌స్టాలో సుహానా స్పందించారు.టాటూలు వేయించుకుంటావా!

ఆమీర్‌ఖాన్‌ కుమార్తె ఇరాఖాన్‌పై నెటిజన్లు తరచూ ట్రోలింగ్‌కు దిగుతుంటారు. ఇరా తన ఫొటోలను తరచూ సోషల్‌ మీడియాలో ఉంచుతారు. ఓ సందర్భంలో టాటూలు వేయించుకుని దిగిన ఫొటోను పోస్ట్‌ చేశారు. ‘ఒక ముస్లిం అయి ఉండి టాటూలు వేయించుకుంటావా?’ అంటూ ట్రోలింగ్‌కు దిగారు. అసలు ఆమె తన శరీరంపై టాటూలు వేయించుకోనేలేదు. టాటూలు వేయడం నేర్పించిన ట్రైనర్‌ శరీరంపై ఓ టాటూ వేసింది. దాన్నే ఫొటో తీసి ఇన్‌స్టాలో పెట్టింది. ఆ విషయం తెలియని నెటిజన్లు ట్రోలింగ్‌కు దిగారు. అయితే ఇరా మాత్రం నెటిజన్ల కామెంట్లకు స్పందించలేదు. ‘‘మరో కెరీర్‌ ఆప్షన్‌ దొరికింది’’ అంటూ హుందాగా బదులిచ్చారు.


బుర్ఖా ఎందుకు?

సంగీత దిగ్గజంఎ.ఆర్‌ రెహమాన్‌ కూతురు ఖతీజా రెహమాన్‌ మత విశ్వాసాలను కచ్చితంగా పాటిస్తారు. ‘స్లమ్‌ డాగ్‌ మిలియనీర్‌’ చిత్రం విడుదలై పదేళ్లు గడిచిన సందర్భంగా జరిగిన కార్యక్రమానికి ఆమె బుర్ఖాలో హాజరయ్యారు. అంతే. నెటిజన్లు ఆమెపై ట్రోలింగ్‌కు దిగారు. స్పందించిన ఖదీజా ‘‘నేనేం చిన్న పిల్లను కాదు. ఏ దుస్తులు వేసుకోవాలనేది నా వ్యక్తిగత వ్యవహారం. నాకు సంబంధించిన ప్రతి నిర్ణయం నేనే తీసుకుంటాను’’ అని బదులిచ్చారు. స్టార్‌ కిడ్స్‌లో సోనమ్‌దే ప్రథమస్థానం బాలీవుడ్‌ స్టార్‌ కిడ్‌ సోనమ్‌

కపూర్‌పై ట్రోలింగ్‌ పలు రూపాలు తీసుకుంటూ వచ్చింది. ఈ ఏడాది ఢిల్లీ షాహీన్‌భాగ్‌ ఉదంతం జరిగిన సందర్భంలో అనిల్‌ కపూర్‌, దావూద్‌ ఇబ్రహీం కలసి ఉన్న ఫొటోను పోస్ట్‌ చేసి నెటిజన్లు సోనమ్‌పై భారీ ఎత్తున ట్రోలింగ్‌కు దిగారు. సమాధానం చెప్పాలంటూ నిలదీశారు. ‘మూగది’, ‘దద్దమ్మ’, ‘అసూయపరురాలు’ అంటూ కామెంట్‌ చేశారు. ‘‘మా నాన్న కృష్ణకపూర్‌తో కలసి క్రికెట్‌ మ్యాచ్‌కు వెళ్లారు. ఫొటోలో కృష్ణకపూర్‌ కూడా కనిపిస్తున్నారు. పక్కన ఉన్న వ్యక్తి (దావూద్‌) గురించి నాన్నకు తెలియదు. అమాయకులపై వేధింపులకు పాల్పడుతోన్న మిమ్మల్ని భగవంతుడు క్షమించాలి’’ అని బదులిచ్చారు. మరో సందర్బంలో సోనమ్‌తో పాటు ఆమె భర్త ఆనంద్‌ కూడా నెటిజన్లకు టార్గెట్‌గా మారాడు.


‘‘నువ్వొక బంధుప్రీతి ఉత్పత్తివి, నీ భర్త బాగున్నాడనుకుంటున్నావా? ఒక్కసారి కళ్లు తెరిచి చూడు, ఎంత దరిద్రంగా ఉన్నాడో’’ అంటూ ఒక అమెరికన్‌ మహిళ సభ్యత మరచి వ్యాఖ్యానించింది. ఆ మెసేజ్‌ స్ర్కీన్‌షాట్‌ను సోనమ్‌ ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసి, ‘‘నన్ను టార్గెట్‌ చేయడం ద్వారా ఫాలోవర్లను పెంచుకోవాలనేదే కదా మీ ఉద్దేశ్యం. సినీతారల దృష్టిని ఆకర్షించడానికే ఇలాంటి పోస్టులు పెడుతుంటారు. ఏదైతేనేం నీ కోరిక నెరవేర్చా’’ అని బదులిచ్చారు. కొవిడ్‌ సమయంలో ఇన్‌స్టాగ్రామ్‌లో ‘అవుట్‌డోర్‌ వర్కవుట్‌’ అంటూ సోనమ్‌ ఓ పొటోను పోస్ట్‌ చేశారు. దాంతో ‘‘క్వారంటైన్‌లో ఉండకుండా బయట తిరుగుతూ, ప్రజల జీవితాలను ప్రమాదంలో పడేస్తున్నావు’’ అంటూ ఓ నెటిజన్‌ విమర్శలకు దిగాడు. ‘‘అది నా తోట అని’’ సోనమ్‌ సమాధానం చెప్పుకోవాల్సివచ్చింది.నాన్న వల్లే నీకు ఇండస్ట్రీలో పని

ట్రోలింగ్‌కు తట్టుకోలేక మలయాళ చిత్రాలకు పాటలు పాడడం తగ్గిస్తున్నాను అని ప్రముఖ గాయకుడు యేసుదాస్‌ తనయుడు విజయ్‌ యేసుదాస్‌ ప్రకటించాడు. ఇకమీదట తాను మలయాళ చిత్రాలకు పనిచేయనని బహిరంగంగా స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. ఈ నిర్ణయంపైనా అతన్ని సోషల్‌ మీడియాలో విపరీతంగా ట్రోల్‌ చేశారు. నటుడు, గాయకుడు, డ్యాన్సర్‌గా విజయ్‌ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ధనుష్‌ తమిళ  చిత్రం ‘మారి’లో పోలీస్‌ పాత్రతో పూర్తిస్థాయి నటుడుగా మారారు. ‘‘నీకు సరిగ్గా పాడడం రాదు, నీ తండ్రి వల్లనే నువ్వు గాయకుడువి అయ్యావు’’ అంటూ విజయ్‌ యేసుదా్‌సపై నెటిజన్లు ట్రోల్‌ చేశారు. ‘‘ఏ తండ్రయినా పిల్లలు జీవితంలో స్థిరపడితే చూడాలనుకుంటాడు. అది ఇతరులను బాధపెట్టాలని కాదు. నెటిజన్ల విమర్శలకు భయపడి ఉంటే మొదటి ఐదేళ్లలోనే నేను పాటలు పాడడం మానేసేవాణ్ణి. ఇప్పుడు మలయాళ పరిశ్రమ మీద దృష్టిపెట్టడం తగ్గించాను’’ అని ఓ ఇంటర్వ్యూలో విజయ్‌ యేసుదాస్‌ చెప్పారుఅందంగా లేవన్నారు

అజయ్‌ దేవ్‌గణ్‌, కాజోల్‌ దంపతుల కూతురు న్యాసా దేవ్‌గన్‌ శరీరాకృతిపై  ట్రోలింగ్‌కు దిగారు. దాంతో మనసు నొచ్చుకున్న అజయ్‌ ‘దయచేసి నా పిల్లల్ని ఒంటరిగా వదిలేయండి’ అంటూ వేడుకున్నారు. అక్షయ్‌ కుమార్‌ తనయుడు ఆరవ్‌భాటియాపైనా అందంగా లేడంటూ ట్రోలింగ్‌కు దిగారు. ‘కెనెడియన్‌’ అంటూ వ్యాఖ్యానించారు. కరీనా కపూర్‌ కొడుకు తైమూర్‌ అలీఖాన్‌కు మాటలు రాకపోయినా నెటిజన్ల ట్రోలింగ్‌ తప్పలేదు. అతని పేరుపై జరిగిన ట్రోలింగ్‌తో విసుగుచెందిన కరీనా ‘‘అది ఏ వ్యక్తికీ సంబంధించిన పేరు కాదు, తైమూర్‌ అంటే అరబిక్‌లో ఇనుము అని అర్థం. అందుకే ఆ పేరుపెట్టాం’’ అని సమాధానం చెప్పుకున్నారు. శృతీహాసన్‌, ఆలియా భట్‌, జాన్వీకపూర్‌ లాంటి తారలకూ పలు సందర్భాల్లో ట్రోలింగ్‌ బెడద తప్పలేదు.సేతుపతి కూతురుపై రేప్‌ బెదిరింపులు 

ఇటీవల ముత్తయ్య మురళీధరన్‌ బయోపిక్‌ వివాదం చెలరేగిన సందర్భంలో ‘నీ కూతురును రేప్‌ చేస్తా’ అంటూ ఓ నెటిజన్‌ విజయ్‌సేతుపతిని సోషల్‌ మీడియాలో బెదిరించాడు. అప్పటికే సేతుపతి ‘800’ మూవీ నుంచి తప్పుకున్నారు. అయినా ఆయనపై ట్రోలింగ్‌ ఆగలేదు. రేప్‌ చేస్తానని బెదిరించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. క్రికెట్‌ స్టార్‌ కిడ్స్‌కు కూడా ఈ వేధింపులు తప్పటం లేదు. ‘చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఓటమికి ధోని ఆటే కారణం. అతని కూతురుపై అత్యాచారం చేస్తాను’ అంటూ ఓ వ్యక్తి ధోని భార్య సాక్షి ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాకు బెదిరిస్తూ పోస్ట్‌ పెట్టాడు. Advertisement
Advertisement
Advertisement