పోరు మొదలు

ABN , First Publish Date - 2021-08-03T09:00:08+05:30 IST

గ్రామాల నుంచి మండల కేంద్రాలు, పట్టణాలు, జిల్లా కేంద్రాల వరకు.. సీపీఎస్‌ రద్దు కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు ఉద్యమ బాట పట్టారు. సీపీఎ్‌సను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళన చేపట్టారు.

పోరు మొదలు

  • సీపీఎస్‌ రద్దుకు ఉద్యోగుల ఉద్యమం..
  • గ్రామాల నుంచి జిల్లా కేంద్రాల వరకు
  • రాష్ట్రవ్యాప్తంగా నల్లబ్యాడ్జీలతో నిరసన..
  • వారంలో రద్దుచేస్తానన్న హామీ ఏమైంది? 
  • సీఎం అయి రెండేళ్లయినా నెరవేర్చలేదు..
  • జగన్‌ మాట నిలబెట్టుకోవాలి
  • సీపీఎస్‌ ఉద్యోగులు, ఉపాధ్యాయుల డిమాండ్‌


(ఆంధ్రజ్యోతి, న్యూస్‌నెట్‌వర్క్‌): గ్రామాల నుంచి మండల కేంద్రాలు, పట్టణాలు, జిల్లా కేంద్రాల వరకు.. సీపీఎస్‌ రద్దు కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు ఉద్యమ బాట పట్టారు. సీపీఎ్‌సను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళన చేపట్టారు. ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చిన ‘వారోత్సవాల’లో భాగంగా తొలిరోజు సోమవారం సీపీఎస్‌ ఉద్యోగులు నిరసన తెలిపారు. వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలకు ఉద్యోగులు, ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు. కంట్రిబ్యూటరీ పెన్షన్‌ విధానం (సీపీఎస్)ను రద్దు చేయాలంటూ ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. అధికారంలోకి వచ్చాక వారం రోజుల్లో సీపీఎ్‌సను రద్దు చేస్తానన్న హామీని సీఎం జగన్మోహన్‌ రెడ్డి విస్మరించారని విమర్శించారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా నెరవేర్చలేదన్నారు. వెంటనే సీపీఎస్‌ను రద్దు చేయాలని, పాతపెన్షన్‌ విధానం పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. రెండు లక్షల ఉద్యోగుల కుటుంబాలు సీపీఎస్‌ విధానం వల్ల ఇబ్బంది పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కమిటీల పేరుతో వైసీపీ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని పలువురు ఉద్యోగులు మండిపడ్డారు. సీపీఎ్‌సను రద్దు చేయకపోతే ఉద్యమాన్ని తీవ్రం చేస్తామని హెచ్చరించారు.


ఈ నెల 7వ తేదీ వరకు సీపీఎస్‌ వారోత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు. 8వ తేదీన  సీపీఎస్‌ రద్దు చేసి ఓపీఎస్‌ పునరుద్ధరించాలని ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు అందజేస్తామన్నారు. ఈ నెల 15 తేదీన సీఎం జగన్‌, మంత్రులకు సామాజిక సందేశాలు పంపి నిరసన తెలుపుతామన్నారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకుంటే సెప్టెంబరు 1వ తేదీన రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు నిర్వహించి ’విద్రోహ దినం-నయవంచన సభలు’ ఏర్పాటు చేస్తామని ఏపీసీపీఎ్‌సఈఏ రాష్ట్ర అధ్యక్షుడు రామాంజనేయులు యాదవ్‌ తెలిపారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా వేలాదిమంది సీపీఎస్‌ ఉద్యోగులు నిరసన తెలిపారు. గుడిబండ మండలంలోని హిరేతుర్పి స్కూల్లో రామాంజనేయులు యాదవ్‌ నిరసన తెలిపారు. గోరంట్ల మండలానికి చెందిన తపస్వి అనే చిన్నారి ‘జగన్‌ సార్‌.. సీపీఎస్‌ రద్దు చేయండి ప్లీజ్‌’ అన్న స్లోగన్‌ ఉన్న ఫ్లకార్డుతో ఉద్యోగులకు మద్దతు పలికింది. కడప జిల్లాలో ఏపీసీపీఎస్‌ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. తహశీల్దార్‌ కార్యాలయాల ఎదుట ఆందోళన చేపట్టారు. ఉపాధ్యాయులు విధుల్లో పాల్గొనే నిరసన తెలిపారు. కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఉద్యోగులు నిరసన తెలిపారు. జగన్‌ ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేయాలని ఏపీ కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం ఉద్యోగుల సంఘం కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటరమణరెడ్డి డిమాండ్‌ చేశారు. విశాఖపట్నం జిల్లాలో ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఆందోళనలు నిర్వహించారు. సీపీఎ్‌సను రద్దు చేయకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఏపీసీపీఎ్‌సఈఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.ఉమామహేశ్వరరావు హెచ్చరించారు. ఇతర జిల్లాల్లోనూ ఉద్యోగులు నిరసన తెలిపారు. 

Updated Date - 2021-08-03T09:00:08+05:30 IST