Abn logo
Jan 17 2021 @ 01:15AM

రూ.1,000 కోట్లతో స్టార్టప్‌ ఇండియా సీడ్‌ ఫండ్‌

ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ


న్యూఢిల్లీ: స్టార్టప్స్‌, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు దన్నుగా నిలిచేందుకు గాను రూ.1,000 కోట్లతో ‘స్టార్టప్‌ ఇండియా సీడ్‌ ఫండ్‌’ను ప్రారంభిస్తున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు.

శనివారం నాడిక్కడ ప్రారంభ్‌: స్టార్టప్‌ ఇండి యా ఇంటర్నేషనల్‌ సమ్మిట్‌ను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇన్నోవేటివ్‌ ఆలోచనలను ఆచరణలోకి తీసుకువచ్చేందుకు గాను ఈ ఫండ్‌ ఎంతగానో తోడ్పడుతుందన్నారు. స్టార్టప్స్‌ వృద్ధి పథంలో సాగితే ఉద్యోగాల కల్పనతో పాటు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచటంలో కీలకంగా ఉంటారని ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశారు.


 దేశవ్యాప్తంగా ఉన్న అంకుర సంస్థలు ఎలాంటి నిధుల కొరతను ఎదుర్కొనకుండా చూసేందుకు తాము కట్టుబడి ఉన్నామని, అందుకుతగ్గట్టుగానే పలు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా స్టార్టప్స్‌ కోసం రూ.1,000 కోట్లతో స్టార్టప్‌ ఇండియా సీడ్‌ ఫండ్‌ను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.

కొత్త స్టార్ట్‌ప్సను ఏర్పాటు చేయటం సహా వాటి వృద్ధికి ఈ ఫండ్‌ అవసరమైన తోడ్పాటునందించనుందని పేర్కొన్నారు. ఇప్పటికే స్టార్టప్స్‌ తమకు అవసరమైన నిధులను సమీకరించేందుకు ఫండ్స్‌ ఆఫ్‌ ఫండ్స్‌ ఎంతగానో ఉపయోగపడుతున్నాయన్నారు. 


యువత కోసం యువత:

యువత కోసం యువత అనే నినాదంతో ప్రభుత్వం అంకుర సంస్థలకు అవసరమైన మద్ధతునందిస్తోందని ప్రధాని తెలిపారు. వచ్చే ఐదేళ్ల కోసం మనం మన లక్ష్యాలను నిర్ధేశించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అంతేకాకుండా భారతీయ స్టార్టప్‌ లు.. అంతర్జాతీయ దిగ్గజ యూనికార్న్‌లుగా ఎదగటమే కాకుండా భవిష్యత్‌ టెక్నాలజీలకు మార్గదర్శనం చేసే విధంగా ఉండాలని అన్నారు.


ప్రస్తుతం దేశంలో 41,000 స్టార్ట్‌పలుంటే అందులో ఐటీ రంగానికి చెందిన అంకుర సంస్థలు 5,700 ఉండగా హెల్త్‌కేర్‌ రంగానికి చెందినవి 3,600 ఉన్నాయన్నారు. అలాగే వ్యవసాయ రంగానికి సంబంధించి 1,700 స్టార్టప్స్‌ ఉన్నాయని పేర్కొన్నారు. 100 కోట్ల డాలర్ల మార్కును అధిగమించి యూనికార్న్‌ క్లబ్‌లో చేరిన భారత స్టార్ట్‌పలు 2014లో కేవలం నాలుగు మాత్రమే ఉండగా ప్రస్తుతం అవి 30కి చేరాయని అన్నారు. ఇందులో 11 సంస్థలు.. 2020లో కరోనా కాలంలో యూనికార్న్‌ క్లబ్‌లో చేరటం విశేషమని ప్రధాని పేర్కొన్నారు.  


Advertisement
Advertisement
Advertisement