ఎస్‌బీఐ రుణాలు మరింత ప్రియం

ABN , First Publish Date - 2022-08-16T06:25:50+05:30 IST

ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ (ఎస్‌బీఐ) రుణ గ్రహీతలపై నెలవారీ వాయిదాల (ఈఎంఐ) చెల్లింపు భారం మరింత పెరగనుంది.

ఎస్‌బీఐ రుణాలు మరింత ప్రియం

రుణాల ప్రామాణిక వడ్డీ రేట్లను 0.50% వరకు పెంచిన బ్యాంక్‌ 

సోమవారం నుంచే అమలులోకి.. 


న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ (ఎస్‌బీఐ) రుణ గ్రహీతలపై నెలవారీ వాయిదాల (ఈఎంఐ) చెల్లింపు భారం మరింత పెరగనుంది. రుణాలకు ప్రామాణికమైన రేట్లను బ్యాంక్‌ 0.50 శాతం వరకు పెంచింది. ఆందోళన స్థాయికి పెరిగిన ధరలను కట్టడి చేసేందుకు ఈ నెలలో ఆర్‌బీఐ రెపో రేటును మరో 0.50 శాతం పెంచింది. దాంతో పలు బ్యాంక్‌లు ఇప్పటికే రుణాలపై వడ్డీ రేట్లను పెంచేశాయి. దేశంలో అతిపెద్ద బ్యాంకైన ఎస్‌బీఐ కూడా ఈనెల 15 (సోమవారం) నుంచి అమలులోకి వచ్చేలా ప్రామాణిక రుణ రేట్లను పెంచింది. ఎక్స్‌టర్నల్‌ బెంచ్‌మార్క్‌ బేస్డ్‌ లెండింగ్‌ (ఈబీఎల్‌ఆర్‌), రెపో అనుసంధానిత రుణ రేటు (ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్‌)ను 0.50 శాతం వరకు పెంచిన బ్యాంక్‌..


నిధుల సమీకరణ వ్యయ ఆధారిత వడ్డీ రేటు (ఎంసీఎల్‌ఆర్‌)ను 0.20 శాతం పెంచింది. దాంతో ఎస్‌బీఐ ఈబీఎల్‌ఆర్‌ 8.05 శాతానికి, ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్‌ 7.65 శాతానికి, ఏడాది కాలపరిమితి ఎంసీఎల్‌ఆర్‌ 7.70, రెండేళ్ల ఎంసీఎల్‌ఆర్‌ 7.90 శాతానికి, మూడేళ్ల ఎంసీఎల్‌ఆర్‌ 8 శాతానికి పెరిగాయి. 2019 అక్టోబరు 1 నుంచి ఎస్‌బీఐ సహా అన్ని బ్యాంక్‌లు రెపో రేటు, బాండ్‌ రేట్లు వంటి మార్కెట్‌ ప్రామాణిక  రేట్ల ఆధారిత రుణ రేట్ల విధానానికి మారాయి. 

Updated Date - 2022-08-16T06:25:50+05:30 IST