కమలానికి..దెబ్బ మీద దెబ్బ!

ABN , First Publish Date - 2021-02-22T08:31:21+05:30 IST

రాష్ట్రంలో గత ఎన్నికల్లో ఒక్క శాతం కూడా ఓట్లు సాధించలేని బీజేపీ.. తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో దారు ణ పరాజయం మూట గట్టుకుంది. ప్రపంచంలోనే అత్యధిక కార్యకర్తలు నమోదైన పార్టీగా గుర్తింపు పొందిన బీజేపీ.. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో చట్ట

కమలానికి..దెబ్బ మీద దెబ్బ!

  • రాష్ట్ర బీజేపీకి. కేంద్రం, అధిష్ఠానం షాకులు
  • ప్రత్యేక హోదా నుంచి సీమ నిధుల దాకా
  • రైల్వే జోన్‌ నుంచి స్టీల్‌ ప్లాంట్‌ వరకూ..
  • సొంత సర్కారు నిర్ణయాలతో ఇబ్బందులు
  • విశాఖ ఉక్కుపై ఢిల్లీ వెళ్లినా లాభం లేదు
  • వీర్రాజుకు అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వని ప్రధాని
  • దిక్కు తోచని స్థితిలో రాష్ట్ర బీజేపీ నేతలు

మోదీ ప్రభుత్వం ఓవైపు.. పార్టీ అధినాయకత్వం మరోవైపు ఇస్తున్న వరుస షాకులతో రాష్ట్ర బీజేపీ నేతలకు మైండ్‌ బ్లాంక్‌ అవుతోంది. వైసీపీ, టీడీపీ వంటి ప్రధాన పార్టీలు పెద్దగా విమర్శించకున్నా.. ప్రత్యేక హోదా నుంచి సీమ నిధుల దాకా.. రైల్వే జోన్‌ నుంచి విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ వరకు కేంద్రం తీసుకున్న నిర్ణయాలు రాష్ట్రానికి అశనిపాతంగా మారాయి. ‘వచ్చే ఎన్నికల్లో బీజేపీదే అధికారం.. కుటుంబ వారసత్వ పార్టీలైన వైసీపీ, టీడీపీకి మేమే ప్రత్యామ్నాయం..’ అని తమ నేతలు గంభీరంగా ప్రకటనలు చేస్తున్నారని.. కానీ కేంద్ర సర్కారు, జాతీయ నాయకత్వం తీరుతో నానాటికీ అగాధంలోకి వెళ్లిపోతున్నామని కమలనాథులు ఆందోళన చెందుతున్నారు.


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రాష్ట్రంలో గత ఎన్నికల్లో ఒక్క శాతం కూడా ఓట్లు సాధించలేని బీజేపీ.. తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో దారు ణ పరాజయం మూట గట్టుకుంది. ప్రపంచంలోనే అత్యధిక కార్యకర్తలు నమోదైన పార్టీగా గుర్తింపు పొందిన బీజేపీ.. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో చట్ట సభల్లో తమ పార్టీ అభ్యర్థుల ను గెలిపించుకోగలిగింది. కానీ ఏపీ నుంచి లోక్‌సభలో గానీ, అసెంబ్లీలో గానీ ప్రాతినిధ్యం వహించే వారు లేకపోవడం  దుస్థితికి అద్దం పడుతోంది. అదేమంటే.. ఒక్క సీటు కూడా లేని త్రిపురలో ఏకంగా అధికారాన్నే కైవసం చేసుకున్నామని.. ఇక్కడా అలాగే జరుగుతుందని రాష్ట్ర నేతలు సెలవిస్తున్నారు. 2019 సార్వత్రిక ఫలితాల తర్వాత రాష్ట్ర బీజేపీకి ఢిల్లీలో ఉన్న పేరు ‘నోటా సే ఛోటా’. దీనర్థం నోటా ఓట్ల కంటే తక్కువ వచ్చాయని! 2014 ఎన్నికల ప్రచారంలో ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన బీజేపీ పెద్దలు తర్వాత మాట మార్చడం, రైల్వే జోన్‌పై తాత్సారం, వెనుకబడిన ప్రాంతాలైన రాయలసీమ, ఉత్తరాంధ్రకు ఇచ్చిన నిధులు వెనక్కి తీసుకోవడం లాంటి వాటితో రాష్ట్ర ప్రజలు ఆ పార్టీకి షాకిచ్చా రు. రాష్ట్రాన్ని నిట్ట నిలువునా చీల్చిన కాంగ్రెస్‌ కంటే.. బీజేపీయే ఎక్కువగా వెన్నుపోటు పొడిచిందని కోపం చూపించారు. 


అయితే నోటా కన్నా తక్కువ ఓట్ల నుంచి.. ఐదేళ్లలో అధికారంలోకి వచ్చేస్తామని చెబుతున్న కమలనాథులు.. ప్రజల్లోకి వెళ్లడానికి హిందూ ఆలయాలపై దాడుల అంశాన్ని కొన్నాళ్లు గట్టిగా పట్టుకున్నారు. అంతర్వేది రథం దహనం విషయంలో బీజేపీ ఆందోళన గట్టిగా చేయడంతో రాష్ట్రప్రభుత్వం సీబీఐకి కేసు అప్పగించింది. నెలల తరబడి వేచిచూసినా సీబీఐ స్పందించలేదు. ఈలోపు సర్కారు కొత్త రథం తయారు చేయిచింది. రామతీర్థంలో శ్రీరాముడి విగ్రహం తలనరికిన ఘటన కూడా బీజేపీకి ఆయుధంలా లభించింది. దానిపై రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు రామతీర్థం యాత్ర తలపెట్టి సొమ్మసిల్లి పడిపోయినా పెద్దగా క్రెడిట్‌ దక్కలేదు. అదంతా డ్రామా అంటూ బీజేపీలోనే ఒక వర్గం సామాజిక మాధ్యమాల్లో ఆరోపణలు గుప్పించింది. కపిల తీర్థం నుంచి రామతీర్థం వయా శ్రీశైలం రథయాత్ర చేపడతామని వీర్రాజు ప్రకటించారు. పోలీసుల అనుమతీ కోరారు. ఈలోపు పంచాయతీ ఎన్నికల ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చేసింది. ఇలా ఏ అడుగు ముందు కేసినా అడ్డంకి ఎదురవుతూనే ఉంది.  


విశాఖ ఉక్కు దెబ్బతో..

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ నష్టాల్లో ఉందంటూ కొరియాకు చెందిన పోస్కో కంపెనీకి వాటా విక్రయించేందుకు మోదీ ప్రభుత్వం సిద్ధమైంది. నీతి ఆయోగ్‌ ట్వీట్‌తో ఈ విషయం వెలుగులోకి రావడంతో విశాఖలో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామా చేయగా.. ప్రతిపక్ష నేత చంద్రబాబు, ముఖ్యమంత్రి జగన్‌ సైతం విశాఖ వెళ్లి ఉక్కు కార్మికులతో మాట్లాడడం జరిగాయి. కేంద్రం నిర్ణయంతో ఊహించని షాక్‌కు గురైన వీర్రాజు బృందం విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై మూడు ప్రతిపాదనలు తీసుకుని ఢిల్లీ వెళ్లింది. మూడు రోజులైనా ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదు. చివరికి మూడో రోజు రాత్రి రెండు నిమిషాలు సమయం ఇచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా.. విశాఖ ఉక్కు పేరు ఎత్తగానే కేంద్ర ఉక్కు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలవాల్సిందిగా సూచించారు.


రాష్ట్రానికి వచ్చి ప్రజలకు ఏం సమాధానం చెప్పాలో దిక్కుతోచని స్థితిలో పడిన వీర్రాజు, ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు.. ‘ఒక్క చిన్న ట్వీట్‌పై ఇంత రాద్ధాంతం చేస్తారా..? విశాఖ ఉక్కు ప్రైవేటు పరం చేస్తారని మీకెవరు చెప్పారు..? విగ్రహాల ధ్వంసం ఘటనలపై దృష్టి మరల్చేందుకు వైసీపీ, టీడీపీ కుమ్మక్కు డ్రామా ఆడుతున్నాయి’ అని ఆరోపణలు గుప్పించారు. బీజేపీకి ఎంతో కొంత పట్టున్న ప్రాంతం విశాఖ ఒక్కటేనని చెబుతారు. 2019కి ముందు అక్కడి నుంచి ఆ పార్టీకి ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఉన్నారు. అలాంటి చోట కేంద్రం ఉక్కు దెబ్బకు, రైల్వే జోన్‌ దెబ్బకు వెన్నువిరిగే పరిస్థితి వచ్చింది. దీంతో కమలనాథులు తలలు పట్టుకుంటున్నారు.


ఆంధ్రులకు మనోభావాలు ఉండవా..?

దేశంలో ఏ రాష్ట్రానికి వెళ్లినా బీజేపీ నేతలు అక్కడి ప్రజల మనోభావాలనే టార్గెట్‌ చేస్తారు. ప్రధాని మోదీ ఎక్కడ మాట్లాడినా అక్కడి ప్రజల సంస్కృతిని ప్రశంసిస్తారు. అయితే ఏపీ విషయానికి వస్తే ‘విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు’ అనేది ప్రజల మనోభావాల్లో నుంచి వచ్చిన నినాదం. రాజధాని లేని రాష్ట్రానికి అమరావతి, విభజన సందర్భంగా ఇచ్చిన   హోదా, రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం, ఆంధ్రుల కల ప్రత్యేక రైల్వే జోన్‌.. ఇలా ఏ ఒక్క దాంట్లోనూ ప్రజల మనోభావాలను కేంద్రం పట్టించుకోలేదని.. వీటిపై ఏం జవాబివ్వాలో అంతుపట్టడం లేదని బీజేపీ నేతలు వాపోతున్నారు.

Updated Date - 2021-02-22T08:31:21+05:30 IST