రైస్‌.. రైట్‌.. రైట్‌

ABN , First Publish Date - 2020-08-12T10:54:34+05:30 IST

రాష్ట్ర పౌరసరఫరాల కార్పొరేషన్‌ కస్టమ్‌ మిల్లింగ్‌ బియ్యాన్ని త్వరితగతిన సేకరిస్తోంది.

రైస్‌.. రైట్‌.. రైట్‌

వేగవంతంగా బియ్యం సేకరణ 

సొమ్ముల చెల్లింపులో జాప్యం

రైతుల బకాయి చెల్లించిన తర్వాతే మిల్లర్లకు 


 (తాడేపల్లిగూడెం-ఆంధ్ర జ్యోతి):  రాష్ట్ర పౌరసరఫరాల కార్పొరేషన్‌ కస్టమ్‌ మిల్లింగ్‌ బియ్యాన్ని త్వరితగతిన సేకరిస్తోంది. గడువులోగా లక్ష్యాన్ని చేరుకోనుంది. ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది రబీ బియ్యం సేకరణ వేగవంతం చేసింది. ఇప్పటి వరకూ 5.80 లక్షల టన్నుల బియ్యాన్ని సేకరించారు. మరో 2.29 టన్నులు సేకరిస్తే లక్ష్యం పూర్తి కానుంది. అందులో ఆగస్టు నెలలోనే లక్ష టన్నుల మేర మిల్లర్ల నుంచి తీసుకోనున్నారు. సెప్టెంబరులో మిగిలిన మొత్తాన్ని సేకరించేందుకు అవకాశం ఉంటుందని పౌరసరఫ రాల కార్పొరేషన్‌ అంచనా వేస్తోంది. రబీలో ఉత్పత్తి అయ్యే బియ్యాన్ని సెప్టెంబరు 30వ తేదీలోగా సేకరించాలి. లేదంటే ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఏటా గడువులోగా బియ్యాన్ని సేకరించకపో వడంతో అనుమతులు తీసుకుంటున్నారు. ఈ ఏడాది మాత్రం సకాలంలోనే లక్ష్యం పూర్తికానుంది. 


మిల్లర్లకు రూ. 100 కోట్లు చెల్లించాలి

 బియ్యం సేకరణలో ఉన్న వేగం సొమ్ములు చెల్లింపులో కానరావడం లేదు. రబీలో సేకరించిన ధాన్యానికి సంబంధించి ఇంకా రూ. 33 కోట్లు  రైతులకు చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వ స్థాయిలో సొమ్ములు మంజూరు చేయడం లేదు. ఈ నేపథ్యంలో రైతులకు చెల్లించిన తర్వాతే మిల్లర్లకు బిల్లులు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మిల్లర్లకు ధాన్యం రవాణా చార్జీలు, కస్లమ్‌ మిల్లింగ్‌ చార్జీలు కలిపి రూ. 100 కోట్లు మేర బిల్లులు విడుదల చేయాల్సి ఉంటుంది.  ఒకవైపు బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులు తీర్చాల్సి ఉన్నా సరే మిల్లర్లు నోరు విప్ప లేకపోతున్నారు. మరోవైపు కరోనా కారణంగా నూక, తవుడు, ఊక ధరలు పతనమ య్యాయి. ఈవిధంగానూ మిల్లర్లకు నష్టం వాటిల్లింది. ఈ సమయంలో ప్రభుత్వం బకాయిలు విడుదల చేస్తే కొంత ఊరట లభించే అవకాశం ఉంది.   


 ఎఫ్‌సీఐకి లేనట్టే 

వాస్తవానికి రబీలో బియ్యాన్ని భారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ)కు అప్పగించాలని నిర్ణయించారు. కరోనా కారణంగా నవంబరు నెల వరకు ఉచిత రేషన్‌ అందజేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడంతో రాష్ట్ర ప్రభుత్వమే రబీ బియ్యాన్ని  తీసుకుంటో ంది. లేదంటే కేంద్రం నుంచి ఉచిత రేషన్‌ సొమ్ములు వచ్చే అవకాశం లేదు. దీనిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర పౌరసరఫరా కార్పొరేషన్‌ రబీలో ఉత్పత్తి అయ్యే మొత్తం బియ్యాన్ని సేకరించేందుకు సిద్ధపడింది. అంచ నాలకు భిన్నంగా బియ్యాన్ని సేకరించింది. ఎఫ్‌సీఐ కి అప్పగించే యోచనను విరమించుకుంది.  గోదా ముల లభ్యత ఉండడంతో బియ్యం సేకరణకు ఎటువంటి ఇబ్బంది తలెత్తలేదు. మిల్లర్లు కూడా అనుకున్నట్టుగానే బియ్యాన్ని అప్పగిస్తు న్నారు. కానీ ప్రభుత్వం నుంచి సొమ్ములు విడుదలలోనే ఇప్పుడు జాప్యం చేస్తోంది. 

Updated Date - 2020-08-12T10:54:34+05:30 IST