సీటు లేకపాయె.. ఫీజూ రాకపాయె!

ABN , First Publish Date - 2021-08-01T09:08:42+05:30 IST

రాష్ట్ర విద్యాశాఖ నిర్లక్ష్యం ఓ విద్యార్థికి శాపమైంది. ఇంజనీరింగ్‌ సీటు ఇవ్వకపోగా.. చెల్లించిన ఫీజూ వెనక్కి ఇవ్వలేదు. ఆ విద్యార్థి ఒక విద్యా సంవత్సరాన్ని కూడా కోల్పోవాల్సి వచ్చింది. కనీసం తాను చెల్లించిన ఫీజునైనా తిరిగి ఇప్పించాలంటూ గత కొన్ని నెలలుగా

సీటు లేకపాయె.. ఫీజూ రాకపాయె!

ఏడాదిగా తిరుగుతున్నా ప్రయోజనం శూన్యం

రాష్ట్ర ఉన్నతవిద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం

ఏపీ ఇంజనీరింగ్‌ విద్యార్థికి చుక్కలు చూపిస్తున్న వైనం

సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌కు లేఖలు రాసినా ఫలితం శూన్యం


హైదరాబాద్‌, జూలై 31 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర విద్యాశాఖ నిర్లక్ష్యం ఓ విద్యార్థికి శాపమైంది. ఇంజనీరింగ్‌ సీటు ఇవ్వకపోగా.. చెల్లించిన ఫీజూ వెనక్కి ఇవ్వలేదు. ఆ విద్యార్థి ఒక విద్యా సంవత్సరాన్ని కూడా కోల్పోవాల్సి వచ్చింది. కనీసం తాను చెల్లించిన ఫీజునైనా తిరిగి ఇప్పించాలంటూ గత కొన్ని నెలలుగా ఉన్నతాధికారుల చుట్టూ తిరుగుతున్నాడు. కానీ, ఇంతవరకు అధికారులు కనికరించలేదు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా తెల్లపాడు గ్రామానికి చెందిన చలిచమ సాయి శ్రీహర్షవర్ధన్‌ దీన గాథ ఇది. సాయి 2020లో తెలంగాణ ఎంసెట్‌లో 16161 ర్యాంకు సాధించాడు. కౌన్సెలింగ్‌లోనూ పాల్గొన్నాడు. ఆ విద్యార్థి ఒరిజినల్‌ సర్టిఫికెట్లన్నీ తనిఖీ కూడా చేశారు. అనంతరం ఘట్‌కేసర్‌లోని విజ్ఞాన భారతి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో కంప్యూటర్‌ సైన్స్‌ (డేటా బేస్‌) సీటు కేటాయించారు. ఆ విషయాన్ని అధికారికంగా విద్యార్థికి తెలియజేశారు. అదే సమయంలో ఫీజు కింద రూ.85000 చెల్లించాలనడంతో గత నవంబరు 17న ఆన్‌లైన్‌ ద్వారా ఆ మొత్తాన్ని చెల్లించారు. 


అలాట్‌మెంట్‌ రాలేదన్న కాలేజీ..

ఫీజు చెల్లించిన తర్వాత ఘట్‌కేసర్‌లోని కాలేజీలో చేరేందుకు విద్యార్థి వెళ్లగా.. తమకు ఎంసెట్‌ కన్వీనర్‌ నుంచి అలాట్‌మెంట్‌ లెటర్‌ రాలేదని కళాశాల యాజమాన్యం తెలిపింది. దీంతో ఆ విద్యార్థి ఎంసెట్‌ కన్వీనర్‌ను సంప్రదించారు. సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌కు రానందున అలాట్‌మెంట్‌ను రద్దు చేసినట్లు కన్వీనర్‌ తెలిపారు. వాస్తవానికి సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ జరగకుండా  సీటు అలాట్‌ చేయరు. తాను వెరిఫికేషన్‌కు హాజరైనట్లు ఆ విద్యార్థి చెబుతున్నాడు. అయితే సీటు రద్దయిన నేపథ్యంలో తాను చెల్లించిన ఫీజు రూ.85 వేలను తిరిగి ఇవ్వాలని కోరగా.. కాలేజీనే సంప్రదించాలని కన్వీనర్‌ కార్యాలయ సిబ్బంది చెప్పారు. కాలేజీకి వెళ్లగా.. మళ్లీ ఫీజు కడితే సీటు ఇస్తామన్నారు.


దాంతో ఆ విద్యార్థి తిరిగి ఈ ఏడాది మార్చి 30న మరోమారు రూ.85 వేలు చెల్లించాడు. అయితే అతను కోరుకున్నట్లుగా కంప్యూటర్‌ సైన్స్‌లోని డేటా బేస్‌లో సీటు ఇవ్వలేదు. కంప్యూటర్‌ సైన్స్‌లోని బిజినెస్‌ సిస్టమ్‌లో సీటు కేటాయించారు. దీంతో విద్యార్థి అందులో చేరలేదు. మళ్లీ ఎంసెట్‌ కన్వీనర్‌ కార్యాలయాన్ని సంప్రదించగా, ఫీజు వాపసు కోసం విజ్ఞప్తి లేఖ ఇవ్వాలని కోరారు. ఆ మేరకు లేఖ రాసి ఇచ్చారు. ఆ తర్వాత కార్యాలయ సిబ్బంది స్పందించడం లేదు.  ఎన్నిసార్లు కలిసినా ఇంకా టైమ్‌ పడుతుందనే చెబుతున్నారని ఆ విద్యార్థి ఆవేదన వ్యక్తం చేశాడు. ఎంసెట్‌ 2021 నోటిఫికేషన్‌ కూడా జారీ చేశారని.. ఇంకా తన సమస్య మాత్రం పరిష్కారమవలేదని హర్షవర్ధన్‌ ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. ఈ విషయమై ఇప్పటికే సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ కమిషనర్‌కు లేఖలు రాశాడు. కానీ, ఎవరూ స్పందించలేదని వాపోయాడు.  


రెండుసార్లు ఫీజు చెల్లించాం

విద్యాశాఖ ఉన్నతాధికారుల తీరు వల్ల మా అబ్బాయి ఒక విద్యా సంవత్సరాన్ని కోల్పోవాల్సి వచ్చింది. కష్టపడి ర్యాంకు తెచ్చుకున్నా ఉపయోగం లేకుండా పోయింది. కోరుకున్న సీటు దక్కకపోగా, రెండుసార్లు ఫీజు చెల్లించాం. వాటిని తిరిగి ఇప్పించాలని మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయింది. ప్రతిసారి మా ఊరు నుంచి హైదరాబాద్‌ రావాలంటే ఎంతో ఇబ్బందిగా ఉంది. ఇకనైనా ప్రభుత్వం న్యాయం చేయాలి.

చలిచమ హరిబాబు, విద్యార్థి తండ్రి

Updated Date - 2021-08-01T09:08:42+05:30 IST