ఎగుమతులు, దిగుమతులతో రైతులకు నష్టం

ABN , First Publish Date - 2020-07-05T06:52:48+05:30 IST

ఎగుమతులు, దిగుమతుల విధానంతో రైతులకు నష్టం వాటిల్లుతున్నదని రాష్ట్ర ఆర్థిక మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు.

ఎగుమతులు, దిగుమతులతో రైతులకు నష్టం

  • ఈ విధానంపై కేంద్రం సమీక్షించాలి: హరీశ్‌

ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సంగారెడ్డి, జూలై 4: ఎగుమతులు, దిగుమతుల విధానంతో రైతులకు నష్టం వాటిల్లుతున్నదని రాష్ట్ర ఆర్థిక మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. ఈ విధానంపై కేంద్రం సమీక్షించాలని డిమాండ్‌ చేశారు. కేంద్రం ఆఫ్రికా దేశాల నుంచి కందులను ఇబ్బడిముబ్బడిగా దిగుమతులు చేసుకుంటున్నదని చెప్పారు. ఇక్కడి రైతులకు మంచి ధర రావాలంటే కందుల దిగుమతి నిలిపివేయాలన్నారు. మన దగ్గర కొరత ఉన్న ఆహార పదార్థాలను మాత్రమే దిగుమతి చేసుకోవాలని సూచించారు. సంగారెడ్డి జిల్లా అందోల్‌ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో శనివారం వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.


అనంతరం సంగారెడ్డి కలెక్టరేట్‌లో జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీడీవోలతో నిర్వహించిచ సమావేశంలో మాట్లాడారు. అంతర్జాతీయ మార్కెట్‌లో పత్తి ధర పెరిగితే లాభాన్ని సీసీఐయే పొందుతున్నదని, రైతులకు మాత్రం ఇవ్వడం లేదని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నదని తెలిపారు. సంగారెడ్డి నుంచి అందోల్‌ వెళ్తున్న క్రమంలో ఎంఎన్‌ఆర్‌ కూడలి వద్ద మంత్రి.. జామకాయలు కొనుగోలు చేశారు. 


కోవిడ్‌ రోగులకు ఫోన్‌ ద్వారా పరామర్శ 

సంగారెడ్డి జిల్లాలో కరోనా వ్యాప్తి, నివారణ కోసం తీసుకుంటున్న చర్యలపై మంత్రి హరీశ్‌రావు కలెక్టరేట్‌లో వైద్యాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కరోనా పాజిటివ్‌ వచ్చి ఆస్పత్రిలో చికిత్స పొంది ఇంటికి చేరుకున్న వారికి ఫోన్‌ చేసి ఆరోగ్య పరిస్థితిని వాకబు చేశారు. 

Updated Date - 2020-07-05T06:52:48+05:30 IST