దుబ్బాక, సిద్దిపేట నాకు జోడెద్దుల్లాంటివి

ABN , First Publish Date - 2020-09-16T07:06:22+05:30 IST

తనకు సిద్దిపేట- దుబ్బాక జోడెడ్ల లాంటివి అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేటతో పోటీ పడేలా దుబ్బాక

దుబ్బాక, సిద్దిపేట నాకు జోడెద్దుల్లాంటివి

అభివృద్ధిని దౌడ్‌ తీయిస్తాం

అన్నింటికీ నేనే అండగా ఉంటా..

కేంద్రం పింఛన్లకు ఇచ్చే నిధులు నామమాత్రమే 

రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు


దుబ్బాక, సెప్టెంబరు15: తనకు సిద్దిపేట- దుబ్బాక జోడెడ్ల లాంటివి అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేటతో పోటీ పడేలా దుబ్బాక అభివృద్ధిని దౌడ్‌ తీయిస్తానని హామీ ఇచ్చారు. మంగళవారం దుబ్బాకలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో 142 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను అందజేశారు. దుబ్బాక మున్సిపాలీటీ పరిధిలోని 36 మంది మహిళ సంఘాలకు రూ.2.16 కోట్ల రుణాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి చేసిన కృషి మరువలేనిదన్నారు. పేదలకు అనునిత్యం వెన్నంటే ఉండే నాయకుడు రామలింగారెడ్డి అని, అలాంటి నాయకుడి సేవలు మరవలేనివన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో అందరి కంటే ఎక్కువగా 20 వేల మంది బీడి కార్మికులకు జీవనభృతి అందిస్తున్నామన్నారు. గతంలో రెండు వందల పింఛన్‌ను రెండువేలకు పెంచిన ఘనత తమదేనన్నారు. పించన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.11,700 కోట్లను వెచ్చిస్తే, కేంద్రం కేవలం రూ.210 కోట్లను మాత్రమే చెల్లిస్తుందన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో 56,906 మంది రూ.11.83 కోట్ల పింఛన్లు పొందుతున్నారన్నారు.


దుబ్బాకలో మరింత అభివృద్ధికి తనవంతుగా కృషి చేస్తానని తెలిపారు. దుబ్బాకలోని మార్కెట్‌యార్డు ఆవరణలో రైతువేదిక నిర్మాణం, ఆర్‌డబ్ల్యూఎస్‌ మిషన్‌ భగీరథ కార్యాలయం భవన నిర్మాణం, వాటర్‌ ట్యాంకు నిర్మాణం పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఆయన వెంట జడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మ, వంటేరు ప్రతా్‌పరెడ్డి, దుబ్బాక జడ్పీటీసీ రవీందర్‌రెడ్డి, ఎంపీపీ కొత్త పుష్పలత, బక్కి వెంకటయ్య, ఆర్‌.రాజమౌళి, మున్సిపల్‌ చైర్మన్‌ గన్నె వనితా, అధికం సుగుణబాలకిషన్‌, కౌన్సిలర్‌, ప్రజాప్రతినిధులు, అధికారులున్నారు. దుబ్బాక పర్యటనకు వస్తున్న ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు రామాయంపేట-సిద్దిపేట రహదారిని అనుకుని అక్బర్‌పేట శివారులో పారుతున్న కూడవెళ్లి వాగు పరవళ్లను చూసి సంతోషం వ్యక్తం చేశారు. 


విద్యుత్‌ బిల్లును ఉపసంహరించుకోవాలి 

దౌల్తాబాద్ : రైతుల బోరుబావులకు మీటర్లు పెట్టాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చెబుతున్నదని, దుబ్బాకలో బీజేపీ ఓటు అడగాలంటే పార్లమెంటులో పెట్టిన విద్యుత్‌ బిల్లు ఉపసంహరించుకోవాలన్నారు. మంగళవారం మండల పరిధిలోని మాచిన్‌పల్లి గ్రామంలో రూ.1.60 కోట్ల వ్యయంతో నిర్మించిన 33/11 కేవీ విద్యుత్తు సబ్‌స్టేషన్‌ను మంత్రి ప్రారంభించారు. అనంతరం మల్లేశంపల్లి గ్రామంలో 20 డబుల్‌ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. డంపింగ్‌యార్డ్‌ను ప్రారంభించారు. శేరుపల్లి  బందారం నుంచి లింగరాజు పల్లి వరకు కోటి ఇరవై లక్షల వ్యయంతో నిర్మించనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతు ప్రభుత్వమని, ఒక్క రూపాయి ఖర్చు లేకుండా రైతులకు 24 గంటలు ఉచితంగా కరెంటు సరఫరా చేస్తున్నదని మంత్రి హరీశ్‌ పేర్కొన్నారు. దౌల్తాబాద్‌ ప్రాంత రైతుల మేలు కోసం దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి ఎంతో ఆలోచన చేశారని తెలిపారు.


గత ప్రభుత్వాల హయాంలో కరెంటు ఎప్పుడు ఉంటదో తెలియని పరిస్థితి ఉండేదన్నారు. మోటార్లు కాలిపోవడం, ట్రాన్స్‌ఫార్మర్‌ పేలిపోవడం జరిగేవని, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చాక 24 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్‌ సరఫరా చేస్తున్నామని చెప్పారు. కేంద్ర నిర్ణయంతో దుబ్బాకలో 43,089 బోరుబావులున్న రైతులకు అన్యాయం జరగనుందన్నారు. అవినీతికి ఆస్కారం లేకుండా కొత్త రెవెన్యూ చట్టం తెచ్చి రైతులకు, పేదలకు సీఎం కేసీఆర్‌ మరింత దగ్గరయ్యారని మంత్రి అన్నారు. ఆయన వెంట సర్పంచులు యాదమ్మ,  దార సత్యనారాయణ, స్వప్నాజనార్దన్‌రెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్‌ రోజారాధాకృష్ణశర్మ, ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతా్‌పరెడ్డి, గజ్వేల్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మాదాసు అన్నపూర్ణ శ్రీనివాస్‌, విద్యుత్తు శాఖ ఏస్‌ఈ కరుణాకర్‌ బాబు, దౌల్తాబాద్‌ ఎంపీపీ గంగాధర్‌ సంధ్య, జడ్పీటీసీ రణం జ్యోతి తదితరులు పాల్గొన్నారు.


టీఆర్‌ఎస్‌కే మా ఓటు

దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతితో త్వరలో జరగనున్న ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి తమ ఓటు వేస్తామని సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్‌ మండలం నర్సంపేట గ్రామస్థులు ఏకగ్రీవ తీర్మానం చేసిన పత్రాన్ని మంత్రి హరీశ్‌రావుకు అందజేశారు. టీఆర్‌ఎస్‌ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందడం పట్ల సంతోషంగా ఉన్నట్టు గ్రామస్థులు ఏకగ్రీవ తీర్మానపత్రంలో పేర్కొన్నారు.


పాడి గేదెలు ఎట్లున్నయ్‌.. ఎవుసమెట్లున్నది

తూప్రాన్‌రూరల్ : బర్లు మంచిగ పాలిస్తున్నయా? చెరువులు నిండినయా? ఎవుసాలు ఎట్లున్నయి? వానాకాలం పంటలు ఏం వేశారు? ఆరోగ్యాలు ఎట్లున్నయ్‌? అని మంత్రి హరీశ్‌రావు మల్కాపూర్‌ గ్రామస్థులను పలుకరించారు. మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌ నుంచి మాచిన్‌పల్లిలో విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ను ప్రారంభించేందుకు వెళ్తూ మార్గమధ్యంలో తూప్రాన్‌ మండలం మల్కాపూర్‌, కోనాయపల్లి.పీటీ గ్రామాల్లో కొద్దిసేపు ఆగి గ్రామస్థులతో ముచ్చటించారు. ఎఫ్‌డీసీ చైర్మన్‌ ప్రతా్‌పరెడ్డితో కలిసి ఆయన మల్కాపూర్‌ గ్రామ పరిస్థితులపై ఆరా తీశారు. కేసీఆర్‌ సారు ఇచ్చిన బర్లను చక్కగా సాదుతున్నరా? పాలిస్తున్నయా? అని అడిగారు. పాల ఉత్పత్తులను పెంచుకొని ఆర్థికంగా ఎదగాలి అని లబ్ధిదారులకు సూచించారు. రెండో విడత గేదెలను కూడా ఇప్పించాలని గ్రామస్థులు అడగగా.. సంబంధిత శాఖ అధికారితో ఫోన్‌లో మాట్లాడి పంపిణీ పూర్తిచేయాలని ఆదేశించారు.


డబుల్‌ బెడ్రూం ఇళ్లు కట్టించాలని కోరగా ఈ గ్రామంలో 200 ఇళ్ల నిర్మాణం పనులను త్వరలోనే మొదలు పెట్టిస్తానని, పనులను ఇద్దరు గ్రామస్థుల పేర్లతో అగ్రిమెంటు చేయించుకొని కాంట్రాక్టరుకు అప్పగిస్తే పనులు మొదలు పొట్టచ్చని మంత్రి తెలిపారు. వర్షాలతో చెరువులు నిండడం సంతోషంగా ఉందని, పచ్చని పైర్లతో పల్లెలు కళకళలాడుతున్నాయని సంతోషాన్ని వ్యక్తపరిచారు. కరోనా వ్యాధి సోకకుండా జాగ్రత్తలు పాటించాలని, తనకు కూడా కరోనా సోకిందని, దేవుడి దయతో కోలుకొని మళ్లీ ప్రజాసేవలో లీనమయినట్లు హరీశ్‌రావు చెప్పారు. కొత్త పంచాయతీ భవనానికి నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.

Updated Date - 2020-09-16T07:06:22+05:30 IST