కాంగ్రెస్‌ అంటే కాలిపోయే మోటార్లు.. బీజేపీ అంటే బాయికాడ మీటర్లు

ABN , First Publish Date - 2020-10-25T06:30:25+05:30 IST

కాంగ్రెస్‌ అంటే కాలిపోయే మోటార్లు... బీజేపీ అంటే బాయికాడ మీటర్లని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఎద్దేవా చేశారు

కాంగ్రెస్‌ అంటే కాలిపోయే మోటార్లు.. బీజేపీ అంటే బాయికాడ మీటర్లు

టీఆర్‌ఎస్‌ అంటే నాణ్యమైన కరెంట్‌, రైతుబంధు

నరేంద్రమోదీ గుజరాత్‌లో బీడీ కార్మికులకు పింఛన్లు ఇస్తున్నారా?

బీజేపీ అంటే భారతీయ ఝూటా పార్టీ

రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు


దౌల్తాబాద్‌, అక్టోబరు 24: కాంగ్రెస్‌ అంటే కాలిపోయే మోటార్లు... బీజేపీ అంటే బాయికాడ మీటర్లని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. దౌల్తాబాద్‌ మండలం గోవిందాపూర్‌ మధిర గ్రామమైన పోసాన్‌పల్లిలో తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ వంటేరు ప్రతా్‌పరెడ్డితో కలసి శనివారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామస్థులు వారికి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన కాంగ్రెస్‌, బీజేపీలకు చెందిన 200 మంది కార్యకర్తలు మంత్రి సమక్షంలో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు.


అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 70 ఏళ్ల కాంగ్రెస్‌, టీడీపీల  పాలనలో చేయని అభివృద్ధి పనులు టీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన ఆరేళ్లలోనే చేసిందని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ హాయాంలో కరెంటు లోవోల్టేజీతో మోటార్లు కాలిపోయేవని, ట్రాన్స్‌ఫార్మర్లు పేలిపోయేవని విమర్శించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మోటార్లకు మీటర్లు పెట్టాలని చూస్తున్నదని మండిపడ్డారు. కేసీఆర్‌ నాయకత్వంలో ప్రజలకు అన్నిరకాల సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టామని వివరించారు. అర్హులైన లబ్ధిదారులందరికీ సంక్షేమ ఫలాలు అందేలా పారదర్శకంగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. మాయమాటలు, దొంగమాటలు చెప్పే కాంగ్రెస్‌, బీజేపీలను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. ప్రధాని నరేంద్రమోదీ సొంత రాష్ట్రంలో కనీసం బీడీ కార్మికులకు పింఛనుకు దిక్కులేదని.. కానీ ఇక్కడ బీజేపీ నాయకులు పింఛన్‌లో పదహారు వందల రూపాయలు కేంద్ర ప్రభుత్వమే ఇస్తున్నదని అబద్దాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ అంటే భారతీయ జనతాపార్టీ కాదని.. భారతీయ జూటా పార్టీ ఎద్దేవా చేశారు. 


నియోజకవర్గంలో 20వేల మందికి పింఛన్లు

ప్రజా సంక్షేమంలో తమ ప్రభుత్వం దేశంలోనే అగ్రస్థానంలో ఉందని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో 20వేల పింఛన్లు అందిస్తున్నామని ప్రకటించారు. రైతుబంధు, రైతుబీమా, 24 గంటలు ఉచిత కరెంట్‌, సరిపడా ఎరువులు, విత్తనాలు, పండించిన పంటలను మద్దతు ధరకు కొనుగోలు.. ఇలా రైతుల కోసం అనేక పథకాలు అమలుచేస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనని చెప్పారు.


చివరి శ్వాస వరకు ప్రజల కేసమే పనిచేసిన రామలింగారెడ్డి సతీమణి సుజాతను గెలిపించడం ద్వారా అభివృద్ధిని కొనసాగించాలని కోరారు. అనంతరం ఇందుప్రియాల్‌ గ్రామానికి చెందిన రిటైర్డ్‌ జడ్జి అన్నారెడ్డి గోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో ఉపసర్పంచ్‌తో పాటు వంద మందిని పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనవెంట వైస్‌ఎంపీపీ అల్లిరెడ్డి శేఖర్‌రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ వెంకట్‌రెడ్డి, జిల్లా కోఆప్షన్‌ సభ్యుడు రహీమోద్దీన్‌, నాయకులు ఎర్రసత్యం, అహ్మద్‌, మెరుగు మహేశ్‌, టీఆర్‌ఎస్‌ మండల పార్టీ అధ్యక్షులు రణం శ్రీనివా్‌సగౌడ్‌, ఆదివెంకన్న, చిత్తారిగౌడ్‌, ఖలీలోద్దీన్‌., నాగరాజు, సుజిత్‌గౌడ్‌ తదితరులున్నారు.

Updated Date - 2020-10-25T06:30:25+05:30 IST