ట్రైబ్యునల్లో కేసు ఉండగా.. ‘సీమ’కు ఎలా వస్తారు?

ABN , First Publish Date - 2021-04-15T09:25:19+05:30 IST

రాష్ట్రానికి కేటాయించిన కృష్ణా నదీ జలాలకు లోబడి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపడుతుంటే.. ఓపక్క జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్‌జీటీ)లో వ్యాజ్యం ఉండగా..

ట్రైబ్యునల్లో కేసు ఉండగా.. ‘సీమ’కు ఎలా వస్తారు?

మా కేటాయింపులకు లోబడే నిర్మిస్తున్నాం

మీ అధ్యయనానికి అంగీకరించం

ముందు తెలంగాణ అక్రమ ప్రాజెక్టులపై చర్యలు తీసుకోండి

తక్షణమే బోర్డు మీటింగ్‌ పెట్టండి

కేఆర్‌ఎంబీ పరిధిని నిర్ధారించండి

కృష్ణా బోర్డుకు రాష్ట్రప్రభుత్వం లేఖ


అమరావతి, ఏప్రిల్‌ 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి కేటాయించిన కృష్ణా నదీ జలాలకు లోబడి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపడుతుంటే.. ఓపక్క జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్‌జీటీ)లో వ్యాజ్యం ఉండగా.. ఆ పథకాన్ని ప్రత్యేకంగా పర్యవేక్షించేందుకు ఎలా వస్తారని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ)ని రాష్ట్రప్రభుత్వం ప్రశ్నించింది. తెలంగాణ నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులపై చర్యలు తీసుకోకుండా.. సీమ ప్రాజెక్టు సందర్శనపై ఏకపక్ష నిర్ణయం ఎలా తీసుకుంటారని నిలదీసింది. తక్షణమే బోర్డు సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేయాలని.. అక్కడ తీసుకునే నిర్ణయం ప్రకారం నడచుకోవాలని స్పష్టం చేసింది. రాష్ట్ర విభజన చట్టంలోని 11వ షెడ్యూల్‌లో పేర్కొన్న ప్రాజెక్టులు మినహా.. అనుమతులు లేకుండా తెలంగాణ చేపడుతున్న ప్రాజెక్టుల నిర్మాణాలు జరగకుండా నిలిపివేయాలని డిమాండ్‌ చేసింది.


ఈ మేరకు బుధవారం బోర్డుకు లేఖ రాసింది. ముందుగా బోర్డు పరిధిని నిర్ధారించాలని.. దాని పరిధిలోకి వచ్చే ప్రాజెక్టులేమిటో ఖరారుచేయాలని స్పష్టం చేసింది. సీమ పథకం పనుల పర్యవేక్షణకు ఈ నెల 19, 20వ తేదీల్లో కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ), కేఆర్‌ఎంబీ బృందాలు అధ్యయనానికి వస్తున్నాయని.. ఈ పథకంపై అవగాహన కలిగినవారిని వారి వెంట పంపాలని ఈ నెల 12న బోర్డు రాష్ట్ర జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శికి లేఖ రాసింది. ఆ స్కీం పత్రాలను పంపాలని తాము ఈ ఏడాది మార్చి 31నే కోరామని పథకం పరిశీలన బృందం టీమ్‌ లీడర్‌, బోర్డు కన్వీనర్‌ హరికేశ్‌ మీనా అందులో గుర్తు చేశారు. 19న హైదరాబాద్‌ నుంచి రోడ్డు మార్గంలో కర్నూలు చేరుకుంటామని.. అక్కడ ప్రాజెక్టు ఇంజనీర్లుతో సమీక్షించి.. రాత్రికి కర్నూలులో బస చేసి.. 20వ తేదీన పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తామని తెలిపారు.


ఢిల్లీ భేటీ తర్వాత మారిన వైఖరి!

వాస్తవానికి సీమ పథకం అధ్యయనం చేస్తామని బోర్డు గత నెలలోనే లేఖ రాయగా.. మన రాష్ట్రం వ్యతిరేకించింది. తెలంగాణ అక్రమ ప్రాజెక్టులను సందర్శించకుండా.. కేటాయించిన నీటినే వాడుకుంటామని తాము చెబుతున్నా సీమ ఎత్తిపోతల పథకంపై అధ్యయనం చేయాల్సిన అవసరం ఏముందని నిలదీస్తూ లేఖ రాసింది. కేఆర్‌ఎంబీ చైర్మన్‌ పరమేశం శతెలంగాణకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, ఆయన్ను ఆ పదవి నుంచి తప్పించాలని కేంద్రానికి కూడా లేఖ రాసింది. దాంతో అప్పటికి ప్రాజెక్టు సందర్శన యోచనను బోర్డు విరమించుకుంది. అయితే కొద్ది రోజుల కింద కేఆర్‌ఎంబీ, జలసంఘం, కేంద్ర జలశక్తి శాఖ అధికారులు ఢిల్లీలో సమావేశమయ్యారు. కృష్ణా బోర్డు పరిధిని పరిధిని నిర్ధారించాలని తీర్మానించారు.


అనంతరం సమావేశం వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రి అమిత్‌షా దృష్టికి తీసుకెళ్లారు. ఢిల్లీ భేటీ తర్వాతే బోర్డు అధికారులు ఆంధ్రప్రదేశ్‌ ప్రాజెక్టులపై అధ్యయనానికి సిద్ధమవడం గమనార్హం. పైగా రాష్ట్రంతో సంప్రదించకుండానే ఏకపక్షంగా పర్యటన తేదీలను ఖరారు చేసి.. సమాచారమిచ్చారు. సీమ ఎత్తిపోతలపై కేఆర్‌ఎంబీ అధ్యయనాన్ని అంగీకరించేది లేదని రాష్ట్ర జల వనరుల శాఖ స్పష్టం చేసింది. తాము ఇదే వైఖరికి కట్టుబడి ఉన్నామని ఆ శాఖ ఉన్నతాధికార వర్గాలు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపాయి. సీమ పథకం అధ్యయనానికి పర్యటించే ముందుగా.. బోర్డు సమావేశం ఏర్పాటు చేయాలని.. బోర్దు పరిధిని నిర్ధారించాలని.. తెలంగాణ నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులను పరిశీలించి నిర్మాణాలు ఆపాలన్న డిమాండ్‌లో మార్పేమీ లేదని స్పష్టం చేశాయి.

Updated Date - 2021-04-15T09:25:19+05:30 IST