పరపతి పాయె!

ABN , First Publish Date - 2020-08-09T08:49:52+05:30 IST

జగన్‌ ప్రభుత్వ నిర్ణయాలతో రాష్ట్ర ప్రభుత్వ పరపతి జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో సన్నగిల్లుతోందని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. దీనివల్ల భవిష్యత్తులో మొత్తంగా రాష్ట్రానికి చిక్కులు

పరపతి పాయె!

  • రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు చిక్కులే.. 
  • వచ్చీరాగానే పీపీఏల వివాదం
  • ఆ తర్వాత పలు ప్రాజెక్టులు రద్దు.. ఇప్పుడు అమరావతికీ మంగళం
  • రాష్ట్ర ప్రభుత్వంపై ‘అపనమ్మకం’..
  • నాడు గంటల్లో బాండ్ల విక్రయం
  • మున్ముందు ఈ పరిస్థితి ఉండేనా?

ఒకరు నమ్మాలన్నా, నాలుగు రూకలు ఇవ్వాలన్నా... ‘పరపతి’ కావాలి! అది పోయిందంటే... ఆర్థికంగా అస్తవ్యస్తమే. సంస్థలకైనా, ప్రభుత్వాలకైనా ఇదే వర్తిస్తుంది. వైసీపీ అధికారంలోకి రాగానే పీపీఏల రద్దు, పునఃసమీక్షలతో రాష్ట్రంపై పారిశ్రామిక వర్గాల్లో విశ్వాసం సన్నగిల్లడం మొదలైంది. ఇప్పుడు ‘అమరావతి’ని పక్కనపెట్టి... మూడు రాజధానుల పేరిట మొదలైన చదరంగంలో రాష్ట్ర ప్రభుత్వ పరపతి కూడా కొట్టుకుపోతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. 


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

జగన్‌ ప్రభుత్వ నిర్ణయాలతో రాష్ట్ర ప్రభుత్వ పరపతి జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో సన్నగిల్లుతోందని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. దీనివల్ల భవిష్యత్తులో మొత్తంగా రాష్ట్రానికి చిక్కులు తప్పవని హెచ్చరిస్తున్నారు. అధికారంలోకి వచ్చింది మొదలు జగన్‌ ప్రభుత్వం తీసుకున్న విద్యుత్‌ ఒప్పందాల పునఃసమీక్ష వంటి వివిధ నిర్ణయాలు దేశ, విదేశాల్లోని మదుపరుల్లో ఇప్పటికే ఏపీ పట్ల ఉన్న నమ్మకాన్ని బీటలు వార్చాయని, తాజాగా అమరావతి విషయంలోనూ  అపనమ్మకం మరింత పెరిగే ప్రమాదం ఉందని అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్తులో రాష్ట్రం జారీ చేయబోయే బాండ్లను కొనేవారుండరని పేర్కొంటున్నారు. అలాగే, ఏపీలోని వివిధ ప్రాజెక్టులు, పథకాలకు రుణాలిచ్చేందుకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు వెనుకాడే ప్రమాదముందని అంటున్నారు. అదే జరిగితే, ఎడాపెడా తీసుకొస్తున్న వేలాది కోట్ల రూపాయల రుణాలపైనే ఆధారపడి, తన ప్రజాకర్షక పథకాలను కొనసాగిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి తీవ్ర నిధుల కొరత తప్పదని, అత్యవసరమైన ప్రజా ప్రయోజనాలకు సైతం డబ్బుల్లేని దుస్థితి తలెత్తుతుందని హెచ్చరిస్తున్నారు. 


అప్పుడు ఇదీ డిమాండ్‌

అమరావతి నిర్మాణార్థం 2018-ఆగస్టులో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏపీసీఆర్డీయే అమరావతి బాండ్లను జారీ చేసింది. ముంబై స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లో లిస్టయిన ఈ బాండ్ల ద్వారా రాజధాని ప్రాజెక్టులకు రూ.2,000 కోట్లు సమీకరించాలన్నది సీఆర్డీయే లక్ష్యం కాగా, కేవలం కొద్ది గంటల్లోనే 1.53 రెట్ల ఓవర్‌ సబ్‌స్ర్కైబ్‌ అయింది! బడాబడా సంస్థలు జారీ చేసే బాండ్లకే అంతంత మాత్రపు స్పందన లభిస్తున్న ఆ సమయంలో ప్రభుత్వ రంగంలోని ఒక పట్టణాభివృద్ధి సంస్థ అయిన సీఆర్డీయే జారీ చేసిన బాండ్లకు ఇంతటి ఘనస్పందన లభించడం ఆర్థిక నిపుణులను విస్మయపరచింది! అంతకు ముందే దేశంలోని కొన్ని ఇతర పట్టణాభివృద్ధి సంస్థలు ఇదే తరహాలో చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో ఈ ఘనత సాధించిన సీఆర్డీయేకు కేంద్ర పట్టణ, గృహ మంత్రిత్వశాఖ రూ.26 కోట్ల ప్రోత్సాహకాన్ని ప్రకటించింది. 


అమరావతి బాండ్లలో రూ.కోట్లు పెట్టుబడి పెట్టిన సంస్థలు, వ్యక్తులను కారణాలేమిటని ప్రశ్నిస్తే అమరావతి మాస్టర్‌ ప్లాన్‌, దూరదృష్టితోపాటు చక్కటి ప్లానింగ్‌ కలిగిన(అప్పటి) ఏపీసీఆర్డీయేపై ఉన్న విశ్వాసం వల్లనేనని చెప్పారు. ప్రపంచంలోని 5 అత్యుత్తమ రాజధాని నగరాల్లో ఒకటిగా అమరావతిని రూపొందించేందుకు ఎంతగానో శ్రమిస్తున్న ఏపీసీఆర్డీయే ఆధ్వర్యంలో అమరావతిలోని పలు ప్రాజెక్టులు సకాలంలో పూర్తయి, ఆ ఫలాలు అనతికాలంలోనే అందుతాయన్న పరిపూర్ణ నమ్మకంతోనే ఆ బాండ్లను కొనుగోలు చేశామన్నారు. 


ఆ భరోసా ఇప్పుడేదీ?

ఆప్పట్లో ఏపీసీఆర్డీయే జారీ చేసిన బాండ్లను మదుపుదారులు కొనుగోలు చేశారు. ఇప్పుడు...ఆ సంస్థను రద్దు చేసేశారు. కొత్తగా... పరిధి, పాత్ర కుదించి ‘అమరావతి మెట్రోపాలిటన్‌ ప్రాంత అభివృద్ధి సంస్థ (ఏఎంఆర్డీయే)ను ఏర్పాటు చేశారు. సీఆర్డీయే చేసుకున్న ఒప్పందాలు, జారీ చేసిన బాండ్లు, తీసుకున్న రుణాలు, ఇచ్చిన పూచీకత్తులు ఇత్యాది అన్నింటికీ ఏంఎంఆర్డీయే కట్టుబడి ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. అయినప్పటికీ, రాజధాని అంశంపై ఇప్పటికే ఎన్నెన్నో వివాదాస్పద నిర్ణయాలను ప్రభుత్వం తీసుకున్న దృష్ట్యా ఏఎంఆర్డీయేపై ఇన్వెస్టర్లు పూర్తిగా భరోసా ఉంచలేకపోతున్నారు. 


రుణాలంటే చుక్కలే

రుణాలు మంజూరు చేసేటప్పుడు బ్యాంకులుగానీ, ఆర్థిక సంస్థలుగానీ తమ నుంచి రుణం పొందగోరే వారి ‘గత చరిత్ర’ను నిశితంగా పరిశీలించడం పరిపాటి. రుణ ఒప్పందాల్లోని నిబంధనలను పాటిస్తున్నారా? నిర్ణీత ఇన్‌స్టాల్‌మెంట్లు, వడ్డీలను సకాలంలో చెల్లిస్తున్నారా? తాము ఇచ్చిన రుణాలను నిర్దేశిత పథకాలు లేదా ప్రాజెక్టులకే వినియోగిస్తున్నారా? తద్వారా వాటి నుంచి ఆశించిన ప్రయోజనాలను పొందగలుగుతున్నారా? ఇత్యాది ఎన్నో అంశాలను భూతద్దం వేసి మరీ చూసి, సంతృప్తి చెందితేనే రుణాలిస్తాయి. అమరావతిలోని వివిధ ప్రాజెక్టుల కోసం ‘హడ్కో’ సహా పలు ప్రభుత్వ, ప్రైవేట్‌ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి తీసుకున్న రుణాలను రాష్ట్ర ప్రభుత్వం వినియోగించిన తీరుతెన్నులను సహజంగానే రాష్ట్రానికి ఇకపై అప్పులిచ్చే సంస్థలు క్షుణ్ణంగా పరిశీలిస్తాయి.


అమరావతి బాండ్ల అంశాన్నీ అవి కచ్చితంగా పరిశీలనలోకి తీసుకుంటాయి. పైగా.. దేశవ్యాప్తంగా కలకలం రేపిన విద్యుత్‌ ఒప్పందాల పునఃసమీక్ష అంశం ఉండనే ఉందాయే! ఈ నేపథ్యంలో ఇకపై రాష్ట్రం తనకు అవసరమైన నిధులను రుణరూపేణా సేకరించేందుకు చాలా శ్రమించాల్సి ఉంటుందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జగన్‌ సర్కార్‌ తీసుకుంటున్న ‘కంగాళీ, కక్షపూరిత, తొందరపాటు, అనాలోచిత’ నిర్ణయాలు, చర్యలు ప్రస్తుతానికి కాస్త ఫలితాన్నిస్తున్నట్లు కనిపించినప్పటికీ అవన్నీ దీర్ఘకాలంలో చూపగల దుష్ప్రభావాలను కచ్చితంగా అంచనా వేసిన తర్వాతే రుణాలివ్వాలో? వద్దో? నిర్ణయించుకుంటాయని ఓ ఆర్థిక నిపుణుడు తెలిపారు. రుణాలపైనే అధికంగా ఆధారపడి రోజులు నెట్టుకొస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఇక చుక్కలు కనిపిస్తాయని చెబుతున్నారు. 

Updated Date - 2020-08-09T08:49:52+05:30 IST