గెస్ట్‌హౌస్‌ గాయబ్‌!

ABN , First Publish Date - 2021-09-08T06:08:23+05:30 IST

ఎందరో అతిరథ మహారథులకు..

గెస్ట్‌హౌస్‌ గాయబ్‌!

రూ.1500 కోట్ల విలువ చేసే గెస్ట్‌హౌస్‌ స్థలంలో కమర్షియల్‌ కాంప్లెక్స్‌!

రుద్రాభిషేక్‌ అనే ప్రైవేటు సంస్థకు మాస్టర్‌ ప్లాన్‌ బాధ్యతలు 

డబ్బుల కోసం ల్యాండ్‌ మార్క్‌నే మార్చేస్తారా?  


(ఆంధ్రజ్యోతి, విజయవాడ): ఎందరో అతిరథ మహారథులకు అతిథి సేవలు అందించిన స్టేట్‌ గెస్ట్‌హౌస్‌ కనుమరుగైపోతోంది. రాష్ట్ర ప్రభుత్వం దీనిని కమర్షియల్‌ డెవలప్‌మెంట్‌కు అప్పగించేస్తోంది. ప్రభుత్వ అతిథి గృహం ఉన్న ప్రాంతాన్ని వాణిజ్య అవసరాల కోసం ఉపయోగించనున్నందున బెజవాడలో ఈ ల్యాండ్‌ మార్క్‌ ఇక లేనట్టే.


విజయవాడలోని రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహం ప్రాంగణం మొత్తం 3.26 ఎకరాల్లో విస్తరించి ఉంది. దీనిలో 2.5 లక్షల చదరపు మీటర్లలో వాణిజ్యాభివృద్ధి కోసం మాస్టర్‌ ప్లాన్‌ తయారు చేయాల్సిందిగా రుద్రాభిషేక్‌ అనే ప్రైవేటు సంస్థకు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. రాష్ట్ర ప్రభుత్వం మిషన్‌ బిల్డ్‌ ఏపీలో భాగంగా గెస్ట్‌హౌస్‌ స్థలాన్ని విక్రయించటానికి గతంలోనే ప్రతిపాదించింది. దీనిపై అప్పట్లో సర్వత్రా విమర్శలు వచ్చాయి. నగరం నడిబొడ్డున ఉన్న గెస్ట్‌హౌస్‌ అత్యంత ఖరీదైనది. దాదాపు రూ.1500 కోట్లకు పైగా విలువ చేసే ఆస్తిని విక్రయించటం పట్ల విమర్శలు వచ్చాయి. బిల్డ్‌ ఏపీ మిషన్‌ నుంచి తొలగించాలన్న అభ్యంతరాలు అన్ని వర్గాల నుంచి వచ్చాయి. అవేమీ పరిగణలోకి తీసుకోకుండా ప్రభుత్వం కమర్షియల్‌ డెవలప్‌మెంట్‌కు మాస్టర్‌ ప్లాన్‌ తయారు చేయటం కోసం సంస్థను ఆహ్వానించింది. మాస్టర్‌ ప్లాన్‌కు అనుగుణంగా అక్కడ నిర్మాణాలు ఉంటాయి. ప్రభుత్వ గెస్ట్‌హౌస్‌ అనే ల్యాండ్‌ మార్క్‌ కనుమరుగు అవుతుంది. 


స్టేట్‌ గెస్ట్‌హౌస్‌ను 1960వ దశకంలో నిర్మించారు. గతంలో కెనాల్‌ వెంబడి పాత అతిథి గృహం ఉండేది. అనేక మంది జాతీయ నాయకులు అక్కడ బస చేశారు. అది పూర్తిగా శిథిలమైన తర్వాత స్వరాజ్య మైదానం చెంతన కొత్తగా రాష్ట్ర ప్రభుత్వ గెస్ట్‌హౌస్‌ను నిర్మించారు. ఇది అర్థ శతాబ్ద కాలంగా ఎందరో ముఖ్యమంత్రులు, మంత్రులు, ప్రముఖులు ఈ అతిథి గృహంలో సేద తీరిన వారే. రాష్ట్ర విభజన తర్వాత ఇది జీఏడీ అధీనంలోకి వెళ్లింది. ప్రస్తుత ప్రభుత్వం విశాఖపట్నంలో ప్రధాన రాజధానిని ఏర్పాటు చేయాలని భావిస్తోంది. అక్కడ భారీ గెస్ట్‌హౌస్‌ పనులకు సంకల్పించి, ఇక్కడి గెస్ట్‌హౌస్‌నే లేకుండా చేస్తోంది.

Updated Date - 2021-09-08T06:08:23+05:30 IST