పథకాల అమలులో రాష్ట్రం నెంబర్‌ వన్‌: ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2021-04-12T06:01:19+05:30 IST

సంక్షేమ పథకాల అమలులో దేశంలో నే రాష్ట్రం నెంబర్‌వన్‌ స్థానంలో ఉందని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదివారం పట్టణంలోని 29వ వార్డులో రూ.కోటి 50లక్షలతో నిర్మించనున్న షాదిఖాన, సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే భూమిపూజ చేసి ప్రారంభించారు.

పథకాల అమలులో రాష్ట్రం నెంబర్‌ వన్‌: ఎమ్మెల్యే
నీటి విడుదలకు పూజలు చేస్తున్న ఎమ్మెల్యే జోగు రామన్న

ఆదిలాబాద్‌అర్బన్‌, ఏప్రిల్‌ 11: సంక్షేమ పథకాల అమలులో దేశంలో నే రాష్ట్రం నెంబర్‌వన్‌ స్థానంలో ఉందని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదివారం పట్టణంలోని 29వ వార్డులో రూ.కోటి 50లక్షలతో నిర్మించనున్న షాదిఖాన, సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే భూమిపూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదిలాబాద్‌ మున్సిపాలిటీ అభివృద్ధికి దశల వారీగా కృషి చేస్తున్నామ న్నారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఆదిలాబాద్‌ పట్టణం అభివృద్ధిలో పూర్తిగా దూరంగా ఉందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆరేళ్లలో ఆదిలాబాద్‌ పట్టణ రూపురేఖలు మారుతున్నాయన్నారు.  పట్టణ ప్రగతి కింద మున్సిపాలిటీకి వచ్చే బడ్జెట్‌లో పది శాతం గ్రీన్‌ బడ్జెట్‌ కింద కేటాయించడం జరిగిందన్నారు. దీనిలో భాగంగా పట్టణంలో హరితహారం అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. ఇందులో మున్సిపల్‌ చైర్మన్‌ జోగు ప్రేమేందర్‌, వైస్‌ చైర్మన్‌ జహీర్‌రంజాని, కమిషనర్‌ శైలజ, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

తాగునీరు అందించేందుకు కృషి..

ఆదిలాబాద్‌టౌన్‌: ఏటా తాగునీటి సమస్యతో అవస్థల పాలవుతున్న ప్రజలకు శుద్ధజలాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్‌ మున్సిపాలిటీ పాత 36 వార్డులకు మిషన్‌ భగీరథ ద్వారా తాగునీరు అందించేందుకు ఏర్పాటు చేసిన మధర్‌ ట్యాంకు నుంచి ఆదివారం మున్సిపల్‌ చైర్మన్‌ జోగు ప్రేమేందర్‌తో కలిసి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ.98 కోట్లతో అమృత్‌ పథకం కింద ఈ ట్యాంకు నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. వీటి ద్వారా పట్టణంలోని పాత 36 వార్డుల్లో ఇంటింటికి తాగునీరు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఒక్కో వ్యక్తికి 35 లీటర్ల చొప్పున తాగునీరు అందించేందుకు అధికారులు పట్టణంలోని 11 ట్యాంకులకు నీటిని సరఫరా చేయనున్నట్లు పేర్కొన్నారు. ఆదిలాబాద్‌ పట్టణానికి రోజుకు 2.25కోట్ల లీటర్ల నీరు అవసరమవుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్‌ వెంకన్న, మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ బండారు సతీష్‌, కమిషనర్‌ శైలజ, ఇతర కౌన్సిల్‌ సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-12T06:01:19+05:30 IST