కమలం గూటికి మృత్యుంజయం

ABN , First Publish Date - 2020-06-06T10:23:36+05:30 IST

14 సంవత్సరాలపాటు కాంగ్రెస్‌ పార్టీకి జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరించి ఆ పార్టీలో కీలకంగా ఉంటూ వచ్చిన కటకం మృత్యుంజయం భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆ

కమలం గూటికి మృత్యుంజయం

బీజేపీలోకి ఆహ్వానించిన రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్‌


 (ఆంధ్రజ్యోతిప్రతినిధి, కరీంనగర్‌): 14 సంవత్సరాలపాటు కాంగ్రెస్‌ పార్టీకి జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరించి ఆ పార్టీలో కీలకంగా ఉంటూ వచ్చిన కటకం మృత్యుంజయం భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌తోపాటు రాష్ట్ర నాయకులు వివేక్‌ వెంకటస్వామి, ఇనుగాల పెద్దిరెడ్డి, కరీంనగర్‌, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల బీజేపీ జిల్లాల అధ్యక్షులు బాస సత్యనారాయణ, సోమారపు సత్యనారాయణ, ప్రతాప రామకృష్ణ, మాజీ శాసభ్యులు సుద్దాల దేవయ్య, బొడిగె శోభ, కరీంనగర్‌ మాజీ మేయర్‌ డి.శంకర్‌, మృత్యుంజయం స్వగ్రామమైన గంభీరావుపేటకు వెళ్లి ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. మృత్యుంజయంతోపాటు ఆయన కుమారుడు, గంభీరావుపేట సర్పంచు కటకం శ్రీధర్‌, పలువురు నేతలు బీజేపీలో చేరారు.


జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో మృత్యుంజయం లాంటి కీలకమైన నాయకులు కాంగ్రెస్‌ను వీడి వెళ్లడం ఆ పార్టీకి తీరని లోటని చెప్పవచ్చు. జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఉన్న మృత్యుంజయంకు టీపీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్‌కు మధ్య గత ఎనిమిది నెలలుగా రగులుతున్న విబేధాలు ఆయన పార్టీని వీడడానికి కారణంగా చెబుతున్నారు. పొన్నం ప్రభాకర్‌ జిల్లా అధ్యక్షుడి ప్రమేయం లేకుండా జిల్లా పరిధిలో పలు నిర్ణయాలు తీసుకోవడంతో మృత్యుంజయం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ జనవరి 1వ తేదీన జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి, ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను ఏఐసీసీ అద్యక్షురాలు సోనియాగాంధీకి, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి అలాగే తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంచార్జి కుంతియాకు పంపించారు.


ఈ నేపథ్యంలో కుంతియాతోపాటు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, పలువురు సీనియర్‌ నేతలు మృత్యుంజయంను హైదరాబాద్‌కు పిలిపించి ఆయనతో మంతనాలు జరిపి రాజీనామాను ఉపసంహరింపజేయడానికి ప్రయత్నించారు. ఆ ప్రయత్నాలకు మృత్యుంజయం ఏ మాత్రం వెనక్కితగ్గలేదు. అయినా ఇప్పటి వరకు ఆ పార్టీ నాయకత్వం ఆయన రాజీనామాను ఆమోదించినట్లు ప్రకటించలేదు. పార్టీ రాజీనామాను ఆమోదించక పోయినా మృత్యుంజయం మాత్ర ం కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాలకు పూర్తిగా దూరంగా ఉంటూ వచ్చారు. కాంగ్రెస్‌ పార్టీలో పొడచూపిన విబేధాల నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్‌కుమార్‌ మృత్యుంజయంను తమ పార్టీలోకి ఆహ్వానించడానికి గత డిసెంబర్‌ నుంచే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయంలో వారు రెండు మూడు మార్లు చర్చలు కూడా జరిపారు. అయితే ఇప్పటికీ ఏ నిర్ణయం తీసుకోకుండా ఉన్న మృత్యుంజయం బండి సంజయ్‌ స్వయంగా ఆయన గ్రామానికి వెళ్లి ఆహ్వానించడంతో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. 


టీఆర్‌ఎస్‌ పార్టీ ఏర్పడినపుడు ఆ పార్టీ అధినేత కేసీఆర్‌తో తనకున్న సన్నిహిత సంబంధాల నేపథ్యంలో టీఆర్‌ఎస్‌లో చేరి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి కాంగ్రెస్‌లోనే కొనసాగుతూ వస్తున్నారు. ప్రస్తుతం ఆయన బీజేపీలో చేరడం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. మృత్యుంజయంతో సన్నిహితంగా ఉన్న జిల్లా కాంగ్రెస్‌ బీసీ సెల్‌ మాజీ అధ్యక్షుడు దిండిగాల మధు, జిల్లా కాంగ్రెస్‌ ప్రోగ్రాం కమిటీ కన్వీనర్‌ మూల జైపాల్‌, జిల్లా కాంగ్రెస్‌ సెక్రటరీ జొన్నల రమేశ్‌, జిల్లా కాంగ్రెస్‌ బీసీ సెల్‌ ప్రధాన కార్యదర్శి రాధారపు శ్రీనివాస్‌, ఏనుగుల కిషన్‌, గొడిశాల రమేశ్‌గౌడ్‌తోపాటు పలువురు నాయకులు కూడా కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరారు. 


Updated Date - 2020-06-06T10:23:36+05:30 IST