పెట్రోల్‌పై రాష్ట్ర పన్ను రూ.41

ABN , First Publish Date - 2021-10-23T07:43:23+05:30 IST

పెట్రోల్‌, డీజిల్‌ ధరలను బీజేపీ పెంచిందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మండిపడ్డారు. లీటరుకు రూ.41 రాష్ట్ర పన్ను కింద సీఎం కేసీఆర్‌ తీసుకుంటున్నారని, ఆ డబ్బులు వాపస్‌ ఇస్తే పెట్రోల్‌ రూ.60కే వస్తుందని తెలిపారు.

పెట్రోల్‌పై రాష్ట్ర పన్ను రూ.41

  • అది తగ్గిస్తే రూ.60కే లీటరు పెట్రోల్‌ 
  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌
  • ‘దళిత బంధు’కు ఈటల పేరు పెట్టాలి: కిషన్‌రెడ్డి
  • కేసీఆర్‌కు అంతుచిక్కడం లేదు: ఈటల


(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): పెట్రోల్‌, డీజిల్‌ ధరలను బీజేపీ పెంచిందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మండిపడ్డారు. లీటరుకు రూ.41 రాష్ట్ర పన్ను కింద సీఎం కేసీఆర్‌ తీసుకుంటున్నారని, ఆ డబ్బులు వాపస్‌ ఇస్తే పెట్రోల్‌ రూ.60కే వస్తుందని తెలిపారు. హనుమకొండ జిల్లా కమలాపూర్‌ మండలంలోని శనిగరం, కమలాపూర్‌ గ్రామాల్లో శుక్రవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రమే కొంటోందని, రాష్ట్ర ప్రభుత్వం బ్రోకరిజం చేస్తోందన్నారు. కమలాపూర్‌ పేరును కమల్‌పూర్‌గా మార్చుతామని సంజయ్‌ ప్రకటించారు. ఈటల రాజేందర్‌ రాజీనామాతోనే దళిత బంధు వచ్చిందని, ఆ పథకానికి ఆయన పేరు పెట్టాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. శుక్రవారం కరీంనగర్‌ జిల్లా ఇల్లందకుంట మండలం బూజూనూర్‌లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌తో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఒక్క రోజులోనే అందరికీ దళిత బంధు ఇవ్వాలని కిషన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. హుజూరాబాద్‌ ప్రజల నాడి కేసీఆర్‌కు అంతు చిక్కడం లేదని ఈటల రాజేందర్‌ అన్నారు. 


హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్‌ గెలిస్తేనే సీఎం కేసీఆర్‌కు సోయి వచ్చి, హామీలను నెరవేర్చుతారని ఎంపీ అర్వింద్‌ అన్నారు. కేసీఆర్‌, కేటీఆర్‌లు ఓడిపోయే ప్రాంతాలకు వచ్చి ప్రచారం చేయరని ఎద్దేవా చేశారు. శుక్రవారం కరీంనగర్‌ జిల్లా వీణవంక మండలంలోని మామిడాలపల్లి, చల్లూరు గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ వరి వేయాలని కేసీఆర్‌ ప్రోత్సహించారని.. ఇప్పుడు వరి వేస్తే ఉరి అని ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. కుటుంబ ప్రయోజనాల కోసమే ప్రాంతీయ పార్టీలు పనిచేస్తాయని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కే.లక్ష్మణ్‌ విమర్శించారు.


ఎస్సై చొక్కా పట్టిన టీఆర్‌ఎస్‌ కార్యకర్త

కరీంనగర్‌ జిల్లా ఇల్లందకుంట మండలం సిరిసేడులో శుక్రవారం టీఆర్‌ఎస్‌, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. గ్రామం మీదుగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ర్యాలీగా వెళుతున్న సమయంలో టీఆర్‌ఎస్‌ కార్యాలయం ముందుకు రాగానే ఇరు వర్గాలు పోటీపోటీగా నినాదాలు చేసుకున్నాయి. వారిని శాంతింపజేసే క్రమంలో ట్రైనీ ఎస్సై రజినీకాంత్‌ చొక్కాను టీఆర్‌ఎస్‌ కార్యకర్త పట్టుకున్నాడు. దీంతో అతడిపై కేసు నమోదైంది. కాగా, హుజూరాబాద్‌లో టీఆర్‌ఎస్‌ వాళ్లు బీజేపీ కార్యకర్తలపై దాడికి యత్నించడం వారి ఓటమికి నిదర్శనమని కిషన్‌రెడ్డి అన్నారు. దీనిపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. కిషన్‌రెడ్డిపై దాడికి నిరసనగా శనివారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని బండి సంజయ్‌ వెల్లడించారు.

Updated Date - 2021-10-23T07:43:23+05:30 IST