ఆస్తుల వివరాల సేకరణపై 8 వరకు స్టే

ABN , First Publish Date - 2020-12-04T08:01:20+05:30 IST

వ్యవసాయేతర ఆస్తులు ధరణి వెబ్‌ పోర్టల్‌లో నమోదు చేయడం కోసం కులం, కుటుంబ సభ్యుల వివరాలు, ఆధార్‌ వివరాల

ఆస్తుల వివరాల సేకరణపై  8 వరకు స్టే

‘ధరణి’పై మధ్యంతర ఆదేశాలను పొడిగించిన హైకోర్టు 

ఆస్తుల నమోదుకు కులం, ఆధార్‌ వివరాలెందుకు?

అడ్వొకేట్‌ జనరల్‌ను ప్రశ్నించిన ధర్మాసనం 

హైదరాబాద్‌, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయేతర ఆస్తులు ధరణి వెబ్‌ పోర్టల్‌లో నమోదు చేయడం కోసం కులం, కుటుంబ సభ్యుల వివరాలు, ఆధార్‌ వివరాల సేకరణపై విధించిన స్టేను హైకోర్టు పొడిగించింది. ఈ నెల 8 వరకు మధ్యంతర ఆదేశాలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. వ్యవసాయేతర ఆస్తులను ధరణిలో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని, లేకపోతే వాటిపై భవిష్యత్‌లో ఎలాంటి లావాదేవీలకు వీలు కల్పించబోమన్న ప్రభుత్వ ప్రకటనను; ధరణిలో ఆస్తుల నమోదు కోసం కులం, ఆధార్‌ సంఖ్య కోరడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన 7 వాజ్యాలను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌, జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డిల ధర్మాసనం గురువారం విచారించింది. ఈ వ్యాజ్యాలపై సుదీర్ఘ వాదనలు జరిగాయి.


పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది డి.ప్రకాశ్‌రెడ్డి వాదనలు వినిపించారు. ధరణి పోర్టల్‌ను డిజిటల్‌ రికార్డుల కోసం తెచ్చామంటున్న ప్రభుత్వం.. అందులో నమోదు చేసుకోకపోతే ఇకపై క్రయవిక్రయాలకు తావు లేదని హెచ్చరిస్తోందని తెలిపారు. సెప్టెంబరు 8 నుంచి నిలిపివేసిన ఆస్తుల రిజిస్ట్రేషన్లు త్వరలోనే ప్రారంభిస్తామని చెబుతున్న ప్రభుత్వం.. ధరణిపై కేసులు హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయంటూ రిజిస్ట్రేషన్లు ఆపేసిందని చెప్పారు. ధరణికి రిజిస్ట్రేషన్లతో సంబంధం లేకపోతే ఎందుకు నిలిపివేయాల్సి వచ్చిందని అడిగారు. సవరించిన చట్టం-2020లోనూ ఆర్‌వోఆర్‌ను సమగ్రంగా నిర్వచించలేదన్నారు. దీని ప్రకారం ఆర్‌వోఆర్‌ కేవలం వ్యవసాయ భూములకే వర్తిస్తుందని.. దీన్ని వ్యవసాయేతర భూములకు వర్తింపజేస్తే ఆర్టికల్‌ 300ఏను ఉల్లంఘించడమే అవుతుందని తెలిపారు.


ఇక వ్యవసాయేతర ఆస్తులకు పాస్‌పుస్తకాలు ఇచ్చే అంశం ఏ చట్టంలోనూ లేదన్నారు. ఈ దశలో కల్పించుకున్న సీజే.. నూతన చట్టంలో నిర్వచించకపోతే పూర్వ చట్టంలో ఉన్న నిర్వచనాన్ని ఎందుకు అన్వయించుకోరాదని ప్రశ్నించారు. ప్రకాశ్‌రెడ్డి బదులిస్తూ.. ప్రభుత్వ అఫిడవిట్‌లో తాము లేవనెత్తిన అంశాలను ఎక్కడా ప్రస్తావించలేదన్నారు. ఆర్‌వోఆర్‌కు ధరణిలో చోటు లేదన్నారు. తిరిగి కల్పించుకున్న సీజే.. వివాదరహితంగా ఉండాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఇంటిని చక్కదిద్దే పనిచేస్తోందని, ఎలక్ర్టానికల్‌గా చేస్తే వచ్చే ఇబ్బందేంటని ప్రశ్నించింది.


ప్రకాశ్‌రెడ్డి బదులిస్తూ.. చట్టం లేకుండా సాధ్యం కాదన్నారు. పాలకులకు ఏదో ఒక ఆలోచన తడితే దాన్ని 10-15 రోజుల్లో అమలు చేయాలంటే ఎలా కుదురుతుందని అడిగారు. ఒక ఎంట్రీకి రూ.5లు చెల్లించి ధరణి వెబ్‌పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేస్తే ఆ వివరాలు ఎవరి అధీనంలో ఉంటాయి? తప్పుడు ఎంట్రీలను ఎవరు సరిచేయాలి? ఒక చట్టం, నిబంధనలు లేకుండా ఎలా సాధ్యం అవుతుంది? అని అన్నారు. 



సంస్కరణలు చేస్తే తప్పేంటి?

‘గతంలో సిబ్బంది ద్వారా మ్యుటేషన్లు చేసేవారు. ఇపుడు ఎలక్ర్టానిక్‌ పద్ధతిలో చేయతలపెట్టారు. అందులో తప్పేంటి’ అని ధర్మాసనం ప్రశ్నించింది. ‘మాకు అర్థమైనంత వరకు ధరణి ఒక ఎలక్ర్టానిక్‌ ఫ్లాట్‌ఫాం’ అని సీజే అన్నారు. ప్రకాశ్‌రెడ్డి బదులిస్తూ.. ధరణిలో నమోదు చేసుకోకపోతే, తర్వాత క్రయవిక్రయాలకు తావులేదని చెబుతున్నారన్నారు. ఆస్తుల వివరాల సేకరణపై నవంబరు 3న కోర్టు స్టే ఆదేశాలు ఇచ్చింది. కానీ, సెప్టెంబరు 8 నుంచే అన్ని రకాల రిజిస్ట్రేషన్లు నిలిపివేశారని గుర్తుచేశారు.


సీజే కల్పించుకుంటూ.. ‘ఏళ్ల తరబడి కేసులు పెండింగ్‌లో ఉండకుండా స్ట్రీమ్‌లైన్‌ చేసి వివాద రహితంగా చేస్తే తప్పేంటి’ అని ప్రశ్నించారు. ప్రకాశ్‌రెడ్డి బదులిస్తూ.. ‘ప్రజలకు మేలు చేయాలంటే చేయవచ్చు. కానీ, అనుమానాలు నివృత్తి చేయాలి. తగిన చట్టాలు, నిబంధనలు రూపొందించిన తర్వాత చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. మౌఖిక ఆదేశాల ద్వారా చేయడానికి వీల్లేదు’ అని చెప్పారు. తిరిగి కల్పించుకున్న ధర్మాసనం.. రాష్ట్రంలో రెవెన్యూ రికార్డులు డిజిటలైజేషన్‌ అయ్యాయా అని అడ్వొకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ను అడిగింది.


ఏజీ బదులిస్తూ.. రెవెన్యూ రికార్డులు డిజిటలైజేషన్‌ చేసే ప్రతిపాదన ఉందన్నారు. అన్ని ఆస్తులు డిజిటల్‌ చేయాలని ప్రభుత్వం యోచిస్తోందన్నారు. ఈ వివరణపై స్పందించిన సీజే.. ‘ఆస్తుల బదిలీకి ధరణిలో నమోదు చేసుకోవాలా? లేకపోతే చేయరా? ఆధార్‌, కులం, కుటుంబ సభ్యుల వివరాలు ఎందుకు? మీరు చెబుతున్నవి అస్పష్టంగా ఉంటున్నాయి. ఆర్‌వోఆర్‌ను నిర్వచించలేదు. అలాంటప్పుడు సవరణ చట్టం ఎందుకు’ అని ప్రశ్నించారు. ఈ వ్యాజ్యాల్లో పిటిషనర్లందరి వాదనలు విన్న తర్వాతే తాము ఆదేశాలు జారీచేస్తామని స్పష్టం చేశారు. తదుపరి విచారణను ఈ నెల 8కి వాయిదా వేశారు.


Updated Date - 2020-12-04T08:01:20+05:30 IST