ఇది అనుకోని వరం!

ABN , First Publish Date - 2020-04-03T06:41:58+05:30 IST

తప్పనిసరిగా ఇంట్లోనే గడపాల్సిన కాలాన్ని మన అంతరాలను తరచి చూసుకొనే ఏకాంత సమయంగా మార్చుకుందాం. అంతర్గతంగా ఉన్న మలినాలను...

ఇది అనుకోని వరం!

తప్పనిసరిగా ఇంట్లోనే గడపాల్సిన కాలాన్ని మన అంతరాలను తరచి చూసుకొనే ఏకాంత సమయంగా మార్చుకుందాం. అంతర్గతంగా ఉన్న మలినాలను వదిలించుకోవడానికి అందివచ్చిన అవకాశంగా మలుచుకుందాం.

ప్రపంచంలో ఏ జంతువుకూ గతాన్ని గుర్తు పెట్టుకొనే జ్ఞాపకశక్తి లేదు. కాబట్టి గత కాలపు అనుభవాల నుంచి అవి ప్రత్యేకించి పాఠాలు నేర్చుకోలేవు. అలా నేర్చుకొని భవిష్యత్తును మలుచుకోలేవు. అవి ఎప్పుడూ వర్తమానానికి లోబడే ఉంటాయి. జ్ఞాపక శక్తి ఉన్నవాడు మనిషే! కాబట్టి అతనికి గతకాలపు స్మృతులు గంపల కొద్దీ ఉంటాయి. అవే మనసుగా రూపొందుతాయి. తనను తాను సంస్కరించుకోవడానికీ, భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడానికీ అవకాశం ఈ చరాచర ప్రపంచంలో ఒక్క మనిషికే ఉంది. 


మౌనంతోనే ధ్యానం... జ్ఞానం!

మనసు లోతుల్లోకి పోవాలంటే మనిషికి ఏకాంతం కావాలి. ఎవరైతే ఏకాంతాన్ని శిక్షణగా మలచుకున్నారో వారే శ్రమణకులయ్యారు. యోగులయ్యారు. ధ్యానులయ్యారు. ధ్యాని సహజ లక్షణం మౌనం! ఏ వ్యక్తి తనను తాను తెలుసుకుంటాడో... తనకు తాను తెలియకుండానే అతను మౌనిగా మారిపోతాడు. ‘మౌని’ అంటే అర్థం ‘మూగ’ అని కాదు... ‘జ్ఞాని’ అని!  ఎందరో యోగులు, జైన, బౌద్ధ భిక్షువులూ... వీరందరూ మౌనులే! నిజం చెప్పాలంటే వారు ఈ ప్రపంచం కోసం జ్ఞాన జ్యోతులు వెలిగించిన గొప్పవారు. సిద్ధార్థుడు ఇల్లు వదిలాక 74 మాసాలు మౌనంలోనే గడిపాడు. 75వ మాసం ఆరంభంలో జ్ఞానోదయం పొంది, బుద్ధుడు అయ్యాడు. 


అన్నీ శ్రమణక సంప్రదాయం నుంచే!

ప్రపంచంలో మరెక్కడా లేని శ్రమణక సంప్రదాయం భారతదేశంలోనే పుట్టింది. మనిషికీ, మనసుకూ అవినాభావ సంబంధం ఏర్పరచింది. మనిషి మనో క్షేత్రాన్ని దుక్కి దున్నింది. మనిషికి పారలౌకిక ప్రపంచం కన్నా తన మనోప్రపంచమే ముఖ్యం అనే ఆలోచనను మొలకలెత్తించింది. యజ్ఞాలూ, జంతుబలులు లాంటి వాటి వెంట మనిషిని పరుగులెత్తించకుండా, తనను తాను చూసుకొనే విధంగా, తన లోతులను తాను అన్వేషించుకొనే విధంగా మార్చింది. ఈనాడు మనం చెప్పుకొనే యోగం, ధ్యానం, ఏకాగ్రత.. ఇవన్నీ శ్రమణక సంప్రదాయం నుంచి పుట్టిన ఫలాలే! అది మనిషికి ఆధ్యాత్మిక, ధార్మిక మార్గాలు చూపిన సంప్రదాయం. ఋషి, ముని, తాపసి, జినుడు, భిక్షువు, భిక్షుణి... వీరందరూ శ్రమణకులే. వారి సిద్ధాంతం అహింస, ధ్యానం, యోగాలే! వీరంతా ఒంటరితనాన్నీ  లేదా ఏకాంతాన్నీ శిక్షగా కాకుండా మనోశిక్షణగా మలచిన వారే! వారి సిద్ధాంతంలో ఒంటరితనం ఒక వరం. 


మనలోకి మనం!

శ్రమణ సంప్రదాయంలో బుద్ధుడు ఆవిష్కరించిన యోగ పద్ధతి ధ్యానం. దాన్ని ‘విపశ్యన’ (బౌద్ధంలో ‘విపస్సన’) అంటారు. అంటే తనలోకి తాను చూసుకోవడం! తనను తాను దర్శించుకోవడం. అదే అంతర్‌ దృష్టి. ఈ అంతర్‌ దృష్టి వల్ల అజ్ఞానం పటాపంచలవుతుంది. తప్పేదో, ఒప్పేదో తెలుస్తుంది. ఎవరో చెప్పే మాటలు నమ్మి వంచించడం, వంచనకు గురి కావడం ఆగుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సమ్యక్‌ (సరైన) దృక్పథం ఏర్పడుతుంది. సమస్యలను పరిష్కరించుకోగల శక్తి పుట్టుకొస్తుంది. ఈ స్థితికి చేరుకున్నప్పుడు మనం మానవ సమాజంలో మంచి భర్తగా, మంచి భార్యగా, మంచి బిడ్డగా, మంచి కుటుంబ సభ్యునిగా, మంచి పౌరునిగా రూపొందగలం. మన కుటుంబాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుకోగలం. 

పరుగులు తీసే నాగరక ప్రపంచంలో మనిషికి తనలోకి తాను చూసుకొనే అవకాశం ఈనాడు లేకుండా పోయింది. ఏకాగ్రత ఎంత వెతికినా దొరకని వస్తువు అయిపోయింది. ఇప్పుడు కీడులో మేలుగా... కరోనా విజృంభణ వల్ల ప్రతి ఒక్కరికీ ఈ అవకాశం కలిగింది. ఇంట్లో ఒంటరిగా కొన్నాళ్ళు గడిపే అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని అంది పుచ్చుకోవాలి. సానుకూలంగా మలచుకోవాలి. అలా మలచుకోగల శక్తి భారతీయుల జీవనాడిలోనే ఉంది. ఈ జీవరసం బౌద్ధం ద్వారా తూర్పు దేశాలకు అందింది. అందుకే ఈ శ్రమణక సంప్రదాయ స్పర్శ ఉన్న తూర్పు దేశాలు కరోనా ఉపద్రవం నుంచి తేరుకుంటున్నంత తేలికగా పాశ్చాత్య దేశాలు తేరుకోలేకపోతున్నాయి. కాబట్టి మన జీవనాడిని మరోసారి నిద్ర లేపుదాం. ఈ ఏకాంతాన్ని వరంగా మార్చుకుందాం! మనలోకి మనం చూసుకుందాం!! మన లోపల ఉన్న మలినాలను వదిలించుకుందాం!!

-బొర్రా గోవర్ధన్‌


Updated Date - 2020-04-03T06:41:58+05:30 IST