ప్రజల్లో నమ్మకాన్ని నిలబెట్టుకున్నాం!

ABN , First Publish Date - 2020-05-30T10:19:52+05:30 IST

‘ప్రజలు మాకు ముఖ్యం. వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవటం మా ధర్మం. ఏడాదిగా మా ప్రభుత్వం అదే చేసింది. అనుకున్నది సాధించింది

ప్రజల్లో నమ్మకాన్ని నిలబెట్టుకున్నాం!

వెలిగొండ పనులు వేగిరం

ట్రిపుల్‌ ఐటీ నిర్మాణంలో పురోగతి

రామాయపట్నం పోర్టు విషయంలో

తొలి అడుగు విజయవంతం

దొనకొండ ప్రాంతంలో

పారిశ్రామిక అభివృద్ధికి మ్యాప్‌ 

నీటిని పుష్కలంగా అందించాం

‘ఆంధ్రజ్యోతి’తో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి


ఒంగోలు, మే 29 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : ‘ప్రజలు మాకు ముఖ్యం. వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవటం మా ధర్మం. ఏడాదిగా మా ప్రభుత్వం అదే చేసింది. అనుకున్నది సాధించింది. అందుకే ప్రజలు జేజేలు పలుకుతున్నారు. వివిధ రకాల సమస్యలు సృష్టించాలనుకున్న ప్రతిపక్షాలు కూడా ప్రజా స్పందనను చూసి జంకుతున్నాయి’ అని రాష్ట్ర విద్యుత్‌, అటవీ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నా రు. రాష్ట్రంలో జగన్‌ సారథ్యంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఆయన ఆంధ్రజ్యోతి ప్రతినిధికి ఇంటర్వ్యూ ఇచ్చారు. పలు అంశాలపై స్పష్టమైన సమాధానం చెప్పారు. ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.


ఏడాది పాలనలో మీరేమి సాధించారు?

చెప్పినవే సాధించాం. అదీ నిర్ధిష్ట విధానంతో ముందుగానే ఒక కార్యక్రమాన్ని ప్రకటించి తదనుగుణంగా చేశాం.  


మీరు చెప్పినవన్నీ చేయగలుగుతున్నారా?

 దేశంలో ఎన్నికల మ్యానిఫెస్టోను నూటికి నూరుశాతం అమలు చేస్తున్న ఏకైక సర్కారు సీఎం జగన్‌ సారథ్యంలోని వైసీపీ ప్రభుత్వమే. 


జిల్లాలో మీరు, మీ నాయకుడు ఇచ్చిన హామీల అమలు మాటేమిటి?

అన్నింటిపై దృష్టి సారించాం. వెలిగొండ పనులు వేగిరంగా సాగుతున్నాయి. అప్పట్లో చంద్రబాబు నాయుడు మాటలతో మభ్యపెట్టాడు. ఇప్పుడు అనుకున్న ప్రకారం అన్ని పనులూ సాగుతున్నాయి. 


ఇతర శాశ్వతాభివృద్ధి పనులను వదిలేసినట్లున్నారు కదా?

రామాయపట్నం పోర్టు నిర్మాణానికి నిర్ధిష్టమైన ప్రణాళికను ఇప్పుడే రూపొందించాం. అనుమతులు, అవకాశాలు లేనివి కాకుండా మిగిలిన వాటి నిర్మాణానికి శ్రీకారం పలికాం.  ట్రిపుల్‌ ఐటీ తరగతులు జిల్లాలో ప్రారంభమయ్యేందుకు అవసరమైన భవనాల నిర్మాణానికి చర్యలు తీసుకున్నాం. యూనివర్సిటీ ఏర్పాటుపై కలెక్టర్‌కు బాధ్యతలు ఇవ్వటమే కాక తొలివిడత నిధులు కూడా మంజూరు చేశాం.  దొనకొండలో పారిశ్రామిక అభివృద్ధికి పునాదులు వేశాం.  


రైతాంగ సమస్యలను విస్మరించారు కదా?

ఐదారు సంవత్సరాల తర్వాత సాగర్‌ నీటిని అటు సాగుకు, ఇటు తాగుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందించిన ఘనత మా ప్రభుత్వానిదే. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటులోనూ కొన్ని సమస్యలు ఎదురైనా అధిగమించి కేంద్రాలు ఏర్పాటు చేశాం.


పొగాకు రైతుల సమస్యపై మీరేమంటారు?

ఇందులో కేంద్ర ప్రభుత్వ బాధ్యత ప్రధానం. అయినా రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికారులతో మాట్లాడుతూ, రాష్ట్ర స్థాయిలో వ్యాపారులతో మా వ్యవసాయ శాఖ మంత్రి సమావేశమవుతున్నారు.


 ఒంగోలులో కూడా అభివృద్ధి పనులకు ప్రాధాన్యం ఇవ్వలేదు కదా?

డాక్టర్‌ వై.ఎస్‌. రాజశేఖర రెడ్డి హయాంలో శంకుస్థాపన జరిగిన పోతురాజు కాలువ అభివృద్ధికి ఇప్పుడు నిధులు మంజూరు చేశాం. నగరంలోని పలు ప్రాంతాలలో హైఓల్టేజీ తీగల సమస్య పరిష్కారానికి కృషిచేస్తున్నాం.


ఇవన్నీ అభివృద్ధి పనులు కావా?

వైసీపీ కార్యకర్తలు సంతృప్తిగా లేరన్న వాదన నిజం కాదా?

అక్కడక్కడా కొన్ని సమస్యలున్నా కార్యకర్తలను ప్రాణంగా చూసుకునేందుకే ప్రాధాన్యం ఇస్తున్నాం. ఏఎంసీ పదవుల ఎంపికలోనే ఆ విషయాన్ని తేటతెల్లం చేశాం. కొన్ని ప్రాంతాలలో ఉన్న సమస్యలను కూడా పరిష్కరించి మా కార్యకర్తలకు అండగా నిలుస్తున్నాం.  

Updated Date - 2020-05-30T10:19:52+05:30 IST