ఉక్కుకు దక్కని స‘పోర్టు’

ABN , First Publish Date - 2021-05-09T08:26:04+05:30 IST

ఏరు దాటాక తెప్పతగలేశారు! ‘విశాఖ ఉక్కు’కు గంగవరం పోర్టులో దిక్కులేకుండా చేశారు. స్టీల్‌ ప్లాంట్‌ నుంచి నామమాత్రపు ధరకే 1400 ఎకరాలు తీసుకుని ఏర్పాటు చేసిన గంగవరం రేవులో...

ఉక్కుకు దక్కని స‘పోర్టు’

గంగవరంలో దక్కని బెర్త్‌

హామీ ఇచ్చి మరిచిన సర్కారు

పోర్టుకు 1400 ఎకరాల ఉక్కు భూములు

బెర్తు మాటెత్తకుండా పోర్టు అమ్మకం


(విశాఖపట్నం - ఆంధ్రజ్యోతి)

ఏరు దాటాక తెప్పతగలేశారు! ‘విశాఖ ఉక్కు’కు గంగవరం పోర్టులో దిక్కులేకుండా చేశారు. స్టీల్‌ ప్లాంట్‌ నుంచి నామమాత్రపు ధరకే  1400 ఎకరాలు తీసుకుని ఏర్పాటు చేసిన గంగవరం రేవులో... కర్మాగారానికి ఒక్క బెర్తు కూడా కేటాయించకుండా గాలికి వదిలేశారు. ఉక్కు కర్మాగారానికి బెర్తు ప్రస్తావన తేకుండానే... రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను అదానీకి అప్పగించేందుకు సిద్ధమైంది. దేశంలో సముద్ర తీరంలో ఉన్న ఏకైక ఇంటిగ్రేటెడ్‌ స్టీల్‌ప్లాంటు రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎన్‌ఎల్‌-విశాఖ ఉక్కు) మాత్రమే. స్టీల్‌ తయారీకి అవసరమైన ముడి పదార్థాలను సముద్రం ద్వారా దిగుమతి చేసుకుంటే తక్కువ వ్యయం అవుతుందని, చిన్న పోర్టు నిర్మించుకుంటామని ప్రాజెక్టు రిపోర్టులోనే స్టీల్‌ప్లాంటు ప్రతిపాదించింది. కేంద్రం దానికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. ఆ తర్వాతి కాలంలో గంగవరంలో పోర్టు నిర్మిస్తామని ఉక్కు అధికారులు లేఖలు రాసినా పెద్దగా స్పందన లభించలేదు. ఆ తర్వాత గంగవరంలో పోర్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం భూములు కోరినప్పుడు... ఉక్కు యాజమాన్యం అందులో తమకు ఒక బెర్తు ఇవ్వాలని కోరింది. దానికి రాష్ట్ర ప్రభుత్వం తొలుత అంగీకరించింది. ఆ తర్వాత ఆ ప్రస్తావనే తీసుకురాలేదు. గంగవరం పోర్టు నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నప్పుడు కూడా ఉక్కు అధికారులు తమకు ప్రిఫరెన్స్‌ బెర్తు ఇవ్వాలని, దానిని ఒప్పందంలో పొందుపరచాలని డిమాండ్‌ చేశారు. అయితే గంగవరం పోర్టు యాజమాన్యానికి దీని వల్ల నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం మౌనం దాల్చింది. చివరకు విశాఖ ఉక్కుకు ఎటువంటి బెర్తు కేటాయింపు లేకుండానే గంగవరం పోర్టు నిర్మితమైంది. 


ఎక్కువ వ్యాపారం స్టీల్‌ప్లాంటుతోనే

గంగవరం పోర్టు నిర్మించక ముందు స్టీల్‌ప్లాంటు తనకు అవసరమైన ముడి పదార్థాలన్నీ విశాఖపట్నం పోర్టు నుంచి దిగుమతి చేసుకునేది. వాటిని పోర్టు నుంచి రైల్వే ర్యాకుల ద్వారా స్టీల్‌ప్లాంటుకు తీసుకువెళ్లాలి. దీనికి రైల్వేతో ఒప్పందం చేసుకుంది. పోర్టు నుంచి ప్లాంటుకు కేవలం 30 కిలోమీటర్ల దూరమే అయినా, రైల్వే నిబంధనల ప్రకారం బల్క్‌ కార్గో రవాణాకు కనీసం 100 కిలోమీటర్ల చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. దాంతో అనవసర వ్యయం భారంగా ఉండేది. అందుకే గంగవరంలో ఓ బెర్తు కావాలని ఉక్కు కర్మాగారం కోరింది. ఆ ఆశ నెరవేరకపోవడంతో ఇక తప్పనిసరి స్థితిలో విశాఖపట్నం పోర్టును వదిలేసి, వ్యాపారం అంతా దగ్గరలోని గంగవరం పోర్టుకు అప్పగించారు. ఇక్కడి నుంచి ముడి పదార్థాలను మళ్లీ రైలు ర్యాకులు, లారీల ద్వారా ప్లాంటుకు తరలించాల్సిన అవసరం లేకుండా... పోర్టు నుంచి కన్వేయర్‌ బెల్ట్‌ ఏర్పాటు చేసుకుంది. దీని వల్ల స్టీల్‌ప్లాంటుకు టన్నుకు రూ.200 వ్యయం తగ్గింది. అదే సొంత బెర్తు ఉన్నట్టయితే... టన్నుకు వెయ్యి రూపాయల వ్యయం తగ్గేదని ప్లాంటు వర్గాల అభిప్రాయం. 


ఫ్లైఓవర్‌ నిర్మాణ వ్యయం కూడా ప్లాంటు పైనే

గంగవరం పోర్టుకు వెళ్లడానికి బాలచెరువు రోడ్డులో ఒక ఫ్లైఓవర్‌ నిర్మించాల్సిన అవసరం ఏర్పడింది. ఆ మార్గంలో పోర్టుకు రవాణా వాహనాలు వెళతాయి. అందుకని ఆ వ్యయాన్ని పోర్టే భరించాలని నిర్ణయించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆ ఖర్చు కూడా స్టీల్‌ప్లాంటుతో పెట్టించింది. దీనికి సుమారుగా రూ.20 కోట్ల వరకు వెచ్చించినట్టు అంచనా. గంగవరం పోర్టుకు అవసరమైన భూములు, నిర్మాణాలకు నిధులు కూడా తీసుకొని, అవసరమైన బెర్తు మాత్రం ఇవ్వకుండా మోసం చేశారని ఇప్పటికీ ఉక్కు వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పుడు ఆ పోర్టులో వాటాను కూడా రాష్ట్ర ప్రభుత్వం విక్రయిస్తున్న నేపథ్యంలో ప్లాంటుకు ఇచ్చిన మాట ప్రకారం ఒక బెర్తును కేటాయించాలని ఉక్కు గుర్తింపు యూనియన్‌ డిమాండ్‌ చేస్తోంది.

Updated Date - 2021-05-09T08:26:04+05:30 IST