పోలవరం యాత్ర’ పై ఉక్కుపాదం

ABN , First Publish Date - 2020-11-23T08:01:48+05:30 IST

పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించడం, పునరావాస కార్యక్రమాలకు కేంద్రం చేతులెత్తేయడం, ప్రాజెక్టు అంచనా విలువను కుదించడం వంటి...

పోలవరం యాత్ర’ పై ఉక్కుపాదం

ఎక్కడికక్కడ అడ్డుకున్న పోలీసులు

సీపీఐ రామకృష్ణ గృహ నిర్బంధం

పలువురు పార్టీ నేతల అరెస్టులు

అడ్డుకునే హక్కు ఎవరిచ్చారన్న చంద్రబాబు


రాజమహేంద్రవరం/అమరావతి/గుంటూరు/తిరుపతి, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించడం, పునరావాస కార్యక్రమాలకు కేంద్రం చేతులెత్తేయడం, ప్రాజెక్టు అంచనా విలువను కుదించడం వంటి పరిణామాల నేపథ్యంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ నాయకత్వంలో చేపట్టిన ‘పోలవరం పరిరక్షణ యాత్ర’పై పోలీసులు ఉక్కుపాదం మోపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని కోటిపల్లి బస్టాండ్‌ సెంటర్‌ నుంచి ఆదివారం ఈయాత్ర ప్రారంభించడానికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ శనివారం రాత్రి రాజమహేంద్రవరం చేరుకున్నారు. ఇక్కడ రివర్‌ బే హోటల్‌లో బసచేశారు. అయితే, అదే రోజు రాత్రి 10 గంటలకు పోలీసులు ఈ హోటల్‌ను ముట్టడించి, గృహనిర్బంధం చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో రామకృష్ణ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. రామకృష్ణతోపాటు సీపీఐ తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి తాటిపాక మధు, రాజమహేంద్రవరం నగర కార్యదర్శి నల్లా రామారావు, ఏఐవైఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు బొమ్మసాని రవిచంద్ర తదితరులను పోలీసులు నిర్బంధించారు. 


అనుమతించి అడ్డుకుంటారా?: రామకృష్ణ

‘‘పోలవరం ప్రాజెక్టు పరిరక్షణ యాత్రకు అనుమతించి, ఎందుకు అడ్డుకున్నారు. అసలు మీకు పోలవరం అవసరం ఉందా? లేదా?’’ అని వైసీపీ ప్రభుత్వాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ప్రశ్నించారు. రివర్‌బే హోటల్‌ వద్ద ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘పోలవరం ఎత్తును కుదిస్తున్నారంటూ నెలరోజులుగా కొన్ని ప్రచారాలు జరుగుతున్నాయి. ఎత్తును కుదిస్తే నీటినిల్వ సామర్థ్యం తగ్గుతుంది. ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి కష్టంగా మారుతుంది. ఈ నేపథ్యంలో మేము కూడా పోలవరం ప్రాజెక్టు అథార్టీ అధికారులతో హైదరాబాద్‌లో చర్చించాం. ఈ నెల 19న మంత్రి ఫేషీలో మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్‌ యాత్రకు సంబంధించి లేఖ ఇచ్చారు. మంత్రి పీఎస్‌ కూడా పోలవరం చీఫ్‌ ఇంజనీర్‌కు తెలిపారు. కానీ, ఇంతలోనే పోలీసులు ఇలా వ్యవహరించారు. నాతోపాటు పలు జిల్లాల్లో మా వాళ్లను అరెస్ట్‌ చేశారు. ఎందుకివన్నీ,  రాష్ట్రంలో జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఉందా? గౌతమ్‌ సవాంగ్‌ రాజ్యముందా?’’ అని రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము పోలవరం ప్రాజెక్టును సందర్శించి తీరుతామన్నారు. 


నిర్బంధం అరాచకం: నేతల ఆగ్రహం

సీపీఐ రామకృష్ణ నిర్బంధంపై టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్యచౌదరి, మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రాజెక్టు సందర్శనకు వెళుతున్న రామకృష్ణను నిర్బంధించడం అన్యాయమన్నారు. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రావుల వెంకయ్య తదితరులు పోలీసుల వైఖరిని దుయ్యబట్టారు. కాగా, రామకృష్ణను విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ సీపీఐ నేతలు హోటల్‌ వద్ద ఆందోళనకు దిగడంతో పోలీసులు అరెస్టు చేశారు. కాగా, సీపీఐ రామకృష్ణను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరపు అచ్చెంనాయుడు, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి  కె నారాయణ ఫోన్‌లో పరామర్శించి సంఘీభావం తెలిపారు. 

 

తిరుపతిలో నారాయణ అడ్డగింత

‘ప్రాంతీయ, జాతీయ పార్టీలు కలసినడవాలి. అవసరమైతే పునరేకీరణ జరగాలి. వామపక్షాలు ఒకే గొడుగు, ఒకే జెండా, ఒకే కార్యాలయం కిందకు రావాల్సి ఉంది’ అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అభిప్రాయపడ్డారు. తిరుపతిలో ఆదివారం మీడియాతో మాట్లాడారు.  అనంతరం, పోలవరం యాత్రకు బయలుదేరిన నారాయణను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన ఆర్టీసీ బస్టాండు ఎదురుగా అంబేడ్కర్‌ విగ్రహం ముందు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన నినాదాలు చేశారు.  


అడ్డుకునే హక్కు ఎవరిచ్చారు?

చంద్రబాబు ఆగ్రహం

రాష్ట్రంలో ప్రతిపక్షాల అణిచివేత గర్హనీయమని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. పోలవరం యాత్రకు బయల్దేరిన సీపీఐ నేతల అక్రమ అరె్‌స్టలు, నిర్బంధాలను ఆదివారం ప్రకటనలో ఖండించారు. పోలవరం ప్రాజెక్ట్‌ ఏమైనా నిషిద్ధ ప్రాంతమా? పోలవరం వద్దకు పోకుండా అడ్డుకునే హక్కు ఎవరిచ్చారు? అని ప్రశ్నించారు. సీపీఐ నాయకులను అడ్డుకోవడం వైసీపీ నేతల దమనకాండకు పరాకాష్టగా పేర్కొన్నారు. 


ప్రకాశం బాధితులకు బాబు పరామర్శ

అమరావతి, (ఆంధ్రజ్యోతి): ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండల టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి రాఘవమ్మ భర్త కృష్ణయ్య యాదవ్‌, మరో వ్యక్తి వీరాస్వామి యాదవ్‌పై కత్తులతో దాడి చేసి, గాయపర్చడాన్ని చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల కుటుంబసభ్యులకు ఫోన్‌ చేసి, పరామర్శించారు. బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.  

Updated Date - 2020-11-23T08:01:48+05:30 IST