కాలుష్యంపై ఉక్కుపాదం

ABN , First Publish Date - 2020-11-23T06:24:00+05:30 IST

విశాఖపట్నంలో కాలుష్యం రోజురోజుకూ పెరిగిపోతోంది. ఈ విషయాన్ని గమనించిన కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) పరిస్థితిని చక్కదిద్దడానికి ‘జాతీయ వాయు పరిశుభత్ర కార్యక్రమం’ (ఎన్‌సీఏపీ) చేపట్టింది.

కాలుష్యంపై ఉక్కుపాదం


వచ్చే ఐదేళ్లలో 20 నుంచి 30 శాతం తగ్గించాలి

నిరంతరం అధ్యయనంతో గాలి కలుషిత ప్రాంతాలు గుర్తింపు 

మొబైల్‌ పరికరాలతో గాలి నాణ్యత పరీక్ష

నిబంధనల ఉల్లంఘనులపై చర్యలు

కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఆదేశాలు

నివారణ చర్యల కోసం విశాఖకు రూ.31 కోట్లు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

విశాఖపట్నంలో కాలుష్యం రోజురోజుకూ పెరిగిపోతోంది. ఈ విషయాన్ని గమనించిన కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) పరిస్థితిని చక్కదిద్దడానికి ‘జాతీయ వాయు పరిశుభత్ర కార్యక్రమం’ (ఎన్‌సీఏపీ) చేపట్టింది.  రాబోయే ఐదేళ్లలో ప్రస్తుతం వున్న వాయు కాలుష్యంలో 20 నుంచి 30 శాతం తగ్గించాలని నిర్దేశించింది. 2024 నాటికి అనుకున్న లక్ష్యాలను సాధించాలని సూచించింది. ఇందుకోసం విశాఖకు రూ.31 కోట్లు విడుదల చేసింది.


కొత్తగా వాహనాలు, నిర్మాణ రంగం నుంచి...

పరిశ్రమల కాలుష్యమే కాకుండా విశాఖపట్నంలో వాహనాల వల్ల వచ్చే పొగ, దుమ్ము, ధూళి ఎక్కువగా వుంటున్నట్టు ఇటీవల గుర్తించారు. ఇటీవల కాలంలో వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఇప్పటికే నాలుగు లక్షల వాహనాలు నగరంలో వుండగా కొత్తగా నెలకు రెండు వేల వాహనాలు వచ్చి చేరుతున్నాయి. ఈ కాలుష్యాన్ని కూడా తగ్గించాలని ఉన్నతాధికారులు సూచించారు. ఏపీలో అత్యధికంగా గృహ నిర్మాణాలు జరుగుతున్న ప్రాంతంగా విశాఖపట్నానికి పేరుంది. ఇందుకోసం మట్టి, సిమెంట్‌, ఫ్యాబ్రికేషన్‌, స్టీల్‌ వర్క్‌, వుడ్‌ వర్క్‌ పెద్దఎత్తున జరుగుతోంది. వీటి నుంచి వెలువడే ధూళి వల్ల గాలి కలుషితం అవుతోందని ఇటీవల అధికారులు విశ్లేషించారు. వాహనాలు, భవన నిర్మాణ రంగం కాలుష్యం తగ్గింపుపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు.


విశాఖలో కాలుష్యానికి అనేక కారణాలు

విశాఖపట్నం పారిశ్రామిక రాజధాని. ఇక్కడ వందలాది పరిశ్రమలు ఉన్నాయి. మరోవైపు విశాఖపట్నం భౌగోళికంగా గిన్నె ఆకారంలో ఉంటుంది. చుట్టూ కొండలు. ఒక వైపు సముద్రం. పోర్టు నుంచి వచ్చే బొగ్గు ధూళి కణాలు, హెచ్‌పీసీఎల్‌, కోరమండల్‌ ఫెర్టిలైజర్స్‌, స్టీల్‌ప్లాంటు విడుదల చేసే వాయువులు నగరం మీదుగా వ్యాపించి పైకి వెళ్లలేక తిరిగి భూమి మీదకే వస్తుంటాయి. దీనివల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోంది. 


నిధులు దేనికి ఖర్చు చేయాలంటే....

ప్రజలు పీల్చే గాలి ఎక్కడెక్కడ కలుషితం అవుతున్నదో తెలుసుకోవడానికి సరైన సాంకేతిక వనరులు సమకూర్చుకోవాలి. ఆ తరువాత వాటిని నిరంతరం అధ్యయనం చేసి కాలుష్యం తగ్గేలా చర్యలు చేపట్టాలి. ఎవరు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారో తెలుసుకునే వ్యవస్థను రూపొందించుకోవాలి. వాటిని ముందుగా నియంత్రించాలి. హద్దు మీరితే చర్యలు చేపట్టాలి. ఇలాంటి వాటికి ఆ నిధులు వెచ్చించాలని సీపీసీబీ సూచించింది. 

దుమ్ము ఎక్కువగా రేగే ప్రాంతాల్లో నీటిని చిలకరించాలి. విశాఖపట్నం పోర్టు ప్రస్తుతం ఈ విధానాన్ని అమలు చేస్తు న్నది. నగరంలో ఇంకెక్కడైనా ఇలాంటి పరిస్థితి ఉంటే...అక్కడ నీటిని వెదజల్లాలి.

దుమ్మును అణగదొక్కే లేదా సేకరించే విధానాన్ని అనుసరించాలి. ఇందు కు అవసరమైన పరికరాలు సమకూర్చుకోవాలి. 

పీసీబీ అక్కడక్కడా పరికరాలు ఏర్పాటుచేసి వాయు కాలుష్యాన్ని పరిశీలిస్తు న్నది. అలాకాకుండా మొబైల్‌ పరికరాలు సమకూర్చుకొని నగరం అంతా తిరుగుతూ గాలి నాణ్యత పరీక్షలు నిర్వహించాలి. 

ప్రతి నగరం అక్కడి పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకొని అమలు చేయాలని సీపీసీబీ సూచించింది. విశాఖ పీసీబీ అధికారులు ఈ మేరకు ప్రణాళిక రూపొందించినట్టు సమాచారం. దానిని ఎప్పటి నుంచి అమలు చేస్తారనేది వేచి చూడాలి.

Updated Date - 2020-11-23T06:24:00+05:30 IST