వేసవిలో ఉక్కు మోత

ABN , First Publish Date - 2021-05-05T06:39:58+05:30 IST

దేశీయ ఉక్కు తయారీ కంపెనీలు ధరల మోత మోగించాయి. హాట్‌ రోల్డ్‌ కాయిల్‌ (హెచ్‌ఆర్‌సీ), కోల్డ్‌ రోల్డ్‌ కాయిల్‌ (సీఆర్‌సీ) స్టీల్‌ రేట్లను భారీగా పెంచాయి...

వేసవిలో ఉక్కు మోత

  • భారీగా పెరిగిన ఇండస్ట్రియల్‌ స్టీల్‌ ధర
  • టన్నుకు రూ.4,500 వరకు పెంపు
  • త్వరలో మరో రూ.2,000-4,000 వడ్డన
  • ఆటో, అప్లయెన్స్‌, నిర్మాణ రంగాలపై భారం   


న్యూఢిల్లీ: దేశీయ ఉక్కు తయారీ కంపెనీలు ధరల మోత మోగించాయి. హాట్‌ రోల్డ్‌ కాయిల్‌ (హెచ్‌ఆర్‌సీ), కోల్డ్‌ రోల్డ్‌ కాయిల్‌ (సీఆర్‌సీ) స్టీల్‌ రేట్లను భారీగా పెంచాయి. హెచ్‌ఆర్‌సీ టన్నుకు రూ.4,000 పెరిగి రూ.67,000కు చేరగా సీఆర్‌సీ టన్నుకు రూ.4,500 మేర ఎగబాకి రూ.80,000కు చేరుకున్నాయి. గడిచిన మూడు రోజుల్లో ఈ ధరల పెరుగుదల చోటు చేసుకున్నట్లు ఉక్కు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఈ నెల ద్వితీయార్ధం లేదా వచ్చే నెల ప్రథమార్ధంలో టన్నుకు మరో రూ.2,000-4,000 మేర పెంచే అవకాశాలున్నాయని వారు సంకేతాలిచ్చారు. హెచ్‌ఆర్‌సీ, సీఆర్‌సీ స్టీల్‌ షీట్లను అధికంగా వాహనం, ఉపకరణాలు, నిర్మాణ పరిశ్రమల్లో ముడి సరుకుగా ఉపయోగిస్తారు. వీటి ధరల పెరుగుదలతో వాహనాలు, కన్స్యూమర్‌ గూడ్స్‌ కంపెనీల ఉత్పత్తి వ్యయమూ పెరుగుతుంది. తత్ఫలితంగా కార్లు, బైక్‌లు, కన్స్యూమర్‌ అప్లయెన్స్‌ మున్ముందు మరింత ప్రియం కావచ్చని మార్కెట్‌ వర్గాలంటున్నాయి. 


ఇళ్ల ధరలూ పెంచక తప్పదు: క్రెడాయ్‌ 

నిర్మాణానికి అవసరమైన ముడి సరుకుల ధరలు గత ఏడాది జనవరి నుంచి భారీగా పెరుగుతూ వచ్చాయని క్రెడాయ్‌ పేర్కొంది. స్టీల్‌ ధరలైతే రెట్టింపయ్యాయి. కేవలం ఉక్కు ధరాభారం కారణంగానే నిర్మాణ వ్యయం 3-5 శాతం మేర పెరిగిందని ఈ రియల్‌ ఎస్టేట్‌ రంగ అసోసియేషన్‌ అంటోంది. కార్మికుల కొరత, ముడి సరుకుల సరఫరాలో అవాంతరాలు నిర్మాణ రంగ ఇబ్బందుల్ని మరింత పెంచాయంది. ఈ నేపథ్యంలో రియల్టర్లకు ఇళ్ల ధరలు పెంచడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని క్రెడాయ్‌ ప్రెసిడెంట్‌ హర్ష్‌ వర్ధన్‌ పటోడియా అన్నారు. ముడి సరుకుల ధరల్ని కట్టడి చేసేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. 

Updated Date - 2021-05-05T06:39:58+05:30 IST