దశలవారీగా సమస్యల పరిష్కారం

ABN , First Publish Date - 2021-08-01T06:03:22+05:30 IST

సిరిసిల్ల మున్సిపల్‌ అన్ని వార్డుల్లో దశల వారీగా సమస్యలను పరిష్కరిస్తామని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళాచక్రపాణి అన్నారు.

దశలవారీగా సమస్యల పరిష్కారం
సమావేశంలో మాట్లాడుతున్న చైర్‌పర్సన్‌ జిందం కళాచక్రపాణి

- రూ. 15 కోట్ల ప్రత్యేక నిధులతో అభివృద్ధి పనులకు తీర్మానం 

- మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళాచక్రపాణి 

సిరిసిల్ల, జూలై 31 (ఆంధ్రజ్యోతి): సిరిసిల్ల మున్సిపల్‌ అన్ని వార్డుల్లో దశల వారీగా సమస్యలను పరిష్కరిస్తామని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళాచక్రపాణి అన్నారు. శనివారం సిరిసిల్ల మున్సిపల్‌ కార్యాలయంలో సాధారణ సమావేశం జరిగింది. 11 అంశాలపై కౌన్సిల్‌లో చర్చించి ఆమోదం తెలిపారు. మున్సిపల్‌, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ వివిధ అభివృద్ధి పనుల కోసం ప్రత్యేకంగా మంజూరు ఇచ్చిన రూ. 15 కోట్ల నిధులను వివిధ వార్డులకు కేటాయించారు. రూ. 12.65 కోట్లు అన్ని వార్డుల్లో ప్రాధాన్యం ప్రకారం కేటాయించగా మిగులు నిధులు రూ. 2.35 కోట్లు విలీనం గ్రామాలకు కేటాయిస్తూ పనుల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. పట్టణ ప్రగతి మార్గదర్శకాల్లో భాగంగా 10, 12, 14, 20, 25, 37 వార్డులను మోడల్‌ వార్డులుగా తీర్చిదిద్దడానికి నిర్ణయించారు. నీటి వసతి, క్లీనింగ్‌, గ్రీనరీ అభివృద్ధి, వాల్‌ పెయింటింగ్‌ జంక్షన్ల అభివృద్ధికి రూ. 30 లక్షల నిధులను మున్సిపల్‌ జనరల్‌ నిధుల నుంచి ఖర్చు చేయాలని నిర్ణయించారు. సిరిసిల్ల 34వ వార్డులో మహిళా కమ్యూనిటీ హాల్‌పైన నిర్మాణం చేపట్టడానికి రూ. 10 లక్షలు మంజూరు ఇచ్చారు. సిరిసిల్ల కొత్త చెరువు నుంచి శాంతినగర్‌కు వెళ్లే దారిలో మురికి కాలువ నిర్మాణానికి రూ. 18 లక్షలు మంజూరు ఇచ్చారు. వివిధ వార్డుల్లో శానిటేషన్‌ నిర్వహణ ఇతర పనుల కోసం రూ. 84.75 లక్షలు మంజూరు చేశారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రధాన రోడ్లలో మురికి కాలువలలో శుభ్రం చేయడం ఇతర పనుల కోసం రూ. 39.80 లక్షలు మంజూరు చేశారు. వార్డుల్లో క్లీనింగ్‌ ఇతర పనులకు బ్లేడ్‌ ట్రాక్లర్లు జేసీబీ, ట్రాక్టర్లు, అగర్‌ మిషన్‌, ఎంగేజ్‌ చేయడం వంటి పనులకు రూ. 15.97 లక్షల ప్రతిపాదనలు ఆమోదించారు. కౌన్సిలర్లు తమ వార్డుల్లోని వివిధ సమస్యలను ప్రస్తావించారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్‌ మాట్లాడుతూ పట్టణ ప్రగతి కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యం ఇస్తామన్నారు. సమావేశంలో మున్సిపల్‌ కమిషనర్‌ సమ్మయ్య, వైస్‌చైర్మన్‌ మంచె శ్రీనివాస్‌, కౌన్సిలర్లు, మున్సిపల్‌ అధికారులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-08-01T06:03:22+05:30 IST