స్టెరాయిడ్‌..రెండంచుల కత్తి

ABN , First Publish Date - 2021-05-14T08:01:31+05:30 IST

స్టెరాయిడ్స్‌.. పెరిగిపోతున్న కరోనా కేసుల నేపథ్యంలో కొద్దికాలంగా సామాన్యులకూ చిరపరిచితమైన పేరు ఇది! కానీ, ఈ స్టెరాయిడ్‌ ఔషధాలు రెండు వైపులా పదునున్న కత్తుల్లాంటివి. అత్యవసర, ప్రాణాపాయ

స్టెరాయిడ్‌..రెండంచుల కత్తి

సరిగ్గా వాడితే మేలు చేస్తుంది.. 

విచ్చలవిడి వినియోగంతో కీడు

బ్లాక్‌ ఫంగస్‌ ముప్పుకు అవకాశం

ఎముకలు బలహీనమవుతాయి

తగ్గిపోతున్న రోగ నిరోధక శక్తి 

ఎంత అవసరమో అంతే వాడాలి

అతిగా వాడితే రోగికి అపాయమే

మొదటి ఐదు రోజులూ స్టెరాయిడ్లు వాడాల్సిన అవసరమే లేదు

ఆక్సిజన్‌ సాధారణంగా ఉంటే వద్దు

వైద్య నిపుణుల హెచ్చరికలు


హైదరాబాద్‌ సిటీ, మే 13 (ఆంధ్రజ్యోతి): స్టెరాయిడ్స్‌.. పెరిగిపోతున్న కరోనా కేసుల నేపథ్యంలో కొద్దికాలంగా సామాన్యులకూ చిరపరిచితమైన పేరు ఇది! కానీ, ఈ స్టెరాయిడ్‌ ఔషధాలు రెండు వైపులా పదునున్న కత్తుల్లాంటివి. అత్యవసర, ప్రాణాపాయ స్థితిలో నిర్ణీత మోతాదులో వాడితే.. కొద్దిపాటి దుష్ప్రభావాలున్నా ప్రాణాలను కాపాడుతాయి. విచ్చలవిడిగా, విచక్షణ రహితంగా వాడితే అనేక ఇబ్బందులు తెచ్చిపెడతాయి. అసలే రోగనిరోధక శక్తి తక్కువగా ఉండేవారికి స్టెరాయిడ్లు ఎక్కువగా వాడితే బ్లాక్‌ఫంగస్‌ వంటివాటి బారిన పడి ప్రాణాలు కోల్పోయే ముప్పూ ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే.. స్టెరాయిడ్లను అవసరం మేరకు వేసుకున్నా రిస్క్‌ తప్పదు.. అవసరానికి మించి వేసుకున్నా ముప్పే. కానీ, కొన్నాళ్లుగా కొవిడ్‌ పేషెంట్లలో కొందరు వైద్యుల సిఫారసు లేకుండానే పాత రోగుల మాట విని స్టెరాయిడ్లతో సొంత వైద్యం చేసుకుంటూ లేని పోని ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొవిడ్‌ నియంత్రణకు ప్రస్తుతానికి నిర్ధారించిన మందులేవీ లేవు. రెమ్‌డెసివిర్‌ లాంటి యాంటీ వైరల్‌ మందులను, అదీ మొదటి దశలో ఇస్తేనే ఉపయోగం. అసలు అవేవీ వాడకుండానే 90ు మందికి పైగా రోగ నిరోధక శక్తి వల్లే వైరస్‌ బారి నుంచి బయటపడుతున్నారు. కొందరికైతే వైరస్‌ సోకిన  లక్షణాలే కనిపించట్లేదు. మిగిలిన అతి కొద్దిమందికి మాత్రమే ఆస్పత్రిలో చికిత్స అవసరమవుతోంది.


ఆ దశలో వైద్యుల పర్యవేక్షణలో స్టెరాయిడ్లను తగు మోతాదులో వాడుతున్నారు. పరిస్థితి అదుపులోకి రాక, శ్వాస సమస్యలు వస్తే ఆక్సిజన్‌ చికిత్స అవసరమవుతుంది. ఈ విషయాలపై అవగాహన లేకుండా స్టెరాయిడ్లు వాడొద్దని వైద్యులు చెబుతున్నారు. ‘‘స్టెరాయిడ్ల వాడకంతో.. నెగెటివ్‌ రావడంతో ప్రమాదం నుంచి బయటపడ్డామనుకుంటారు. కానీ, రోగనిరోధక శక్తి సన్నగిల్లిపోవడంతో.. బ్లాక్‌ ఫంగల్‌ ఇన్ఫెక్షన్‌ వల్ల వారికి కొత్త సమస్యలు వస్తాయి. కళ్లు ఎర్రగా మారడం, ముక్కుకు సంబంధించిన సమస్యలు వస్తాయి. దాన్ని సాధారణ ఇబ్బందిగా భావించి స్థానిక వైద్యుల వద్ద చికిత్స తీసుకుంటున్నారు. దీనివల్ల 5-6 రోజులు వృథా అయిపోతాయి. అప్పటికే ఫంగల్‌ ఇన్ఫెక్షన్‌ తీవ్రమై మెదడుకు వ్యాపించి పరిస్థితి విషమిస్తోంది’’ అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మధుమేహ బాధితుల్లో, కేన్సర్‌, ఆటో ఇమ్యూన్‌ వ్యాధుల వంటివాటితో బాధపడుతూ రోగనిరోధక శక్తిని అణచివేసే మందులు వాడేవారిలో స్టెరాయిడ్ల వాడకం కత్తిమీద సాము. బ్లాక్‌ ఫంగల్‌ ఇన్ఫెక్షన్‌ బాధితుల్లో అలాంటివారే ఎక్కువని వైద్యులు చెబుతున్నారు.


అక్కర్లేదు..

వైరస్‌ సోకిన లక్షణాలు కనపడిన మొదటి ఐదు రోజులూ స్టెరాయిడ్లు అస్సలు ఇవ్వకూడదు. ఆరు, ఏడు రోజులకు కూడా జ్వరం తగ్గకపోతే.. ఆక్సిజన్‌ స్థాయులు పడిపోతే.. అప్పుడు వైద్యుల పర్యవేక్షణలో స్టెరాయిడ్స్‌ ఇవ్వాలి.


సెకండ్‌ వేవ్‌లోనే..

కొవిడ్‌ బాధితులకు స్టెరాయిడ్స్‌ అతిగా వినియోగించడం, మరికొన్ని కారణాల వల్ల బ్లాక్‌ ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌ వస్తోంది. మొదటి దశలో ఈ తరహా కేసులు పెద్దగా రాలేదు. కేన్సర్‌, హెచ్‌ఐవి, కీమోథెరపీ కేసుల్లోనే బ్లాక్‌  ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌ కనిపించేది. అయితే కరోనా రెండో దశలో  ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌ కేసులు ఎక్కువగా వస్తున్నాయి. రోజుకు రెండు కేసులన్నా చూస్తున్నాం. ప్రధానంగా పోస్ట్‌ కొవిడ్‌ కేసుల్లోనే ఈ సమస్య ఎక్కువగా ఉంటోంది. దీనికి కారణం.. స్టెరాయిడ్స్‌ను అవసరానికి మించి వినియోగించడమే. సరైన సమయంలో, సరైన చికిత్స చేయకుంటే ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌ ప్రాణాంతకం.

- డాక్టర్‌ సంపూర్ణ గోష్‌, ఈఎన్‌టి స్పెషలిస్టు, మెడికవర్‌ ఆస్పత్రి


చాలా దుష్ప్రభావాలు..

స్టెరాయిడ్స్‌ అతి వినియోగంతో సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఎక్కువ. మధుమేహం నియంత్రణలో ఉండదు. ఎముకలు బలహీనంగా మారుతాయి. చర్మ వ్యాధులు వస్తాయి. బీపీ పెరుగుతుంది. తలనొప్పి, ఆకలి ఎక్కువ కావడం, బరువు పెరగడం, హార్మోన్ల సమతుల్యత దెబ్బతినడం వంటి సమస్యలు ఉత్పన్నం అవుతాయి. కొవిడ్‌ పేషెంట్లలో ఆక్సిజన్‌ 93 కంటే తగ్గితే, ఏడు నుంచి పది రోజులకు కూడా లక్షణాలు అలాగే ఉంటేనే స్టెరాయిడ్స్‌ వాడాలి. ఇన్ఫెక్షన్‌ తీవ్రతను బట్టి ఎంత డోస్‌ వేసుకోవాలనేదానిపై వైద్యులు నిర్ణయం తీసుకుంటారు. కానీ, కొంత మంది ముందే వేసుకుంటున్నారు. ఇది సరి కాదు.

- డాక్టర్‌ సునీతా నర్రెడ్డి, ఇన్‌ఫెక్షస్‌ డీసిజెస్‌ స్పెషలిస్టు, అపోలో

Updated Date - 2021-05-14T08:01:31+05:30 IST