Advertisement
Advertisement
Abn logo
Advertisement

గుంతలు తేలిన రోడ్డుపై పొర్లుదండాలు!

  • ఓ టీఆర్‌ఎస్‌ కార్యకర్త వినూత్న నిరసన.. మోకాళ్లపైనా నడక 
  • అడ్డుకున్న పోలీసులు.. కేసు నమోదు

తాండూరు రూరల్‌, డిసెంబరు 1: పొర్లుదండాలు పెట్టడం ఆలయంలో మొక్కు తీర్చుకోవడం కోసమే కాదు.. ప్రజాప్రతినిధుల తీరుపై నిరసన వ్యక్తం చేసేందుకూ చేయొచ్చునని ఓ వ్యక్తి నిరూపించాడు. తమ ఊరి రోడ్డు కంకర తేలి, గుంతలు పడి అధ్వాన్నంగా తయారైందని.. వాహనాలు వెళుతుంటే ఎగసిపడే దుమ్మూ ధూళితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఎన్నిసార్లు ప్రజాప్రతినిధులను కలిసినా బాగు చేయడం లేదని ఆవేదన చెందాడు. గుంతలు తేలిన ఆ రోడ్డుపైనే అడ్డంగా పడుకొని పొర్లుదండాలు పెట్టాడు. వికారాబాద్‌ జిల్లా తాండూరు మండలం అంతారం అనుబంధ గ్రామమైన దస్తగిరిపేట్‌కు చెందిన టీఆర్‌ఎస్‌ కార్యకర్త బోయిని అమ్రేశ్‌ బుధవారం వ్యక్తం చేసిన నిరసన ఇది. అంతారం బస్‌స్టాప్‌ నుంచి తాండూరు పట్టణం వరకు ఆయన ఇలా వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. కొద్దిదూరం మోకాళ్లపైనా నడిచారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆయన్ను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి కేసు నమోదు చేశారు. తాండూరు నుంచి అంతారం వరకు రోడ్డు అధ్వాన్నంగా మారడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ప్రజాప్రతినిధులు స్పందించకపోవడం వల్లనే తాను నిరసన చేపట్టినట్లు అమ్రేశ్‌ చెప్పారు. కాగా ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదంటూ ఇదే రోడ్డుపై రెండు రోజుల క్రితం అంతారం గ్రామానికి చెందిన రిజ్వాన్‌ అనే వ్యక్తి చెప్పుల దండలు వేసుకుని వినూత్నంగా నిరసన  చేపట్టారు. 

Advertisement
Advertisement