Advertisement
Advertisement
Abn logo
Advertisement

GHMC లో అందని జీతాలు.. పండుగ పూట పూజ ఎలా..!?

  • ఆవేదన వ్యక్తం చేస్తోన్న అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు


హైదరాబాద్‌ సిటీ : పండుగల వేళ ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థలు.. ఉద్యోగుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని సాధారణ రోజుల కంటే ముందుగా వేతనాలు చెల్లిస్తాయి. కానీ రూ.6 వేల కోట్ల పైచిలుకు బడ్జెట్‌.. 650 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం మేర విస్తరించిన ఉన్న జీహెచ్‌ఎంసీ మాత్రం సాధారణ చెల్లింపు తేదీ దాటి పది రోజులైనా ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేదు. తక్కువ వేతనాలుండే అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకూ ఇప్పటికీ జీతాలు జమ కాలేదు. దీంతో చిరు ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. పండుగ పూట తమ కుటుంబాలు పస్తులుండాల్సిందేనా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

గ్రేటర్‌లో ప్రధాన, జోనల్‌, సర్కిల్‌ కార్యాలయాల పరిధిలో డేటా ఎంట్రీ ఆపరేటర్లు, అటెండర్లు, ఇతర విధుల్లో 3,500మంది వరకు అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులున్నారు. అనుభవం, చేసే పనిని బట్టి రూ.15 వేల నుంచి 17 వేల వరకు వేతనాలు చెల్లిస్తున్నారు. పారిశుధ్య, ఎంటమాలజీ అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులు 20 వేల మంది వీరికి అదనం. తక్కువ వేతనాలు ఉండే అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బందికి మొదటి దఫాలో వేతనాలు చెల్లించాలని గతంలో కమిషనర్‌ డీఎస్‌ లోకే్‌షకుమార్‌ ఆదేశించారు. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో కొన్ని నెలలుగా కేడర్‌ ప్రాతిపదికన వేతనాల చెల్లింపు జరుగుతోంది. ఈ నెల మాత్రం 10వ తేదీ వచ్చినా.. ఇప్పటికీ కొందరు అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు వేతనాలు అందలేదు. 

దాదాపు 30 శాతం మంది అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు వేతనాలు రాలేదని చెబుతున్నారు. నేడు వినాయక చవితి, రేపు రెండో శనివారం, ఎల్లుండి ఆదివారం కావడంతో.. 13 లేదా 14 తేదీల్లోనే వారికి వేతనాలు అందే అవకాశముంది. ‘పండుగ వేళ జీతం ఇవ్వకుంటే ఎలా..? ఇంట్లో పూజ కోసం వస్తువులు కొనాలి. డబ్బులు లేక ఫైనాన్సర్‌ వద్ద రూ.5000 అప్పు తీసుకున్నా. రూ.500 వడ్డీ కింద పట్టుకొని రూ.4500 ఇచ్చాడు. ఐదు రోజుల్లో ఆ మొత్తం చెల్లించాలి. లేదంటే మరో రూ.1000 అదనంగా ఇవ్వాల్సి ఉంటుంది’ అని ఓ ఉద్యోగి వాపోయాడు. ప్రతి నెలా రెగ్యులర్‌, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లు కలిపి రూ.118 కోట్లు చెల్లించాల్సి ఉంది. పీఆర్‌సీ ఈ నెల నుంచి చెల్లిస్తుండడంతో ఆ మొత్తం రూ.145 కోట్లకు పెరిగిందని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు పీఆర్‌సీ చెల్లింపుపై జీహెచ్‌ఎంసీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. పాత వేతనాల చెల్లింపులోనూ జాప్యం జరుగుతుండడం గమనార్హం.  

Advertisement
Advertisement