May 7 2021 @ 23:02PM

కరోనాతో స్టిల్‌ ఫొటోగ్రాఫర్‌ మోహన్‌ జీ మృతి

ప్రముఖ స్టిల్‌ ఫోటోగ్రాఫర్‌ మోహన్‌ జీ (86) గురువారం రాత్రి కరోనాతో కన్నుమూశారు. ఆయన పూర్తి పేరు మాదిరెడ్డి కృష్ణమోహన్‌ రావు, స్వస్థలం గుంటూరు. మోహన్‌ జీ తండ్రి కృష్ణారావు విజయవాడలో శ్రీకాంత్‌ పిక్చర్స్‌ పంపిణీ సంస్థలో మేనేజర్‌గా పని చేసేవారు. తర్వాత వీళ్ళ కుటుంబం చెన్నైకి షిఫ్ట్‌ అయింది. తమ్ముడు జగన్‌మోహన్‌ రావుతో కలసి ‘మోహన్‌ జీ-జగన్‌ జీ’ పేరుతో సినిమాలకు స్టిల్‌ ఫొటోగ్రాఫర్‌గా వర్క్‌ చేయడం ప్రారంభించారు. ఎన్టీఆర్‌ నటించిన ‘కాడేద్దులు ఎకరం నేల’ ఈ సోదర ద్వయానికి తొలి చిత్రం. అప్పటి నుండి 900 చిత్రాలకు పని చేశారు.


దర్శకరత్న డాక్టర్‌ దాసరి నారాయణరావుతో వీరిద్దరికి మంచి అనుబంధం ఉండేది. ఆయన తొలి సినిమా ‘తాత మనవడు’ నుండి ‘ఒరేయ్‌ రిక్షా’ వరకూ వంద సినిమాలకు పని చేశారు. ఎన్టీఆర్‌, ఏయన్నార్‌, కృష్ణ, శోభన్‌ బాబు, కృష్ణంరాజు, మురళీ మోహన్‌ చిత్రాలకే కాకుండా కన్నడలో రాజ్‌కుమార్‌, విష్ణువర్థన్‌, తమిళంలో జెమినీ గణేషన్‌, రజనీకాంత్‌ చిత్రాలకూ పని చేశారు. ఈ సోదరులలో చిన్నవాడైన జగన్‌ కొంతకాలం క్రితం కన్ను మూశారు. చంద్రమోహన్‌ హీరోగా మోహన్‌ జీ ‘ఓ ఇంటి కాపురం’ చిత్రాన్ని నిర్మించారు. రేలంగి నరసింహారావు దర్శకత్వం వహించారు. అయితే, ఆ చిత్రం విడుదల కాలేదు.