స్టై పెండింగ్‌.. వైద్య విద్యార్థులకు నెలల తరబడి అందని స్టైపెండ్‌ డబ్బులు

ABN , First Publish Date - 2020-08-04T19:31:51+05:30 IST

కరోనా మహమ్మారిపై పోరు సాగించడంలో ముందు వరుసలో ఉన్న వైద్య విద్యార్థులకు నెలల తరబడి స్టైపెండ్‌ ఇవ్వకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హౌస్‌ సర్జన్లకు

స్టై పెండింగ్‌.. వైద్య విద్యార్థులకు నెలల తరబడి అందని స్టైపెండ్‌ డబ్బులు

మార్చి చివరి వారంలో చేరిన హౌస్‌ సర్జన్లు

ఇంతవరకు ఒక్క నెల కూడా చెల్లించని వైనం

పీజీలు, సూపర్‌ స్పెషాలిటీలు, ఎస్‌ఆర్‌లకు ఏప్రిల్‌ నుంచి బకాయిలు

కొవిడ్‌-19 విధులతో పెరిగిన ఖర్చు

ఇబ్బందుల్లో ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ 


(ఆంధ్రజ్యోతి-విశాఖపట్నం): కరోనా మహమ్మారిపై పోరు సాగించడంలో ముందు వరుసలో ఉన్న వైద్య విద్యార్థులకు నెలల తరబడి స్టైపెండ్‌ ఇవ్వకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హౌస్‌ సర్జన్లకు ఏప్రిల్‌ నుంచి; పీజీలు, సూపర్‌ స్పెషాలిటీ పీజీలు, సీనియర్‌ రెసిడెంట్స్‌కు మే నుంచి స్టైపెండ్‌ అందడంలేదు. ప్రాణాలకు తెగించి, కరోనా వైరస్‌ బాధితులకు సేవలు అందిస్తున్న తమపట్ల ప్రభుత్వం చిన్నచూపు చూడడం తగదని వారు వాపోతున్నారు.  


ఆంధ్రా మెడికల్‌ కళాశాల పరిధిలో 200 మంది హౌస్‌ సర్జన్లు, 600 మంది వరకు పీజీలు, 100 మంది వరకు సూపర్‌స్పెషాలిటీ పీజీలు, 50-60 మంది వరకు  ఎస్‌ఆర్‌లు వున్నారు. వీరంతా కేజీహెచ్‌, వీజీహెచ్‌, ఈఎన్‌టీ, కంటి ఆస్పత్రి, ఛాతి/ అంటువ్యాధుల ఆస్పత్రి, మానసిక వైద్యశాలల్లో విధులు నిర్వహిస్తున్నారు. హౌస్‌సర్జన్ల ప్రస్తుత బ్యాచ్‌ మార్చి చివరి వారంలో వచ్చారు. నెలకు రూ.15,500 స్టైపెండ్‌. నాలుగు నెలలు దాటినా ఇంతవరకు ఒక్క నెల కూడా స్టైపెండ్‌ అందుకోలేదు. ఇక పీజీలకు  మొదటి ఏడాది  రూ.35,500, రెండో ఏడాది రూ.37,500, మూడో ఏడాది రూ.39,500, సూపర్‌ స్పెషాలిటీ పీజీలకు రూ.39,500, సీనియర్‌ రెసిడెంట్‌లకు రూ.45 వేల చొప్పున స్టైపెండ్‌ వుంటుంది. 


వీరికి మే నెల నుంచి స్టైపెండ్‌ అందడంలేదు. కొవిడ్‌ మహమ్మారిపై అలుపెరుగకుండా పోరాటం సాగిస్తున్న తమకు ప్రభుత్వం అదనపు పారితోషికం అందించి ప్రోత్సహించాల్సిందిపోయి నెల వారీ విడుదల చేయాల్సిన స్టైపెండ్‌ కూడా మంజూరు చేయకపోవడం దారుణమని పలువురు వైద్య విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనా విఽధుల్లో భాగంగా వేర్వేరు ప్రాంతాల్లోని కొవిడ్‌ ఆస్పత్రులు, కొవిడ్‌ కేర్‌ సెంటర్లకు ప్రత్యేక విధులకు హాజరు కావాల్సి వస్తున్నదని, దీనివల్ల ఖర్చులు మరింత పెరిగాయని అంటున్నారు. తమలో 90 శాతం మంది స్థానికేతరులేనని, ఇంటి/ రూమ్‌ అద్దె, ఇతర ఖర్చుల కోసం చాలా ఇబ్బంది పడుతున్నామని పీజీలు వాపోతున్నారు. స్టైపెండ్‌ పెండింగ్‌ విషయాన్ని విద్యార్థి సంఘం నాయకులు ఇప్పటికే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఫలితం లేక పోయిందని చెప్పారు. ప్రభుత్వం, అధికారులు స్పందించి స్టైపెండ్‌ డబ్బులు వెంటనే విడుదల చేయాలని వైద్య విద్యార్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Updated Date - 2020-08-04T19:31:51+05:30 IST