కొవిడ్‌ భయంతో నష్టాల్లో మార్కెట్‌

ABN , First Publish Date - 2020-06-30T06:07:44+05:30 IST

కొవిడ్‌ భయాలతో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సోమవారం నీరసించింది. ట్రేడింగ్‌ ప్రారంభంలోనే అమ్మకాలు హోరెత్తాయి. దీంతో సెన్సెక్స్‌ ఒక దశలో 509 పాయింట్ల వరకు నష్టపోయింది...

కొవిడ్‌ భయంతో నష్టాల్లో మార్కెట్‌

కొవిడ్‌ భయాలతో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సోమవారం నీరసించింది. ట్రేడింగ్‌ ప్రారంభంలోనే అమ్మకాలు హోరెత్తాయి. దీంతో సెన్సెక్స్‌ ఒక దశలో 509 పాయింట్ల వరకు నష్టపోయింది. చివరికి 209.75 పాయింట్ల నష్టంతో 34,961.52 వద్ద, నిఫ్టీ 70.60 పాయింట్ల నష్టంతో 10,312.40 వద్ద ముగిశాయి. సెన్సెక్స్‌లో యాక్సిస్‌ బ్యాంకు షేరు అత్యధికంగా 4.78 శాతం నష్టపోయి రూ.404.75 వద్ద క్లోజైంది. కొవిడ్‌ కేసులు ప్రపంచ వ్యాప్తంగా కోటి, భారత్‌లో 5.48 లక్షలు దాటిపోవడం  మార్కెట్‌ను భయపెట్టాయి. భారత-చైనా ఉద్రిక ్తతలు, చైనా-అమెరికా వాణిజ్య పోరు కూడా ఇన్వెస్టర్లను భయపెట్టాయి. ప్రధాన అంతర్జాతీ య మార్కెట్లు నష్ఠాల్లో ట్రేడవడమూ, సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. 


ఆంధ్రా పేపర్‌ షేర్లలో ర్యాలీ: ఆంధ్రా పేపర్‌ కంపెనీ షేర్లు సోమవారం భారీ లాభాలతో దూసుకు పోయాయి. బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేర్లు 19.98 శాతం లాభంతో రూ.254 వద్ద ముగిశాయి. రాధాకిషన్‌ దమానీకి చెందిన బ్రైట్‌ స్టార్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అనే కంపెనీ, ఆంధ్రా పేపర్‌ ఈక్విటీలో 1.26 వాటాకు సమానమైన అయిదు లక్షల షేర్లను బ్లాక్‌ డీల్‌ ద్వారా కొనుగోలు చేయడం, ఇందుకు కారణం.


హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు రూ.50,000 కోట్ల రుణ సేకరణ

రుణ పత్రాల జారీ ద్వారా రూ.50,000 కోట్ల సమీకరణకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు సిద్ధమవుతోంది.వచ్చే నెల 18న జరిగే బ్యాంకు ఏజీఎంలో ఈ తీర్మానాన్ని వాటాదారుల ఆమోదం కోసం పెడతారు. దేశీయ మార్కెట్‌ నుంచే ఈ మొత్తం నిధులు సమీకరించాలని బ్యాంకు భావిస్తోంది. ఇందుకోసం ఒకటి లేదా రెండు విడతలుగా రుణ పత్రాలు జారీ చేయాలని యోచిస్తోంది.

Updated Date - 2020-06-30T06:07:44+05:30 IST