బాబు సభపై రాళ్ల దాడి

ABN , First Publish Date - 2021-04-13T08:45:19+05:30 IST

తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా సోమవారం రాత్రి తిరుపతిలో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్న బహిరంగ సభపై రాళ్ల దాడి జరిగింది.

బాబు సభపై  రాళ్ల దాడి

తిరుపతిలో టీడీపీ కార్యకర్తలకు గాయాలు

పోలీసుల ప్రేక్షక పాత్ర.. పదేపదే పిలిచినా స్పందన నిల్‌

వాహనం దిగి రోడ్డుపై చంద్రబాబు బైఠాయింపు

ఎస్పీ వచ్చేదాకా ఆందోళన విరమించేది లేదని పట్టు

పోలీసుల అభ్యర్థనతో కాలినడకన ఎస్పీ ఆఫీస్‌కు!

ఆయన లేకపోవడంతో అదనపు ఎస్పీకి ఫిర్యాదు

ఈసీ దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరిక


వైసీపీ నేతలు ఎవరికి వారు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. అడ్డుకోకపోతే ప్రజలు తీరిగ్గా బాధపడాల్సి వస్తుంది. ఈ దరిద్ర పాలన వద్దని పొరుగు రాష్ట్రాలకు వెళ్లాల్సి వస్తుంది.


మాట్లాడే స్వేచ్ఛ కావాలా వద్దా? ఓటేసే స్వేచ్ఛ కావాలా వద్దా? రాజారెడ్డి రాజ్యాంగం కావాలా లేక అంబేడ్కర్‌ రాజ్యాంగం కావాలా?


తిరుమలలో దేవుడిని కూడా వ్యాపారం చేసేశారు. ప్రసాదాల రేట్లు, గదుల అద్దెలు పెంచేశారు. చివరికి తల వెంట్రుకలను కూడా స్మగ్లింగ్‌ చేస్తున్నారు.


ఈ రెండేళ్లలో ఏం చేశారని తిరుపతిలో వైసీపీకి 5 లక్షలు మెజారిటీ వస్తుంది? రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నాశనం చేసినందుకా.. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినందుకా..?  

టీడీపీ అధినేత చంద్రబాబు


తిరుపతి, ఏప్రిల్‌ 12 (ఆంధ్రజ్యోతి): తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా సోమవారం రాత్రి తిరుపతిలో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్న బహిరంగ సభపై రాళ్ల దాడి జరిగింది. ఈ సందర్భంగా పలువురు టీడీపీ కార్యకర్తలు గాయపడ్డారు. రాళ్ల దాడి నుంచి కార్యకర్తలకు రక్షణ కల్పించాలని పోలీసులను చంద్రబాబు సభాముఖంగా కోరారు. కానీ వారి నుంచి స్పందన, సమాధానం లేవు. తీవ్రంగా పరిగణించిన ఆయన వాహనంపై నుంచి దిగి రోడ్డుపైనే బైఠాయించారు.


ప్రచారంలో పాల్గొనేందుకు సోమవారం సాయంత్రం తిరుపతి చేరుకున్న చంద్రబాబు.. నగరంలోని కృష్ణాపురం ఠాణా కూడలిలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో పాల్గొన్నారు. వాహనంపై నుంచే ఆయన మా ట్లాడారు. రాత్రి సుమారు 7.45 గంటల సమయంలో ప్ర సంగం ముగిస్తుండగా సమీపంలోని భవనాలపై నుంచి ఎవ రో దుండగులు రాళ్లు విసిరారు. టీడీపీ కార్యకర్తలు గాయపడ్డారు. తమపై పడిన రాళ్లను వారు చంద్రబాబుకు చూపించారు. గాయపడిన ఒక కార్యకర్తను ఆయన వాహనంపైకి పిలిపించి.. గాయాలను ప్రజలకు చూపించారు. ‘పోలీసులు ఉన్నారా? లేరా? ఇంత పెద్ద మీటింగులో పోలీసులెవరూ లే రా’ అని నిలదీశారు. ‘రండిరా తడాఖా చూపిస్తాం. ధైర్యంగా ముందుకు రండి.. తాడోపేడో తేల్చుకుందాం. పోలీసులను అడ్డుపెట్టుకుని రాళ్ళు వేస్తే తోలు తీస్తా.. తాట తీస్తా’ అని రాళ్లు రువ్వినవారిని హెచ్చరించారు. తాను సీఎంగా ఉన్నప్పుడు రౌడీయిజాన్ని అణిచివేశానని, మళ్ళీ వస్తా.. మీ తోక కట్‌ చేస్తానని వైసీపీ నేతలను హెచ్చరించారు.





కేంద్ర బలగాలను రప్పించాలి

ఎస్పీ కార్యాలయం వెలుపల చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. తమ సభపై రాళ్ల దాడి జరగడం దారుణమని.. బహిరంగ సభలో రాళ్ళతో దాడి చేశారంటే దాన్ని పోలీసులు ఎలా సమర్ధించుకుంటారని ప్రశ్నించారు. తిరుపతి ఎన్నికకు కేంద్ర పారా మిలిటరీ దళాలను రప్పించాలని.. పోలింగ్‌ కేంద్రాలకు భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు.


పోలీసులకు చేతకాకపోతే చెప్పండి.. 5 నిమిషాల్లో తేల్చుకుంటామంటూ అల్టిమేటం ఇచ్చారు. పోలీసులు స్పందించకపోవడంతో వాహనం దిగిన చంద్రబాబు రోడ్డుపై బైఠాయించారు. ఆయనతో పాటు అచ్చెన్నాయుడు, ఎంపీలు గల్లా జయదేవ్‌, రామ్మోహన్‌నాయుడు, అభ్యర్థి పనబాక లక్ష్మి, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ తదితరులు కూడా రోడ్డుపైనే కూర్చున్నారు. కార్యర్తలు పెద్దఎత్తున మోహరించడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చంద్రబాబు రోడ్డుపై బైఠాయించాక తిరుమల అదనపు ఎస్పీ మునిరామయ్య అక్కడకు చేరుకుని ఆయనకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఆగ్రహంతో ఉన్న చంద్రబాబు.. తనకు జడ్‌ ప్లస్‌ కేటగిరీ భద్రత ఉందని, తనకే రక్షణ కల్పించలేకపోతే ఇక ప్రజలకేం రక్షణ కల్పిస్తారని నిలదీశారు. రాళ్ల దాడి జరుగుతుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం అనుకుంటున్నారేమో ఇది కేంద్ర ఎన్నిక కమిషన్‌ అని గుర్తు చేశారు.


ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఎస్పీ వచ్చి సమాధానం చెప్పేవరకూ ఆందోళన విరమించేది లేదని తేల్చిచెప్పారు. అరగంట పాటు బైఠాయించిన చంద్రబాబు చుట్టూచేరిన కార్యకర్తలు సీఎం డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఎస్పీ కార్యాలయం సమీపంలోనే ఉందని, అక్కడకు రావాలని ఏఎస్పీ అభ్యర్థించడంతో.. చంద్రబాబు నేతలు, కార్యకర్తలతో కలసి కాలినడకనే అక్కడకు వెళ్లారు. అయితే అక్కడ ఎస్పీ అందుబాటులో లేరు. పాలనా విభాగం అదనపు ఎస్పీ సుప్రజ చంద్రబాబుతో మాట్లాడి నిందితులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి ఆందోళ న విరమించాలని కోరారు. తమ బహిరంగసభకు పోలీసు బందోబస్తు ఎందుకు కల్పించలేదని చంద్రబాబు ప్రశ్నించడంతో 220 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామని ఆమె సమాధానమిచ్చారు. అయితే ఒక్కరు కూడా సభలో కనిపించలేదని, తాను వాహనం పైనుంచీ పదేపదే పిలిచినా ఎవరూ స్పందించలేదని చంద్రబాబు చెప్పారు. దీనిపై తమ ఎంపీలు మంగళవారమే ఢిల్లీకి వెళ్ళి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తారని స్పష్టం చేశారు. ఆందోళన విరమించి అక్కడ నుంచి వెనుదిరిగారు.


Updated Date - 2021-04-13T08:45:19+05:30 IST