కొనుగోళ్లు సాగక..

ABN , First Publish Date - 2021-05-06T06:18:05+05:30 IST

మిర్చి రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ ఏడాది సాగు ఆరంభం నుంచి వారిని కష్టాలు వెంటాడుతున్నాయి. ప్రకృతి ప్రతికూలత కారణంగా పెట్టుబడి ఖర్చులు పెరగ్గా దిగబడులు దిగజారాయి. మార్కెట్‌లో మంచి ధర లభిస్తే ఖర్చులైనా చేతికి వస్తాయని ఆశించిన వారికి నిరాశే ఎదురైంది. ధర భారీగా పడిపోయింది. కోతల ఆరంభంలో నాటురకం మిర్చి క్వింటా రూ.12వేల వరకూ పలికింది.

కొనుగోళ్లు సాగక..
చందలూరులో కల్లాల్లో ఉన్న మిర్చి నిల్వలు

నిల్వకు తావు లేక

మిర్చి రైతుల అగచాట్లు

నిలిచిపోయిన కొనుగోళ్లు

నిండిన శీతల గిడ్డంగులు

కల్లాల్లోనే చివరి కోత కాయ 

పంగులూరు, మే 5 : మిర్చి రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ ఏడాది సాగు ఆరంభం నుంచి వారిని కష్టాలు వెంటాడుతున్నాయి. ప్రకృతి ప్రతికూలత కారణంగా పెట్టుబడి ఖర్చులు పెరగ్గా దిగబడులు దిగజారాయి. మార్కెట్‌లో మంచి ధర లభిస్తే ఖర్చులైనా చేతికి వస్తాయని ఆశించిన వారికి నిరాశే ఎదురైంది. ధర భారీగా పడిపోయింది. కోతల ఆరంభంలో నాటురకం మిర్చి క్వింటా రూ.12వేల వరకూ పలికింది. తేజ రకం ధర రూ.14వేల వరకూ ఉంది. ప్రస్తుతం నాటు రకం క్వింటాకు రూ.2వేలు, తేజ రకం క్వింటాకు రూ.వెయ్యి వరకూ పడిపోయింది. అదేసమయంలో  కొనుగోళ్లు నిలిచిపోయాయి. రైతులు శీతల గిడ్డంగుల్లో పంటను నిల్వ చేసుకుంటున్నారు. ప్రస్తుతం అవి కూడా నిండిపోయాయి. దీంతో చివరి కోత కాయ కల్లాల్లోని ఉండిపోతోంది. ఈపరిస్థితి రైతులను కన్నీరు పెట్టిస్తోంది. 


భారీగా పెరిగిన పెట్టుబడి ఖర్చులు

మండలంలో ఈ ఏడాది నాటు, తేజ రకం కలిపి 5000 ఎకరాల్లో సాగు చేశారు. గత ఏడాది ధరలు ఆశాజనకంగా ఉండటంతో ఈసారి విస్తీర్ణం వెయ్యి ఎకరాలకుపైగా పెరిగింది. అయితే సాగు ఆరంభంలో అధిక వర్షాలు దెబ్బతీశాయి. దీంతో ఒకటికి రెండు సార్లు నాట్లు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదేసమయంలో చీడ, పీడల బెడద కూడా అధికమైంది. వాటి నివారణకు రైతులు అధికంగా మందులు వాడాల్సి వచ్చింది. దీంతో పెట్టుబడి ఖర్చులు పెరిగాయి. సాధారణంగా నాటు రకం ఎకరాకు రూ.లక్ష అయ్యే వ్యయం ఈసారి రూ.1.75లక్షలకు పెరిగింది. తేజ రకానికి రూ.1.40 వరకూ అయ్యే ఖర్చు ఈసారి కోత కూలితో కలిపి రూ.2 లక్షలు దాటింది.


దిగజారిని దిగుబడులు 

ప్రకృతి ప్రతికూలత, తెగుళ్ల దాడితో ఈసారి మిర్చి దిగుబడులు దిగజారాయి. సాధారణంగా ఎకరాకు 20 నుంచి 25 క్వింటాళ్ల ఉత్పత్తి వచ్చే నాటురకం ఈసారి 15 క్వింటాళ్లు దాటలేదు. అందులో ఐదు క్వింటాళ్ల తాలుకాయ ఉంది. తేజరకం అన్నీ అనుకూలిస్తే ఎకరాకు 30 క్వింటాళ్లు వస్తుంది. కానీ ఈసారి సరాసరి 10 క్వింటాళ్లు దాటలేదు. నాటురకం కన్నా తెగుళ్లు అధికంగా తేజ రకానికి ఆశించడమే ఇందుకు కారణమైంది. 


ఆరంభంలో మురిపించి..  

పంట కోతలు మొదలైన తొలినాళ్లలో మార్కెట్లో కాయకు ఉన్న డిమాండ్‌, చురుగ్గా సాగిన కొనుగోళ్లతో దిగుబడి తగ్గినా ధరలు అనుకూలంగా ఉన్నాయని రైతులు ఆనందించారు. అయితే ఆ తర్వాత క్రమంగా దిగజారడం మొదలైంది. అదేసమయంలో మార్చి  నుంచి మందకొడిగా సాగిన కొనుగోళ్లు నెలరోజుల నుంచి పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో పంట మొత్తాన్ని శీతల గిడ్డంగులకు తరలించాల్సిన పరిస్థితి నెలకొంది. ఆశాజనకంగా ఉన్న ధరలతో కల్లాల్లోనే కాయను నేరుగా అమ్ముకునే అవకాశం వచ్చిందన్న రైతుల ఆనందం ఆవిరైంది. 


శీతల గిడ్డంగులు ఫుల్‌

ఈ ఏడాది సరుకు నిల్వలు రావని భావించి డీలా పడిన శీతల గిడ్డంగుల యజమానులు ఇప్పుడు ఆనందంగా ఉన్నారు. ఇబ్బడిముబ్బడిగా వస్తున్న సరుకుకు తమ వద్ద ఖాళీ లేదని చెప్పే పరిస్థితి నెలకొంది. పంగులూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న శీతల గిడ్డంగులు నిండిపోవడంతో చివరి కోతకోసి కల్లాల్లో ఆరబోసిన అనంతరం ఎండిన కాయ నిల్వ చేసేందుకు అవకాశం లేకుండా పోయింది. గిడ్డంగుల కోసం రైతులు వెతుకులాడాల్సిన పరిస్థితి నెలకొంది. ఒక వైపు గుంటూరు మిర్చి యార్డు మూసివేయడం, మరోవైపు పెరుగుతున్న కరోనా ఉధృతి, కర్ఫ్యూ పరిస్థితులు మిరప రైతుకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే భారీగా నష్టపోవడం ఖాయంగా కనిపిస్తోంది.  

Updated Date - 2021-05-06T06:18:05+05:30 IST