పనులు ఆపేయండి

ABN , First Publish Date - 2022-02-05T04:55:02+05:30 IST

సూర్యాపేట జిల్లా పాలకవీడులోని డెక్కన్‌ సిమెంట్‌ పరిశ్రమ విస్తరణ కోసం చేపట్టిన సున్నపురాయి తవ్వకాలను నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

పనులు ఆపేయండి

సూర్యాపేట జిల్లాలోని వేర్వేరు అంశాలపై హైకోర్టు ఆదేశం

ఒకటి డెక్కన్‌ పరిశ్రమ విస్తరణ పనులపై.. 

ఆత్మకూర్‌(ఎస్‌) మండలంలో క్వారీ పేలుళ్లపై ఉత్తర్వులు

పాలకవీడు, ఫిబ్రవరి 4: సూర్యాపేట జిల్లా పాలకవీడులోని డెక్కన్‌ సిమెంట్‌ పరిశ్రమ విస్తరణ కోసం చేపట్టిన సున్నపురాయి తవ్వకాలను నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 2వ తేదీన ఉత్తర్వులు జారీచేయగా, ఏప్రిల్‌ 27వ తేదీవరకు ఇవి అమలులో ఉంటాయని పేర్కొంది. దీంతో పాలకవీడు మండలం భవానీపురంలోని మూడో నెంబర్‌ గనిలో సున్నపురాయి తవ్వకాలను గురువారం నుంచి నిలిపివేశారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. పాలకవీడు మండలం భవానీపురంలోని డెక్కన్‌ సిమెంట్‌ పరిశ్రమ విస్తరణ కోసం 2021 డిసెంబరు 9వ తేదీన ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. ఇందులో రావిపహాడ్‌లోని సైదులునామా ఫారెస్టు భూముల్లోని 26, 27 సర్వే నెంబర్లలోని 183.11(457.77) హెక్టార్లలో సున్నపురాయి కోసం తవ్వకాలు చేపట్టేందుకు స్థానికుల నుంచి ఆమోదం లభించింది. దీంతో అప్పటి నుంచి తవ్వకాలు కొనసాగిస్తున్నారు. అయితే మూడో నెంబర్‌ గనిలో తవ్వకాల కోసం అటవీ, పర్యావరణ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారంటూ 2021 డిసెంబరు 6వ తేదీన కోమటికుంట గ్రామానికి చెందిన వక్కంటి కోటేశ్వరరావు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు చీఫ్‌ జస్టి్‌సతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ నెల 2వ తేదీన విచారించింది. పిటిషన్‌దారుడి అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం మూడో నెంబర్‌ గనిలో తవ్వకాలను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో డెక్కన్‌ సిమెంట్‌ పరిశ్రమ యాజమాన్యం గురువారం నుంచి మైనింగ్‌ కార్యకలాపాలను నిలిపివేసింది. 

బ్లాస్టింగ్‌లు నిలిపివేయాలని..

ఆత్మకూర్‌(ఎస్‌): సూర్యాపేట జిల్లా ఆత్మకూర్‌(ఎస్‌) మండ కేంద్రంలోని పెద్దగుట్టపై జరుగుతున్న బ్లాస్టింగ్‌లను, క్వారీ కార్యకలాపాలను నిలిపివేయాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. బ్లాస్టింగ్‌లపై ఏడాదిగా స్థానిక అఖిలపక్ష నాయకులు, రైతులు ఆందోళనలు చేస్తున్నా ప్రజా ప్రతినిధులు పట్టించుకోకపోవడంతో బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఈ నెల 1న విచారించిన హైకోర్టు బ్లాస్టింగ్‌తో పాటు క్వారీ కార్యకలాపాలను నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. 2021 డిసెంబరు 26న పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు టాస్క్‌ఫోర్స్‌ కమిటీ విచారణ అనంతరం ఈ ఏడాది జనవరి 6వ తేదీ నుంచి క్వారీని మూసివేయాలని నివేదికను కలెక్టర్‌కు అందజేసింది. ఆ నివేదికను కలెక్టర్‌ హైకోర్టుకు సమర్పించారు. అంతకుముందు బాధితుల ఫిర్యాదుతో జిల్లా మైనింగ్‌, పొల్యూషన్‌ కంట్రోల్‌బోర్డు, రెవెన్యూ, పోలీస్‌ శాఖలు విచారణ చేపట్టారు. ఆ నివేదికల ఆధారంగా తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంత వరకూ క్వారీ కార్యకలాపాలను నిర్వహించకుండా చూడాలని కలెక్టర్‌ను హైకోర్టు ఆదేశించింది. 

న్యాయం మా వైపే ఉంది: అఖిలపక్ష నాయకులు

న్యాయం తమ వైపు ఉందని; హైకోర్టు ఉత్తర్వులు తమకు ఊరటనిచ్చాయని అఖిలపక్ష నాయకులు అన్నారు. మండలకేంద్రంలో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు తమ ఫిర్యాదులను ఎవరూ పట్టించుకోలేదని వాపోయారు. వినతులు, ధర్నాలు, ఆందోళనలు చేపట్టినా క్వారీపై చర్యలు తీసుకునేందుకు ఏ అధికారి ముందుకు రాలేదన్నారు. రెండు కిలోమీటర్ల మేర క్వారీ నుంచి రాళ్లు పంటపొలాలు ధ్వంసమయ్యేవని తెలిపా రు. సమావేశంలో అఖిలపక్ష నాయకులు డేగల వెంకటకృష్ణ, రాంరెడ్డి, తంగె ళ్ల వీరారెడ్డి, తంగెళ్ల సైదిరెడ్డి, సోమిరెడ్డి దామోదర్‌రెడ్డి, పందిరి శ్రీనివా్‌సరెడ్డి, గిలకత్తుల ఎల్లయ్య, గునగంటి శ్రీను, గంపల కర్ణాకర్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-02-05T04:55:02+05:30 IST