నిధులు నిల్‌.... పర్యవేక్షణ డల్‌

ABN , First Publish Date - 2021-09-14T05:37:19+05:30 IST

జిల్లాలో సాగర్‌ కాలువలపై పర్యవేక్షణ కరువైంది. ప్రభుత్వ ఉదాసీన వైఖరి ఇందుకు కారణమైంది. అవసరమైన స్థాయిలో అధికారులు, సిబ్బంది నియామకాలు చేపట్టకపోవడం, కాలువల మరమ్మతులకు నిధులు విడుదల చేయకపోవడంతో అయకట్టు రైతులకు అవస్థలు తప్పని దుస్థితి నెలకొంది. జిల్లాలోని కుడికాలువ పరిధిలో సుమారు 4.42 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది.

నిధులు నిల్‌.... పర్యవేక్షణ డల్‌
దర్శిలో నిర్వహణ లేక చిల్లచెట్లు మొలిచి అధ్వానంగా ఉన్న ఎన్నెస్పీ కాలువ

అధ్వానంగా సాగర్‌ కాలువల 

నిర్వహణ, నీటి సరఫరా

రెండు ఎస్‌ఈ, ఒక సీఈ పోస్టులలో ఒకే అధికారి

రాష్ట్రంలోని సాగర్‌ ఆయకట్టు అంతా ఆయన పరిధిలోనే

ఒంగోలు సర్కిల్‌ ఎస్‌ఈతో సహా రెండు ఈఈ పోస్టుల్లోనూ ఇన్‌చార్జిలు

లస్కర్లు నాల్గోవంతు కూడా లేని దుస్థితి

రెండేళ్లుగా కాలువల నిర్వహణకు 

చిల్లిగవ్వ ఇవ్వని ప్రభుత్వం

ఉనికి లేని సాగునీటి సంపులు

ఒంగోలు, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి) : 

జిల్లాలో సాగర్‌ కాలువల నిర్వహణ, నీటి సరఫరా పర్యవేక్షణ అద్వానంగా తయారైంది. డ్యామ్‌ నుంచి వస్తున్నదే అంతంతమాత్రంగా ఉంటుండగా దాన్ని జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో ఉన్న పంట పొలాలకు అందించే వ్యవస్థ ప్రభుత్వ నిర్లక్ష్యంతో నిర్వీర్యమైంది. కీలకమైన మేజర్‌, మైనర్‌ కాలువల మరమ్మతులకు చిల్లిగవ్వ కూడా విడుదల చేయకపోవడంతో అనేక ప్రాంతాల్లో డ్రాపులు పగిలి, చిల్లచెట్లతో మూసుకుపోయి, అక్కడక్కడా గండ్లు పడి దర్శనమిస్తున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో నీటి ప్రవాహం ముందుకు సాగని పరిస్థితి నెలకొంది. నీటి సరఫరా వ్యవస్థను పర్యవేక్షించే అధికారులు, సిబ్బంది పోస్టులు పెద్ద సంఖ్యలో ఖాళీగా ఉన్నాయి. మరోవైపు క్షేత్రస్థాయిలో కీలకమైన లస్కర్లు నాల్గో వంతు కూడా లేకపోవడంతో పంట పొలాలకు నీరందించే ప్రక్రియ చాలాప్రాంతాల్లో స్థానిక రైతులే నిర్వహించుకోవాల్సిన దుస్థితి నెలకొంది. దీని వల్ల పలుచోట్ల వివాదాలు నెలకొని ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. ఇక  నీటి సంపులు ప్రస్తుత ప్రభుత్వం వచ్చాక ఉనికిలో లేకుండా పోయాయి. ఈ పరిస్థితులన్నీ సాగర్‌ ఆయకట్టు రైతులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. 

జిల్లాలో సాగర్‌ కాలువలపై పర్యవేక్షణ కరువైంది. ప్రభుత్వ ఉదాసీన వైఖరి ఇందుకు కారణమైంది. అవసరమైన స్థాయిలో అధికారులు, సిబ్బంది నియామకాలు చేపట్టకపోవడం, కాలువల మరమ్మతులకు నిధులు విడుదల చేయకపోవడంతో అయకట్టు రైతులకు అవస్థలు తప్పని దుస్థితి నెలకొంది. జిల్లాలోని కుడికాలువ పరిధిలో సుమారు 4.42 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ కాలువ త్రిపురాంతకం ఎగువన 85/3 మైలు వద్ద జిల్లాలోకి ప్రవేశిస్తుంది. కురిచేడు వరకూ ప్రధాన కాలువగా.. అక్కడి నుంచి దర్శి వరకు దర్శి బ్రాంచి కాలువ (డీబీసీ), దర్శి నుంచి ఒంగోలు వరకు  ఒంగోలు బ్రాంచి కాలువ (ఓబీసీ)గా పిలుస్తారు. అలాగే గుంటూరు జిల్లా చేజర్ల నుంచి అద్దంకి బ్రాంచి కాలువ వస్తుంది. గుంటూరు జిల్లాలో 18 మైళ్లు ప్రవహించి సంతమాగులూరు మండలం అడవిపాలెం సమీపంలో 18/0 మైలు నుంచి మన జిల్లాలోకి ప్రవేశిస్తుంది. ఇది పర్చూరు దిగువ వరకూ సాగుతుంది. 


జిల్లాలో 116 మేజర్లు.. 136 మైనర్లు

సాగర్‌ ఆయకట్టులో ఉన్న 4.42లక్షలకు నీరందించేందుకు బ్రాంచి కాలువలకు అనుబంధంగా 116 మేజర్లు, 136 మైనర్‌ కాలువలు ఉన్నాయి. ఒంగోలు సర్కిల్‌లో ఎస్‌ఈతోపాటు మూడు డివిజన్లకు ముగ్గురు ఈఈలు, వారి కింద 11 మంది డీఈలు, 48 మంది జేఈలు, 68 మంది వర్క్‌ ఇన్‌స్పెక్టర్లు, 345 మంది లస్కర్లు నీటి సరఫరాను పర్యవేక్షించాల్సి ఉంది. ఒంగోలు సర్కిల్‌ కూడా ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు సాగర్‌ డ్యామ్‌ సీఈ పర్యవేక్షణలో ఉండగా,  విభజన అనంతరం ఒంగోలులో ప్రాజెక్టుల సీఈ పరిధిలోకి రాష్ట్రంలోని సాగర్‌ కాలువల పర్యవేక్షణను తెచ్చారు. అలా సీఈ కూడా ఒంగోలులోనే ఉండి మన జిల్లాతోపాటు గుంటూరు, ఎడమకాలువ  కింద కృష్ణా జిల్లాలో ఉన్న ఆయకట్టు పర్యవేక్షణ చూడాల్సి ఉంది. సీఈ కూడా ఒంగోలులోనే ఉండటంతో నీటి సరఫరా ఎంతో కొంత మెరుగుపడే అవకాశం ఉంటుందని రైతులు భావించగా  నిలకడగా ఇటీవల ఆ స్థాయి పోస్టులలో అధికారులు లేక ఆవస్థలు పడాల్సి వస్తోంది. 


ఉన్నతాధికారుల పోస్టులన్నింటిలోనూ డిప్యుటేషన్‌లే!

ప్రస్తుతం సాగర్‌ కాలువల పర్యవేక్షణ తీరు చూస్తే ఉన్నతాధికారుల పోస్టులన్నింటిలోనూ డిప్యుటేషన్లపైనే పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఒంగోలులో ఉన్న సీఈ మూడు పోస్టులలో పని చేస్తున్నారు. జిల్లాలో ఏమాత్రం సంబంధం లేని కర్నూలు జిల్లాలోని నంద్యాలలో ఉన్న తెలుగుగంగ ప్రాజెక్టు ఎస్‌ఈగా ఉన్న శ్రీనివాసరెడ్డికి ఒంగోలులోని ప్రాజెక్టుల నిర్మాణ సర్కిల్‌ ఎస్‌ఈగా, అలాగే సీఈ బాధ్యతలు అప్పగించారు. ఆయన జిల్లాలో వేలాది కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న వెలిగొండతోపాటు గుండ్లకమ్మ, ఇతర ప్రాజెక్టుల పనులను పర్యవేక్షించారు. సాగర్‌ కుడికాలువ పరిధిలోని 11.50 లక్షల  ఎకరాలు, కృష్ణా జిల్లాలో ఉన్న మరో లక్ష ఎకరాల ఆయకట్టు నీటి సరఫరా, జిల్లాలోని 1.75 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండే చిన్న, మధ్యతరహా  వనరుల పర్యవేక్షణతోపాటు నంద్యాలలోని తెలుగుగంగ సర్కిల్‌ పనులను కూడా చూడాలి. వారంలో రోజుకు ఒక జిల్లాలో ఉన్న కార్యాలయంలో సంతకాలు కూడా సరిగా పెట్టలేనంత పని ఒత్తిడి ఆయనకు ఉండగా, నీటి సరఫరా నియంత్రణ ఎలా అన్నది ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇక సీఈ తర్వాత జిల్లా ఉన్నతాధికారి ఎస్‌ఈ కాగా ఇక్కడ ఎస్‌ఈగా పనిచేస్తున్న రెడ్డెయ్య మూడు నెలలు క్రితం ఉద్యోగ విరమణ చేశారు. ఒంగోలు డివిజన్‌ చిన్ననీటి వనరుల విభాగం ఈఈగా పనిచేస్తున్న లక్ష్మీరెడ్డికి అదనపు బాధ్యతలు అప్పగించారు. నిజానికి సదరు ఈఈ మార్కాపురం డివిజన్‌ మినహా జిల్లాలోని ఇతర ప్రాంతాలన్నింటిలో ఉండే వందలాది చెరువులు, పలు మధ్య తరహా వనరులను పర్యవేక్షించాలి. అలాంటి అధికారికి సర్కిల్‌ బాధ్యతలు  అప్పగించారు. 


ఈఈలు, డీఈలు, జేఈల కొరత

జిల్లాలో ఉన్న ఎన్‌ఎస్పీ మూడు డివిజన్లకు ఈఈలు అధిపతులుగా ఉండగా రెండు చోట్ల ఈఈలుగా ఇతర ప్రాంతాల వారు డిప్యుటేషన్‌పై పనిచేస్తున్నారు. ఇతర క్యాడర్లు చూస్తే 11 మంది డీఈలకు 8 మంది పనిచేస్తుండగా 48 మంది జేఈలకు 36 మంది, 68మంది వర్క్‌ఇన్‌స్పెక్టర్లకు 33 మంది, కీలకమైన 345 మంది లస్కర్లకు  కేవలం 89 మంది మాత్రమే ఉన్నారు. క్షేత్రస్థాయిలో కాలువలకు అవసరమైన కనీస మరమ్మతులు, పంట పొలాలకు నీటిని చేర్చడంలో లస్కరు కీలకం కాగా ఉండాల్సిన దానిలో నాల్గో వంతు మంది కూడా లేక నీటి సరఫరా అస్తవ్యస్తమైంది.  అనేకచోట్ల అసలు మేజర్‌, మైనర్‌ కాలువలకు నీరు పోతుందో లేదో, ఎక్కడన్నా తెగి వాగులు, వంకలకు చేరుతున్నాయా లేక అక్రమవాడకం జరుగుతున్నదా అని క్షేత్రస్థాయి పరిస్థితిని చెప్పేదిక్కు  కూడా అధికారులకు ఉండటం లేదు. గడిచిన రెండేళ్ళుగా కాలువల  మరమ్మత్తులు, నిర్వహణకు ప్రభుత్వం చిల్లిగవ్వ ఇవ్వకపోవడంతో అనేక చోట్ల కాలువల పరిస్థితి ఆధ్వానంగా ఉంది.  


Updated Date - 2021-09-14T05:37:19+05:30 IST